Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:46AM

తాగునీటి సమస్య పరిష్కరించండి

రాగిమానుమిట్ట గ్రామస్తుల వేడుకోలు
కుప్పం రూరల్‌: ట్యాంకులకు అమర్చిన పైపులు మరమ్మతులకు గురికావడంతో గత నెల రోజులుగా తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడిందని రాగిమానుమిట్ట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో కూడా తాగునీటి సమస్యను రాతపూర్వకంగా విన్నవించుకున్నా ఎటువంటి స్పందన రాలేదన్నారు. గ్రామంలో ఉన్న చేతిపంపు కూడా మరమ్మతులకు గురైంది. కొత్తగా వేసిన బోరులో నీరు పుష్కలంగా ఉన్నా పైపులైన్లు బిగించకపోవడంతో నీటి సమస్య తీవ్ర మైందన్నారు. రక్షిత తాగునీటి ట్యాంకు ఉన్నా అది శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారిందన్నారు. దీంతో తాగునీటి కోసం సమీపంలోని వ్యవసాయ బావులు, వాగులు, వంకల నుంచి బిందెలతో మోసుకొచ్చుకోవాల్సి వస్తోందన్నారు. ఏ ఒక్క ప్రజా ప్రతినిధిగానీ, అధికారికాని తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషిచేయడం లేదని ధ్వజమెత్తారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యంతోనే నీటి సమస్య తీవ్రమైందని ఆరోపించారు. ఉన్నతాధికారులు తక్షణం స్పందించి రాగిమానుమిట్టలో తాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.