Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:28AM

ఆధార్‌ సీడింగ్‌కు పరుగులు


(జియ్యమ్మవలస)
ఆధార్‌.. ఇది ప్రస్తుతం అన్నింటికీ ఆధారం. అన్ని శాఖల్లో ఉన్న లబ్ధిదారులకు తప్పనిసరి అవసరం. ఈ నేపథ్యంలో ఆధార్‌ సీడింగ్‌ త్వరగా పూర్తిచేయాలని ఉన్నతాధికారుల నుంచి మండల, గ్రామస్థాయి అధికారులకు ఆదేశాలు ఉండడంతో వారు లబ్ధిదారుల వద్దకు పరుగులు తీస్తున్నారు.
మండలంలో 58 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. దాదాపు 10 వేల మంది రైతులు ఉన్నారు. అలాగే మండలంలో 31 పంచాయతీల పరిధిలో 28 ఎఫ్‌పీ షాపులు, నాలుగు డీఆర్‌ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 10,077 పీడీఎస్‌ కార్డులు, 3477 ఏఏవై కార్డులు, 40 ఏపీ కార్డులు, 1703 ర్యాప్‌, టేప్‌ కార్డులు, 678 రెండో విడత ర్యాప్‌ కార్డులు కలిపి మొత్తం 15,975 కార్డులు ఉన్నాయి. ఈ కార్డులు, వెబ్‌ల్యాండ్‌ ఆధార్‌ సీడింగ్‌ చేయడంలో బిజీగా ఉన్న అధికారులు చాలా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌కు చెందిన ఆధార్‌ సీడింగ్‌ 55 శాతం అయిందని, రేషన్‌ కార్డులు ఆధార్‌ సీడింగ్‌ 80 శాతం వరకు పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడి, ఇంకోవైపు గడువు సమీపిస్తుండటంతో వీఆర్‌వోలు ఆధార్‌ సీడింగ్‌ నిమిత్తం ఆయా గ్రామాల పరిధిలో గల రైతులు ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారో తెలుసుకుని అక్కడకు వెళ్లి వారి ఆధార్‌ కార్డు వివరాలు పొందుపరిచేపనిలో ఉన్నారు. ఒకవైపు రైతులు సరిగా సహకరించక మరోవైపు అధికారులకు ఏమి చెప్పాలో తెలియక ఇరకాటంలో పడి నలుగుతున్న వీఆర్‌వోలు గడువు నాటికి ఆధార్‌ సీడింగ్‌ పూర్తి చేయాలని శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలాఉండగా 15,975 రేషన్‌ కార్డులు ఆధార్‌ సీడింగ్‌ చేసే పనిలో డీలర్లు నిమగ్నమైనప్పటికీ రేషన్‌ కార్డులు నమోదైన పేర్లుకు, కొత్తగా ఆధార్‌ కార్డులో నమోదైన పేరుకు పొంతలేకుండా ఉండడంతో చాలా చోట్ల ఇబ్బందిపడుతున్నారు. చివరికి రేషన్‌ కార్డు నెంబరు ప్రకారం ఆధార్‌ కార్డు నెంబర్లు వేసి ఇచ్చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆధార్‌ సీడింగ్‌ విషయంలో ఒరిజినల్‌ కార్డులు రావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్‌ సీడింగ్‌ ప్రక్రియ పూర్తి చేయడానికి వీఆర్‌వోలు, వివిధ శాఖల అధికారులు ఇంకా ఎంత శ్రమించాల్సిఉందో.