Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:19AM

రైతుబజార్లు మెరుగుపడేనా?

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, వినియోగదారులకు తక్కువ ధరలకు సరుకులను అందించేందుకు తెలుగుదేశంపార్టీ గతంలో రైతుబజార్లను ఏర్పా టు చేసింది. దళారుల జోక్యం లేకుండా రైతులే విక్రయాలు చేపట్టాలని నిబంధన పెట్టింది. కాగా రైతుబజార్లలో ఈ నిబంధన అమలుకావడంలేదు. ఎక్కువశాతం మంది వర్తకులే రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేసి, వాటిని రైతుబజార్లలో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సరసమైన ధరలకు విక్రయించాల్సిన వస్తువులకు గిరాకీ నెలకొల్పుతున్నారు. గిట్టుబాటులేక రైతులు.. ధరాఘాతంలో వినియోగదారులు సతమతమవుతున్నారు. ఫలితంగా రైతుబజార్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస మున్సిపాల్టీలోని రైతుబజార్లు ఈ పరిస్థితికి అద్దంపడుతున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో ఇవి అభివృద్ధికి దూరమయ్యాయి. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడంతో రైతుబజార్లకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ నెల 15నుంచి వారోత్సవాలు నిర్వహించి, వాటిని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. రైతుబజార్లలో రైతులకు గుర్తింపు కార్డులిచ్చి.. దళారీ వ్యవస్థ అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది. వినియోగదారుల ముంగిళ్లకే కూరగాయాలు అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. కూరగాయలు సాగు చేసే ఉత్తమ రైతులకు ప్రోత్సాహాకాలను అందజేయనుంది. అధిక దిగుబడి సాధించేందుకు ప్రోత్సహించనుంది. వారోత్సవాలను పురస్కరించుకుని రైతుబజార్ల నిర్వహణ, సమీక్షలు, శిక్షణ వంటి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.
వారోత్సవాలతో చైతన్యం :
ఫ శ్రీకాకుళం, ఆమదాలవలస రైతుబజార్లలో అధికారులు ఈనెల 15 నుంచి వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు రైతులకు అవగాహన కోసం చైతన్య సదస్సులు నిర్వహిస్తారు. మౌలిక వసతుల కొరత గుర్తిస్తారు. తూనిక రాళ్లను సంబంధింత అధికారులు పరిశీలించనున్నారు. కచ్చితమైన తూకంలో విక్రయాలు చేపట్టేలా చర్యలు చేపట్టనున్నారు. ఫ దఽళారులను గుర్తించి రైతుబజార్‌ నుంచి పంపించేస్తారు. కూరగాయలు పండించే రైతులే విక్రయాలు చేపట్టేలా ఫోటో గుర్తింపు కార్డులను అందజేస్తారు. గ్రామ, రెవెన్యూ, ఉద్యానశాఖ అధికారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. ఫ రైతుబజార్‌లో సరైన ధరల నిర్వహణ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజూ ధరల నమోదు పట్టికను కొనసాగించాలని ఆదేశిస్తారు. రైతు బజార్లలో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమాన్ని చేపడతారు. రైతులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. ఫ కూరగాయలు నాణ్యత ఆధారంగా అమ్మకాలు నిర్వహించాలన్నది కూడా పరిశీలనలో ఉంది. ఇందులో భాగంగా రైతులకు కూరగాయల గ్రేడింగ్‌పై అవగాహన కల్పిస్తారు. గ్రేడింగ్‌పై శిక్షణ అందిస్తారు. ఫ రైతు బజార్లలో కూరగాయల అమ్మకాల నిర్వహణపై సమీక్ష జరిపి సంచార కూరగాయల అమ్మకాలపై నిర్ణయం తీసుకుంటారు. రైతుబజార్లను బలోపేతం చేయనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఈ అంశాలను పక్కాగా అమలుచేస్తే రైతుబజార్లు బలోపేతమయ్యే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.