Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:17AM

రూ. వంద కోట్లతో పోలీసులకు వాహనాలు - హోంమంత్రి చినరాజప్ప


వినుకొండటౌన్‌, సెప్టెంబర్‌ 13 : వంద కోట్ల రూపాయలతో పోలీసులకు వాహనాలను సమకూరుస్తున్నామని, పోలీసుల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటిని అంచెలంచెలుగా నెరవేరుస్తామని తెలిపారు. నేరాలను అదుపునకు, త్వరగా నిందితులను పట్టుకునేందుకు వీలుగా పట్టణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన మూడు నెలల కాలంలో రౌడీయిజం, గూండాయిజం తగ్గాయన్నారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిందని, అప్పటి సీఎం వైఎస్‌ ఫ్యాక్షన్‌ హత్యలను పెంచిపోషించారని చెప్పారు. అవినీతికి పాల్పడే ఏ అధికారినీ వదిలిపెట్టమని, అన్ని శాఖల మాదిరిగానే పోలీస్‌ విభాగంలోనూ నిఘా ఉంటుందని తెలిపారు. అవినీతికి పాల్పడే పోలీస్‌ అధికారులపై డీజీపీ స్థాయిలో విచారణ ఉం టుందని చెప్పారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుల్‌ లేని పోలీస్‌స్టేషన్లలో వారిని నియమిస్తామని చెప్పారు. అక్టోబర్‌ 2 నుంచి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లను పెంచనున్నట్లు తెలిపారు.
రాష్ట్రం విడిపోయిన తరుణంలో రాజధానిగా విజయవాడను ప్రకటించిన చంద్రబాబు ప్రతిజిల్లాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రతి జిల్లాలో ఉండేలా కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే పరిపాలన మొత్తాన్ని విజయవాడకు తరలించనున్నట్లు హోంమంత్రి చెప్పారు. ప్రతి రైతుకుటుంబానికి రూ. 1.50 లక్షల రుణామాఫీ జరుగుతుందని, రుణాలు కట్టిన వారికి కూడా ఇది వర్తిస్తుందని ఆయన తెలిపారు.
కేసీఆర్‌ది నియంత పాలన
తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగానే ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేసిందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. దైవదర్శనానికి శ్రీశైలం వెళుతూ శనివారం వినుకొండలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో తుగ్లక్‌ పరిపాలన నడుస్తుందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేశారన్నారు. తెలంగాణ కేబినెట్‌లో కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తూ తనసహచరులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పనిలేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మతితప్పిన వాడిలా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అధికారం ఉందనే అహంకారంతో తెలంగాణలో ఎంఎస్‌వోలను బెదిరించి ప్రసారాలను నిలిపివేయించడం అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజలపాలిట కేసీఆర్‌ మరో హిట్లర్‌గా తయారయ్యాడని, త్వరలోనే కేసీఆర్‌ ఆగడాలను గమనించి తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ అండ్‌ కోను తెలంగాణ నుంచి తరిమివేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు.