Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:42AM

టార్గెట్‌ 75ఒలింపిక్స్‌ తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఆసియా క్రీడలు. ఈ నెల 19 నుంచి 17వ ఆసియా గేమ్స్‌ దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ వేదికగా ఆరంభం కానున్నాయి. ఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన.. పదివేలకు పైగా అథ్లెట్లు.. 36 క్రీడావిభాగాల్లో.. 439 స్వర్ణాల కోసం పోటీపడనున్నారు. ఎప్పటిలాగే చైనా, జపాన్‌లు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌, స్విమ్మింగ్‌లో ఆధిపత్యం చూపడానికి సిద్ధమవుతున్నాయి. సెపక్‌ తక్రాకు ఆసియాడ్‌లో అవకాశం కల్పించారు. కబడ్డీలో భారత్‌ అప్రతిహత విజయయాత్రకు సై అంటుంటే.. షూటింగ్‌ వీరులు స్వర్ణాలపై గురిపెట్టారు. యోగేశ్వర్‌ లాంటి మల్లయోధులు పసిడి పట్టుకు రెడీ అయితే.. హాకీలో సత్తాచాటడానికి సర్దార్‌ సేన ఉరకలేస్తోంది. గ్వాంగ్‌జులో అదరగొట్టి ఆరో స్థానంలో నిలిచిన భారత్‌.. ఈ సారి పతకాల పట్టికలో మరింత ఎగబాకాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇంచియాన్‌లో 70-75 పతకాతో మెరవాలని భారత బృందం ఆశిస్తోంది.

భారత్‌ పతకాల అంచనా
సమరానికి సిద్ధమైన అథ్లెట్లు
19 నుంచి ఆసియా క్రీడలు

భారత్‌ నెమ్మదిగా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిన ఆసియా క్రీడలన్నింటిలోనూ.. 2010 గ్వాంగ్‌జు క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించారు. 14 స్వర్ణాలతో కలిపి మొత్తం 65 పతకాలతో.. ఓవరాల్‌ పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇది ఒకరకంగా మనసామర్థ్యం పెరుగుతుందని అనుకున్నా.. 199 స్వర్ణాలు సాధించి అందనంత ఎత్తులో ఉన్న చైనాతో పోటీపడాలంటే సుదీర్ఘ ప్రయాణం సాగాల్సిందే. బీజింగ్‌లో కబడ్డీ అందించిన ఒకే ఒక స్వర్ణంతో దారుణంగా 11వ స్థానంలో నిలిచిన భారత్‌.. అప్పటి నుంచి మెరుగ్గా రాణిస్తూనే వస్తుంది. ఇంచియాన్‌కు భారత్‌ 679 సభ్యులున్న భారీ బృందాన్నే పంపుతోంది. ఇందులో 516 మంది అథ్లెట్లుకాగా.. 163 మంది సహాయ సిబ్బంది. భారత ఒలింపిక్‌ సంఘం కూడా ఈ టోర్నీలో 70 నుంచి 75 పతకాలు సాధించగలమనే ధీమాతో ఉంది భారత బృందం. ఒక్క కబడ్డీలోనే భారత్‌ అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తోంది. కానీ రెజ్లింగ్‌లో సుశీల్‌ కుమార్‌, బాక్సింగ్‌లో విజేందర్‌ సింగ్‌తో పాటు టాప్‌ టెన్నిస్‌ ఆటగాళ్లు ఆసియాడ్‌ నుంచి తప్పకోవడం భారత పతకాల సంఖ్యపై ప్రభావం చూపనుంది. గ్వాంగ్‌జులో దక్కిన పతకాల్లో సగం అథ్లెటిక్స్‌ (12), బాక్సింగ్‌ (9), షూటింగ్‌ (8) నుంచి వచ్చినవే. ఈసారి కూడా భారత పతకాల వేట ఈ మూడు విభాగాల చుట్టే తిరగనుంది. కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత వికాస్‌ గౌడ, ట్రిపుల్‌ జంపర్‌ అర్పీందర్‌తోపాటు మహిళల 4400 రిలేలో పతకాలపై భారీగా అంచనాలున్నాయి.
షూటింగ్‌లో సై..: భారత పతకాల వేటలో అంచనాలకు మించి రాణించేది షూటింగ్‌ విభాగమే అని చెప్పుకోవచ్చు. పిస్టల్‌లో జీతూ రాయ్‌, ప్రకాశ్‌ నంజప్ప, అపూర్వి చాన్‌ రాయ్‌.. 10 మీ ఎయిర్‌ రైఫిల్‌లో అపూర్వి చండేలాలు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఒలింపిక్‌ పతక విజేతలు అభినవ్‌ బింద్రా, గగన్‌ నారంగ్‌, విజయ్‌ కుమార్‌లు పతకాల సంఖ్యను మరింతగా పెంచనున్నారు. కామన్వెల్త్‌లో చాన్స్‌ మిస్సయిన విలుకాళ్లు.. ఈసారి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీపికా కుమారితో పాటు మరో ఇద్దరు ఆర్చరీలో పతకాలు సాధించే అవకాశం ఉంది. తెలుగమ్మాయి జ్యోతి సురేఖ కూడా పతకం రేసులో ఉంది.
అనుమతిస్తే బాక్సింగ్‌లో..: దేశ జెండా కింద ఆడేందుకు బాక్సర్లకు అనుమతి లభిస్తే.. భారత్‌ పంచ్‌ గట్టిగా పడనుంది. ఒలింపియన్‌ మేరీ కోమ్‌పై భారీ అంచనాలున్నాయి. కామన్వెల్త్‌ బెర్త్‌ మిస్‌ చేసుకున్న కోమ్‌.. రెట్టింపు కసితో పతకం సాధించాలనే దూకుడు మీదుంది. అఖిల్‌ కుమార్‌ అండ్‌ కో కూడా సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే గాయం కారణంగా విజేందర్‌ సింగ్‌ దూరంకావడం ప్రతికూలాంశం.
సానియాపైనే ఆశలు..: ఆసియాడ్‌లో ఆడతానని టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ప్రకటించడంతో ఈ విభాగంలో పతకంపై అంచనాలు పెరిగాయి. అయితే పురుషుల విభాగంలో సోమ్‌దేవ్‌, పేస్‌, బోపన్న లాంటి ఆటగాళ్లు దూరంకావడంతో టెన్నిస్‌లో పతకం కష్టమేననిపిస్తోంది.
సైనా, సింధులపైనే..: బ్యాడ్మింటన్‌లో పతకావకాశాలు ప్రధానంగా ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధుపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. చైనాకు చెక్‌ చెప్పాలంటే వీరిద్దరి వల్లే సాధ్యం. డబుల్స్‌లో గుత్తా జ్వాల వైదొలగడం కొంత మేర ప్రభావం చూపనుంది. కామన్వెల్త్‌ స్వర్ణ పతక విజేత కశ్యప్‌తోపాటు శ్రీకాంత్‌, గురుసాయి దత్‌, ప్రణవ్‌ చోప్రా, సుమీత్‌ రెడ్డిలు పురుషుల విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కామన్వెల్త్‌ పసిడి విజేతలు దీపిక పల్లికల్‌, జోష్న చిన్నప్పలు స్క్వాష్‌లో అంచనాలు పెంచుతున్నారు.
పునర్వైభవం సాధించాలని..: కామన్వెల్త్‌లో రాణించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత హాకీ జట్టు ఆసియాడ్‌లో స్వర్ణం సాధించాలని పట్టుదలగా ఉంది. 1998 తర్వాత భారత్‌కు స్వర్ణం దక్కలేదు. అంతర్గత విభేదాల కారణంగా డిఫెండింగ్‌ చాంప్‌ పాకిస్థాన్‌ కొన్ని ప్రముఖ టోర్నీలకు దూరమైంది. కాబట్టి ఈ సారి ఆ జట్టు నుంచి గట్టి పోటీ ఉండకపోవచ్చు.
ఏడోసారి కబడ్డీ.. కబడ్డీ..: ఆసియాడ్‌లో భారత్‌ ఆధిపత్యం చూపుతున్న ఏకైక క్రీడ కబడ్డీ. 1990లో ఆసియాడ్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్‌ వరుసగా ఆరు స్వర్ణాలు సాధించింది. ఈ సారి కూడా కచ్చితంగా పసిడి నెగ్గుతుందనే భారీ అంచనాలున్నాయి. మహిళల కబడ్డీ జట్టు కూడా రెండో స్వర్ణంపై కన్నేసింది. రెజ్లింగ్‌లో ఒలింపిక్‌ పతక విజేత యోగేశ్వర్‌ దత్‌ నేతృత్వంలో బృందం కనీసం రెండు స్వర్ణాలను భారత్‌ ఖాతాలో చేర్చొచ్చు.