Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:48AM

అసౌకర్యాల నడుమ పూతలపట్టు రైల్వేస్టేషన్‌


పూతలపట్టు: రైల్వేస్టేషన్ల అభివృద్ధి పేరిట కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు మంజూరు చేస్తున్నాయి. అయితే అవన్నీ కొన్నింటికే పరిమితమవుతున్నాయన్నది వాస్తవం. ఇందుకు అరకొర వసతుల నడుమ ఉన్న పూతలపట్టు రైల్వేస్టేషన్‌ నిదర్శనం. మండలకేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో పూతలపట్లు రైల్వేస్టేషన్‌ ఉంది. నిత్యం స్టేషన్‌ను వందల మంది ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. స్టేషన్‌కు వెళ్ళే రోడ్డు కంకరతేలి గుంతలమయంగా ఉన్నా పట్టించుకునే వారు లేరు. రాత్రయితే వీధిదీపాలు లేక ఈ దారిన వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లకు నీటిసౌకర్యం లేక మూలనపడ్డాయి. దీంతో బహిర్భూమికి కోసం వ్యవసాయ పొలాల వద్దకు పరుగులు తీస్తున్నారు. భద్రత విషయంలో ప్రయాణికులు, ఉద్యోగులకు ఆందోళన నెలకొంది. స్టేషన్‌ సమీపంలో రైల్వేగేటు పర్యవేక్షణ సాగిస్తున్న మహిళపై ఐదు నెలల కిందట గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి, బంగారు గొలుసు లాక్కెళ్ళారు. పగటి వేళ మందుబాబులు రైల్వేస్టేషన్‌ వెళ్ళే దారిలో మద్యం తాగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి స్టేషన్‌ సమస్యలను పరిష్కరించి, ప్రయాణికుల పాట్లు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.