Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:31AM

నేతన్నకు తీపి కబురు

ఆర్థిక ఊబిలో కూరుకుపోతున్న చేనేతకు ప్రభుత్వం చేయూతనందించింది. వారికి అమలులో ఉన్న ఆరోగ్య పథకాన్ని మరింత మెరుగు పరిచి రూ.37,500లతో రాషీ్ట్రయ స్వయం బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై)ని అక్టోబరు నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. 2.58 లక్షల మంది కార్మికులకు వచ్చే నెల నుంచి లబ్ధి చేకూరేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

నెల్లూరు - రూరల్‌ : చేనేత కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించనున్నది. ఆరోగ్య పథకాన్ని మరింత మెరుగు పరచి కార్మికులకు రూ. 37,500తో రాషీ్ట్రయ స్వయం బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై)ని అక్టోబరు నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ పథకం కింద 2.58లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరేలా చేనేత,జౌళిశాఖ జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆరోగ్యానికి పెద్దపీట
వెంకటగిరి, పాటూరు, బంగారుపేట, మన్నార్‌పోలూరు, వింజమూరు, నారాయణరెడ్డిపేట, చెన్నూరు, కోవూరు, యల్లాయాపాళెం, సంగంలలోని నేత కార్మికులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆరోగ్యానికి పెద్దపీట వేయడానికి నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబరులో నూతన పధకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్న నేపధ్యంలో నేతన్నలకు కూడా తీపి కబురు వినిపించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో 1.48 లక్షల మంది కార్మికులు చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఆరోగ్యబీమా పధకంతోపాటు ఐసీఐసీఐ హెల్త్‌ స్కీంలు ఉన్నాయి. వీరితోపాటు మరో 60 వేల మంది పవర్‌లూమ్‌ కార్మికులకు కూడ నూతన పథకం వర్తింప చేసేందుకు చేనేత,జౌళిశాఖ యోచిస్తున్నది.చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న 50 వేల మంది ఉపవృత్తుల కార్మికులకు ఆర్‌ఎస్‌బీవైను అనుసంధానం చేయనున్నారు.
కొత్త పథకంతో ప్రయోజనం
ఆర్‌ఎస్‌బీవై పధకంతో రూ. 37,500లు ఆరోగ్య ఖర్చులకు ఇస్తారు. ఇందులో నేతన్నలను స్పష్టంగా గుర్తించి మాత్రమే లబ్ధిదారులుగా చేర్చనున్నారు. గతంలో చేనేత కుటుంబంలో నలుగురికి మాత్రమే అవకాశం ఉండేది. హెచ్‌ఐఎస్‌ను సడలించి ఐదుమందికి కొత్తగా అవకాశం కల్పిస్తున్నారు. గతంలో పుట్టిన రోజు నుంచి 80 ఏళ్లగా వయసు పరిమితి నిర్ధారించగా, నూతన పధకంలో వయసుతో సంబంధం లేకుండా ప్రయోజనం చేకూర్చనున్నారు. హెచ్‌ఐఎస్‌ పధకంలో రూ. 15 వేలు మాత్రమే కార్మికులకు లబ్ధి చేరగా, కొత్తగా ఆర్‌ఎస్‌బీవైలో రూ. 37, 500కు పెరిగింది. పైగా ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలకు రూ. 30 వేలు, పరీక్షలు, స్వల్ప చికిత్సలకు మరో రూ. 7,500 లబ్ధి చేకూరుతుంది. ఈ పధకంలో చేరేందుకు ప్రతి కార్మికుడు రూ. 20లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. గతంలో రూ. 100 చెల్లించాల్సి ఉండేది.


త్వరలో అమలు
కొత్త పధకం త్వరలో అమల్లోకి వస్తుంది. అక్టోబరు నుంచి అమల్లోకి రావచ్చు. ఈ పధకం కార్మికుల పాలిట వరం.చేనేతలంతా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.
-బాబ్జీరావు, ఏడీ
చేనేత, జౌళిశాఖ