Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:55AM

లెవీ...లెక్క!


25 శాతం లెవీకే కేంద్రం పట్టు.. క్షేత్రస్థాయి అధికారులకు వర్తమానం
మిగిలిన 75 శాతం పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న?
వంద శాతం క స్టమ్‌ మిల్లింగ్‌కు మిల్లర్ల పట్టు
ధాన్యం మార్కెట్‌పై వ్యాపార వర్గాల్లో మీమాంస

తాడేపల్లిగూడెం: అనుకున్నదే జరిగింది.. కేంద్ర ప్రభుత్వం లెవీ సేకరణను కుదించేసింది. కొన్నేళ్లపాట ఊరిస్తూ వచ్చిన లెవీ కుదింపును ఈసారి పక్కాగా అమలు చేయడానికే మొగ్గు చూపింది. క్షేత్ర స్థాయిలో భారత ఆహార సంస్థ శాఖలకు వర్తమానం వచ్చేసింది. ఈ ఏడాది నుంచి 25శాతం మాత్రమే లెవీని సేకరించనున్నారు. ఇప్పటిదాకా 75శాతం లెవీ సేకరించే విధానానికి స్వస్తి చెప్పారు. కేంద్ర అవసరాలకు మాత్రమే సేకరిస్తున్నట్టు తేల్చేశారు. అంతవరకు(1వ పేజీ తరువాయి)
సవ్యంగానే ఉన్నా మిగిలిన 75శాతం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రెం డు పంటలు పుష్కలంగా పండే పశ్చిమలో పూర్తి స్థాయిలో లెవీ సేకరణ లేకపోతే ధాన్యం మార్కెట్‌లో అస్తవ్యస్తం కానుందన్న భా వనతో వ్యాపారులు ఉన్నారు. భారత ఆహార సంస్థ మాత్రం 25శాతం తీసుకోనుంది. మిగిలిన 75శాతం రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందంటూ ఎఫ్‌సిఐ అధికారులు చెబుతున్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలంటే వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తుంది. ఆ వ్య వహారం అంత ఆషామాషీ కాదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎఫ్‌సిఐ మాదిరిగా మిల్లర్లనుంచి లెవీని సేకరించేందుకు రాష్ర్టానికి అవకాశం లేదు. ధాన్యం కొనుగోలు చేయాలి. వాటిని మిల్లర్లకు అప్పగించి బియ్యాన్ని సేకరించాలి. ఈ విధానం పంజాబ్‌, చత్తీస్‌ఘడ్‌ వంటి రాష్ర్టాల్లో ఎప్పటినుంచో అమలులో ఉన్నది. ఒరిస్సా గత రెండేళ్ల నుంచి అ మలు చేస్తున్నది. దానివల్ల ఆ రాష్ర్టాల్లో ధా న్యం మద్దతు ధరకు ఢోకా ఉండడ ం లేదు. పశ్చిమలోనూ మద్దతు ధర లభిస్తున్నది. ఇప్పటిదాకా లెవీకి 75శాతం అప్పగిస్తుండడంతో మ ద్దతు ధరకే మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. ఈసారి మూడో వంతుకు తగ్గించి వేయడంతో బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి మార్కెట్‌ ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయాలని తలపోస్తున్నది. రాష్ర్టానికి అవసరమైన పౌరసరఫరాలకు అవసరమైన బియ్యా న్ని సిద్ధం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకతప్పని పరిస్థితి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ పద్ధతిలో మిల్లర్లకు అప్పగిస్తుంది. దానికి స రిపడా బియ్యాన్ని మిల్లర్లనుంచి సేకరిస్తుంది. వాటిని పౌరఫరాలకు ఉపయోగిస్తుంది. అయితే ఇప్పటిదాకా ఎటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి తమకు కస్టమ్‌ మిల్లింగ్‌కు అప్పగించాలంటూ మిల్లర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాలకు సరిపడా మాత్రమే కొనుగోలు చేస్తే ఇబ్బందు లు తప్పవన్న ఆందోళనతో మిల్లర్లు ఉన్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రాకపోవడంతో ఏం జరుగుతుందోనన్న గుబు లు వర్తక వర్గాల్లో నెలకొన్నది. పశ్చిమలో ఉత్పత్తి అయ్యే బియ్యానికి అంతగా మార్కెట్‌ ఉండడం లేదన్నది మిల్లర్ల వాదన. దానివల్లే ఎప్పటిలాగే 75శాతం లెవీ, 25శాతం ఓపెన్‌ మార్కెట్‌ పశ్చిమకు అనుకూలమన్న వాదన ను వినిపిస్తున్నారు. లేదంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్‌ మిల్లింగ్‌ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి అనేక సాంకేతిక సమస్యలు అడ్డురానున్నాయి. పశ్చిమలో సార్వాసాగులో వరికోత యంత్రాలతో వబ్బిడి చేయడం పరిపాటిగా మారుతున్నది. తేమ శాతం అధికంగా ఉంటా యి. దానివల్ల ధరలో కోత విధించి మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం అటువంటి ధాన్యంపైనా ఒక నిర్ణయానికి రావాలి. ఇటు వంటి సమస్యలన్నీ అధిగమించినప్పుడే ధా న్యం కొనుగోలు అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సునాయాస మవుతుంది. దానికితోడు గోదాములు సమస్య ఉండనే ఉంది. మార్కెట్‌ కమిటీల్లో గోదాములు కొంత మేర ఉపయోగపడనున్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకుని త్వరితగతిన ఒక నిర్ణయానికి రావాలి. లేదంటే సీజన్‌ ప్రారంభమైతే మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనుకానుంది. రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.