Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:44AM

అటవీ సిబ్బందిపై ‘ఎర్ర’కూలీల రాళ్ల దాడి


చంద్రగిరి: శేషాచలం అడవుల్లోంచి ఎర్రచందనం దుంగలను కొందరు కూలీలు అక్రమంగా తరలిస్తుండగా అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అటవీ అధికారులపై ఎర్రచందనం కూలీలు రాళ్లతో దాడిచేశారు. అటవీ అధికారులు ప్రతిదాడికి దిగడంతో కారులో పలాయనం చిత్తగించే క్రమంలో ఫారెస్ట్‌ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో వాహనం బోల్తాపడి, ముగ్గురు అటవీ సిబ్బందికి గాయాలయ్యా యి. శేషాచలం అడవుల్లో నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నారని ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి ఫారెస్ట్‌ సిబ్బంది, 11వ బెటాలియన్‌ పోలీసులు రెండు టీమ్‌లుగా ఏర్పడి చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట, మూలపల్లి అటవీ ప్రాంతం పరిసరాల్లో నిఘా పెట్టారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో మూలపల్లి అటవీ ప్రాంతం నుంచి సుమారు 20 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను తీసుకొచ్చి వాహనంలోకి లోడ్‌ చేస్తుండగా ఫారెస్ట్‌ అధికారులు దాడులు చేశారు. కూలీలు వెంటనే రాళ్లతో అధికారులపై దాడికి దిగారు. అప్రమత్తమైన అటవీ అధికారులు ప్రతిదాడికి దిగడంతో కూలీలు అడవుల్లోకి పరారయ్యారు. ముగ్గురు కూలీలు ఎర్రచందనం దుంగలు లోడ్‌ చేసిన వాహనాన్ని తీసుకుని పరారవడానికి మూలపల్లి నుంచి ఎ.రంగంపేట రూట్‌లోకి వచ్చారు. ఫారెస్ట్‌ అధికారులు తమ వాహనంతో కూలీల వాహనాన్ని వెంబడించారు. ఆ సమాచారాన్ని ఎ.రంగంపేటలో కాపుకాచి ఉన్న 11వ బెటాలియన్‌ పోలీసులకు ఇవ్వడంతో వారు మూలపల్లివైపు బయల్దేరారు. ఎదురుగా వస్తున్న పోలీసుల వాహనాన్ని పసిగట్టిన కూలీలు తమ కారును మళ్లీ వెనక్కు తిప్పారు. ఈ సమయంలో వెనుకనుంచి వస్తున్న ఫారెస్ట్‌ సిబ్బంది తమ వాహనంతో రోడ్డును అడ్డగించే ప్రయత్నం చేశారు. ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న కూలీలు చిన్నరామాపురం వద్ద తమకారుతో ఫారెస్ట్‌ వాహనాన్ని పక్కనుంచి ఢీకొట్టారు. దీంతో ఫారెస్ట్‌ వాహనం బోల్తాపడి.. బేస్‌ క్యాంప్‌ సిబ్బంది వంశీ, కళ్యాణ్‌, సుబ్రహ్మణ్యంలకు గాయాలయ్యాయి. వెంటనే కారులోని ముగ్గురు కూలీలు వాహనాన్ని వదిలి అడవుల్లోకి పరారవుతుండగా.. గమనించిన చిన్నరామాపురం గ్రామస్తులు వెంబడించి ఓ కూలీని పట్టుకున్నారు. ఈ సంఘటనలో 16 ఎర్రచందనం దుంగలను వాహనంసహా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ కూలీది వేలూరు జిల్లా సిలమ్‌బరసన్‌గా విచారణలో తేలింది. ఈ దాడిలో ఎఫ్‌ఎస్‌వో నటరాజ్‌, ఎఫ్‌బీవోలు కోదండపాణి, సురేష్‌, శంకరప్ప, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది, 11వ బెటాలియన్‌ పోలీసులు పాల్గొన్నారు.