Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:46AM

రిషివ్యాలీ అథారిటీ అభివృద్ధి అడియాసేనా

కురబలకోట: రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రముఖ విద్యాసంస్థ రిషివ్యాలీని ప్రత్యేక అథారిటీ కింద ఎంపిక చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రత్యేక అథారిటీ కింద ఎంపిక చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన వసతులతో పాటు జీవనోపాధి సౌకర్యం లభిస్తుందని కొండంత ఆశతో ఎదురుచూసిన ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. రిషివ్యాలీ అథారిటీ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధిచేయడానికి పలుమార్లు రాష్ట్రస్థాయి అధికారులు మాస్టర్‌ప్లాన్‌ను రూపొం దించడంతో పాటు రిషివ్యాలీ అభివృద్ధిపై పలుమార్లు సమా వేశాలు నిర్వహించగా, అవి సమావేశాలకే పరిమితం కాగా అభివృద్ధిలో అంగుళం కూడా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో అథారిటీ అభివృద్ధిపనులపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నీరు గారిపోతున్నాయి. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన ప్రముఖ విద్యాసంస్థ రిషివ్యాలీని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ప్రత్యేక అథారిటీ కింద ఎంపిక చేసింది. కురబలకోట మం డలం తెట్టు, కురబలకోట పంచాయతీల్లోని కొన్నిగ్రామాలను అథారిటీ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. తెట్టు పంచాయతీ పరిధిలో దాదాపుగా 5,900 ఎకరాల్లో, కురబలకోట పంచాయతీ పరిధి లోని ఎగువచిన్నమర్రి, దిగువచిన్నమర్రి,కంటేవారిపల్లె, తదితర గ్రామాల కింద దాదాపుగా 1600 ఎకరాలలో అభివృద్ధి చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు భూగర్భజలాలు బాగా ఉండేవి. క్రమేణా భూ గర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో తిరిగి భూగర్భ జలాల పెంపునకు అథారిటీ కింద ఎంపిక చేసి అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ అథారిటీ పరిధిలో చెరువులు, కుంటలు, అడవుల పెంపకం, చెక్‌డ్యాంల నిర్మాణం, ఇంకుడు గుంతలు, ప్రజలను ఆర్థికంగా బలపరచడానికి గొర్రెలు, మేకల పెంపకదార్లను ప్రోత్స హించడానికి బ్యాంకుల నుంచి రుణసౌకర్యం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. దాదాపుగా ఆరేళ్ల క్రితం రిషివ్యాలీని ప్రత్యేక అథారిటీ కింద ఎంపిక చేసినా అథారిటీ అభివృద్ధిపనులు మాత్రం ఏమాత్రం ముందుకు సాగ లేదు. నామమాత్రంగా చిన్నచిన్న చెక్‌డ్యాంలు, పూడికతీత పనులు కూడా అంతంత మాత్రంగానే చేపట్టి చేతులు దులుపుకున్నారు. అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రటరీ రమేష్‌కుమార్‌, జిల్లాకలెక్టర్‌ రవి చంద్రన్‌లు పలుమార్లు రిషి వ్యాలీ విద్యాసంస్థలో సమావేశం నిర్వహించి అక్కడ అభివృద్ధికి తీసుకోవాల్సిన సలహాలు, సూచనలను చర్చించడం జరిగింది.
అయితే ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా రిషివ్యాలీ అథారిటీ అభివృద్ధిపై నీలి నీడలు అలుముకోవడంతో కొంచెం కూడా ముందుకు సాగక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.