Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 02:41AM

ప్రజల సంపదను కొల్లగొట్టే నైపుణ్యం మాకు లేదు


రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల
రుణమాఫీపై రైతులు ఆందోళన చెందొద్దు
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

పెద్దపల్లి/బీర్కూర్‌, సెప్టెంబర్‌ 13 : రాత్రికి రాత్రే ప్రాజెక్టుల అంచనాలను పెంచి.. ప్రజల సంపదలను కొల్లగొట్టే నైపుణ్యం మాత్రం తమకు లేదని.. కానీ ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూలగొట్టే నైపుణ్యం ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లిలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చి ఎల్లంపల్లి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 835 కోట్లు ఉండగా, తెల్లవారేసరికి దానిని రూ. 1350 కోట్లకు పెంచి కమీషన్లు దండుకున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈ విషయమై మొత్తుకున్నప్పటికీ ఆంధ్రా పాలకులు పట్టించుకోలేదన్నారు.
తెలంగాణలో కిలో మీటరు పరిధిలో గోదావరి నీరు, సింగరేణి బొగ్గు ఉన్నప్పటికి ఇక్కడ విద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మించకుండా తట్ట్టెడు బొగ్గు దొరకని విశాఖ, విజయవాడ, కడపలాంటి ప్రాంతాల్లో ఆంధ్రా పాలకులు పక్షపాత ధోరణితో ప్లాంట్లను నిర్మించుకున్నారన్నారు. జల ప్రాజెక్టుల ద్వారా 7921 మెగావాట్ల విద్యుత్‌ తయారుతుందని, ఇందులో 6700 మెగావాట్లు తెలంగాణకు అవసరం అవుతుందన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో కేవలం బొగ్గు ఆధారంగా 4417 మెగా వాట్ల ఉత్పత్తి మాత్రమే అవుతుండడంతో 2300 మెగా వాట్ల విద్యుత్‌ లోటు ఉందన్నారు. 2017కల్లా కొరత నుంచి మిగులు విద్యుత్‌ను సాధిస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్‌ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరకీ రుణమాఫీ చేసి తీరుతామని, రైతులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.
శనివారం నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌లో మంత్రి పోచారం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 4లక్షల 12వేల మంది రైతులకు రూ.78కోట్ల రుణమాఫీ వర్తించనున్నదని తెలిపారు. తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఒక్క పైసా ఇవ్వకుండా ఆంధ్రప్రాంత రైతులకే పంట నష్టపరిహారం అందించారని వెల్లడించారు. దసరా నుంచి అన్నీ సంక్షేమ పథకాలను ప్రారంభిస్తునట్లు మంత్రి తెలిపారు.