Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:45AM

తొట్టంబేడును ఆదర్శంగా తీర్చిదిద్దుతా: మంత్రి బొజ్జల

శ్రీకాళహస్తి: నియోజకవర్గంలో తొట్టంబేడు మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. తొట్టంబేడు మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాధారణ, స్థానిక ఎన్నికల్లో తొట్టంబేడు ప్రజలు తనకు అండగా నిలిచారని దీంతో మండలాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. తెలుగుగంగ నీటిని చెరువులకు అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా మండలంలో అర్హులైన వారందరికీ పక్కా గృహాలు, రేషన్‌కార్డులు వంటి ప్రభుత్వ పథకాలు అందేటట్లు చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులు నిర్మించాలని సూచించారు. ఇక గ్రామీణ తాగునీటి శాఖ అధికారులపై మంత్రి మండిపడ్డారు. చాలా చోట్ల నీటి సమస్య ఉన్నప్పటికీ పట్టించుకోలేదన్నారు. అదేవిధంగా నీటిపారుదలశాఖ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని చెప్పారు. మండల సమావేశానికి కొని శాఖల అధికారులు హాజరు కాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాసరంలో ఆంగ్ల మాధ్యమం లేకపోవడంపై సుమారు 150 మంది విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్నారని చెప్పారు. అదే విధంగా కొండ్రాజులపల్లె పాఠశాల ఉపాధ్యాయుడు లేని కారణంగా మూతబడినట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మండలాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. కాగా అంతకు మునుపు మండల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో నరసింహమూర్తి, తహసీల్దారు వీరాస్వామి, ఎంపీపీ పోలమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు అనసూయమ్మ, సింగిల్‌విండో అధ్యక్షుడు మోహన్‌కిషోర్‌ నాయుడు, తెలుగురైతు నాయకుడు గురవయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.