
అక్రమ రవాణాకు పుంగనూరు రాచమార్గం - జీరో వ్యాపారాల జోరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి
పుంగనూరు: రెండు రాష్ట్రాల సరిహద్దులోని పుంగనూరు మార్గం ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతూ జీరో వ్యాపారాలకు రాచమార్గంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో చెక్‌పోస్టులు లేని పలు మార్గాల్లో వస్తువులు, సరుకులు అక్రమంగా తరలుతున్నాయి. ఏ వస్తువుకు ఏ రాష్ట్రంలో డిమాండ్, ఎక్కువ ధర ఉంటే అక్కడికి పొరుగు రాష్ట్రం నుంచి వస్తువులు వెళ్తుంటాయి. ఒక వస్తువు కర్నాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలంటే కొనుగోలు బిల్లుతో పాటు వ్యాట్ చెల్లించాలి. ఒకే రాష్ట్రంలో అయినప్పటికీ వస్తువు రవాణాకు సంబంధించి టీవోటీ, అమ్మకం పన్నులు ప్రభుత్వానికి చెల్లించి తగిన అనుమతులు, పర్మిట్లతో తరలించాలి. కానీ ఆంధ్రా నుంచి రేషన్ బియ్యం, ఇసుక, బెల్లం, వేరుశెనగ, చింతపండు, టమోటా, కిరోసిన్, గ్రానైట్, కొయ్యలు తదితర వస్తువులు కర్నాటక రాష్ట్రంలోని పలు పట్టణాలకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా యధేచ్ఛగా అక్రమంగా రవాణా అవుతున్నాయి. పుంగనూరు నుంచి వనమలదిన్నె మీదుగా కర్నాటకాలోని కిరిమినిమిట్ట, ఈడిగపల్లె నుంచి చెంబకూరు, పూలగూరుకోట మీదుగా, రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లె నుంచి ముళబాగల్, పుంగనూరు మార్లపల్లె నుంచి ఆరడిగుంట మీదుగా కర్నాటకలోని కిరిమినిమిట్ట, పుంగనూరు నుంచి బైరెడ్డిపల్లె క్రాస్, రాజుపల్లె, కురప్పల్లె, కీలకిరి, మీదుగా కర్నాటకలోని పలు ప్రాంతాలకు రోడ్డు మార్గం ఉంది. కర్నాటక నుంచి బంగారం, వెండి, మైదా, చెక్కెర, సిగరెట్లు, గుట్కా, వక్కలు, బట్టలు, పలురకాల విత్తనాలు, వివిధ రకాలైన ఎలక్ర్టికల్ వస్తువులు, పప్పుధాన్యాలు, ఆహార వస్తువులు ఎలాంటి పన్నులు చెల్లించకుండా పుంగనూరుకు చేరిపోతున్నాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కేవలం మదనపల్లె సమీపంలోని చీకలబైలు, పలమనేరు వద్ద చెక్‌పోస్టులు ఉండటంతో పుంగనూరు ప్రాంతం నుంచి ఎలాంటి అడ్డూ లేకుండా కర్నాటకకు ఉన్న అడ్డ దారులు అక్రమ రవాణాకు నల్లేరు నడకగా మారింది. దీంతో ప్రభుత్వానికి ఏటా కోట్ల రూపాయల్లో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. పుంగనూరుకు దిగుమతి అయ్యే వస్తువులు జిల్లాలోని ముఖ్య నగరాలు, పట్టణాలతో పాటు ఇతర జిల్లాలకు కూడా రవాణా అవుతున్నాయి. నెల రోజుల్లోనే రేణిగుంట నుంచి కల్లూరు, పుంగనూరు మీదుగా కర్నాటకకు వెళ్తున్న రెండు లారీల రేషన్ బియ్యాన్ని పీలేరు సర్కిల్లో పోలీసులు పట్టుకుని ప్రభుత్వానికి అప్పజెప్పారు. అలాగే సోమల కేంద్రంగా నడుస్తున్న రేషన్ బియ్యం రాకెట్‌ను పోలీసులు చేధించి నిందితులను అరెస్ట్ చేసి చౌకదుకాణాల బియ్యాన్ని సీజ్ చేశారు. పలుమార్లు ఇసుక లారీలు, గుట్కా ఆటో, ఎలక్ర్టికల్ వస్తువులను పోలీసులు పట్టుకుని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారు. పుంగనూరు ప్రాంతం నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా గ్రానైట్ బ్లాకులు లారీల్లో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్రమ వ్యాపారాలను అడ్డుకోవాల్సిన విజిలెన్స్, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్‌ట్యాక్స్ అధికారులతో పాటు పోలీస్, రెవెన్యూ, అటవీశాఖాధికారులు పట్టించుకోకపోవడంతో చీకటి వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వానికి ఆదాయం చేకూరేలా అక్రమ రవాణాను అరికట్టాల్సి ఉంది.