Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 23:11PM

శ్రీదేవిని లొకేషన్‌కు ఎత్తుకెళ్లేవాడిని...

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న నిర్మాత రామానాయుడు. అనేక భారతీయ భాషలలో వందకు పైగా చిత్రాలను నిర్మించిన ఆయన చిత్ర విశేషాల మాలిక - ‘మూవీ మొఘల్‌’ ఆ పుస్తకంలోని కొన్ని ఆసక్తికర భాగాలు..

 
కెమెరా మాంత్రికుడు మార్కస్‌ బార్‌ట్లే పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చే సినిమా ‘మాయాబజార్‌’. ఆ సినిమాలో కెమెరాతో ఆయన చేసిన మాయలు అన్నీ ఇన్నీ కావు. విజయా వారి చిత్రాలకే పరిమితమైన బార్‌ట్లే 1965లో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేసి, ఇతర నిర్మాతల చిత్రాలకూ పనిచేశారు. తెలుగులో ఆయన చివరి చిత్రం ‘చక్రవాకం’. ఈ చిత్రం ఆయన పనితనానికి మరోసారి అద్దం పడుతుంది. ముఖ్యంగా కాశ్మీరులో చిత్రీకరించిన సన్నివేశాలు సింప్లీ సూపర్బ్‌. తెలుగు చిత్రాలకి విదేశీ మార్కెట్‌ ఏర్పరచాలన్న తనపతో రామానాయుడు ‘చక్రవాకం’ చిత్రాన్ని ఆంగ్ల సబ్‌ టైటిల్స్‌తో ‘మ్యూజిక్‌ ఆఫ్‌ లవ్‌’ పేరుతో విదేశాల్లో విడుదల చేశారు. విదేశీ ప్రేక్షకుల ప్రశంసలు ఈ చిత్రానికి లభించాయి. తెలుగులో మాత్రం ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.
తొలి రీరికార్డింగ్‌
తెలుగు చిత్రాలను ఎక్కడ నిర్మించినా రీరికార్డింగ్‌ మాత్రం మద్రాసులో చేయడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో, ఆ సదుపాయాన్ని హైదరాబాద్‌లో కల్పించారు రామానాయుడు. ఆయన నిర్మించిన రామానాయుడు రికార్డింగ్‌ థియేటర్‌ని 1995 మే 12న మహానటుడు ఎన్టీఆర్‌ ప్రారంభించారు. ఆ థియేటర్‌లో రీరికార్డింగ్‌ జరుపుకొన్న తొలి చిత్రం ‘తాజ్‌మహల్‌’. 1995లో నిర్మించిన తెలుగు చిత్రం, హిందీ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో అపజయాలతోనే ఆ ఏడాది ముగుస్తుందేమోనని భయపడిన రామానాయుడికి ‘తాజ్‌మహల్‌’ చిత్రం ఘనవిజయం సాధించి ఊరట కలిగించింది. జాతీయ సమైక్యతాభావం నేపథ్య సందేశంగా కలిగిన ఈ చిత్రం 1996 ఢిల్లీలో జరిగిన 27వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోని మెయిన్‌స్ర్టీమ్‌ విభాగంలో ప్రదర్శితమై ప్రశంసలందుకొంది.
బిందెల సాంగ్‌
‘దేవత ’ చిత్రం పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ ఆసినిమాలోని బిందెల సాంగ్‌. ‘వెల్లువొచ్చి గోదారమ్మా...’ అనే ఆ పాటని శోభన్‌బాబు, శ్రీదేవిపై రాజమండ్రి సమీపంలోని అగ్రహారంలో గోదావరి ఒడ్డున చిత్రీకరించారు. పాటల చిత్రీకరణలో తనదైన ప్రత్యేకత కలిగిన రాఘవేంద్రరావు బోర్లించిన బిందెల నేపథ్యంలో ఈ పాటని కొత్త తరహాలో తీసి ప్రశంసలందుకున్నారు. రాజమండ్రి నుంచి వందల సంఖ్యలో కొత్త బిందెలు కొని తెచ్చి ఈ పాటకోసం ఉపయోగించేవారు. రోజూ బోట్‌లో గోదావరి మధ్యలోకి వెళ్లేవారు. బోట్‌ దిగాక లొకేషన్‌ చేరుకోవాలంటే కొంతదూరం బురదలో నడవాలి. బురదలో నడిస్తే శ్రీదేవి కాస్ట్యూమ్స్‌ పాడవుతాయని తనే ఆమెని ఎత్తుకుని లొకేషన్‌కి తీసికెళ్లే వాడినని రామానాయుడు ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ చెబుతారు.
.......
కారంచేడులో కథ తయారైంది
‘దేవత’ ఘన విజయం తరువాత రామానాయుడు మల్టీస్టారర్‌గా ‘ముందడుగు’ చిత్రం తీస్తున్నట్లు ప్రకటించగానే... ‘దేవతలో డబ్బులు వచ్చాయి కదా.. అవి కాస్తా పోతాయిలే’ అనే కామెంట్స్‌ మొదలయ్యాయి. తిట్లే ఒక్కోసారి ఆశీస్సులవుతాయని అంటుంటారు. అది రామానాయుడు విషయంలో ఎన్నోసార్లు రుజువైంది కూడా. జనం ఎలా అనుకున్నా తనుచేయాలనుకున్నది చేసే మనస్తత్వం ఆయనది. మంచికథతో ఆ సినిమా తీసి విమర్శకుల నోళ్లు మూయించాలనుకున్నారు. పరుచూరి సోదరులను కారంచేడు తీసుకెళ్లి ఓ నెలరోజులు కూర్చోబెట్టి అద్భుతమైన కథ తయారుచేయించారు.
........
అదే రామానాయుడు గొప్పతనం
తొలిసారిగా దర్శకత్వం వహించే వ్యక్తికి రామానాయుడు వంటి నిర్మాత దొరకడం ఒకరకంగా అదృష్టమే. ఎందుకూ.. అనే ప్రశ్నకి సమాధానంగా ‘సంఘర్షణ’ చిత్రం షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటనని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఔట్‌డోర్‌ షూటింగ్‌ ఊటీలో ప్లాన్‌ చేశారు రామానాయుడు. తీరా అక్కడికి వెళ్లేసరికి వర్షం ఎదురైంది. తరువాత అది తుపానుగా మారింది.
ఔట్‌డోర్‌ షూటింగ్‌ అంటే రామానాయుడికి బ్రయిట్‌లైట్‌, బ్లూ స్కై తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే వర్క్‌ చేయడానికి ఆయన ఒప్పుకోరు. వర్షం కొంచెం తగ్గగానే ఉన్న లైటింగ్‌లోనే షూటింగ్‌ చేద్దామని ఛాయాగ్రాహకుడు లోక్‌సింగ్‌ అనగానే ‘నువ్వు స్కైని ఎవాయిడ్‌ చేసి షూటింగ్‌ చేస్తావు... వద్దులే’ అనేశారు రామానాయుడు. దాంతో వారం రోజులు షూటింగ్‌ లేకుండానే హోటల్‌ రూమ్స్‌కే పరిమితమయ్యారు యూనిట్‌ సభ్యులు. ఆ తరువాత కూడా వాతావరణంలో పెద్ద మార్పులు లేకపోయినప్పటికీ లోక్‌సింగ్‌ బలవంతం మీద కొన్ని సీన్లు తీసి, షూటింగ్‌కి ప్యాకప్‌చెప్పారు. వర్క్‌ అలాగే మిగిలిపోయింది. ఆ వర్క్‌ కోసం మళ్లీ ఊటీ వెళ్లకుండా చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేద్దామని దర్శకుడు మురళీమోహనరావు లొకేషన్ల కోసం వెదుకుతుంటే, ఒక రోజు రామానాయుడు పిలిచి షెడ్యూల్‌ ప్లాన్‌ ఏమిటని అడిగారు. ‘మళ్లీ ఊటీ వెళితే చాలా ఖర్చవుతుందని ఇక్కడే షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నాను సార్‌’ అని చెప్పారు మురళీ మోహనరావు. వెంటనే రామానాయుడు ‘ఖర్చు విషయం నేను ఆలోచించాలి కానీ ఆ గొడవ నీకెందుకయ్యా.. ఇది నీ తొలి సినిమా. ఎంత బాగా తియ్యాలో ఆలోచించు. మిగిలిన విషయాలు నాకు వదిలెయ్యి’ అన్నారు.
.........
జడ్జి పాత్రలో రామానాయుడు
తన సినిమాలో ఎక్కడో ఒక చోట చిన్న పాత్రలో కనిపించడం నిర్మాత రామానాయుడుకి అలవాటు. అయితే ‘సూరిగాడు’ సినిమాలో పూర్తిస్థాయి పాత్రలో ఆయన నటించారు. కథని కీలకమైన మలుపు తిప్పే జడ్జి పాత్ర అది. టెన్నిస్‌ ఆడుతున్న రామానాయుడు మీదే సినిమాలో ఓపెనింగ్‌ షాట్‌ ఉంటుంది. ఆయన ఇంతకుముందు పోషించిన పాత్రలకు భిన్నంగా, గంభీరంగా ఈ పాత్ర సాగింది.
........
మరోసారి సోగ్గాడు
విజయవంతమైన ఒక చిత్రానికి ఉన్న టైటిల్‌ను కొన్నేళ్ల తరువాత వేరే నిర్మాత తన సినిమాకు పెట్టుకోవడం చిత్రపరిశ్రమలో సాధారణంగా జరిగే విషయమే. అయితే ఒకసారి తను పెట్టిన టైటిల్‌ను మళ్లీ మరో సినిమాకి పెట్టే నిర్మాతలు అరుదుగా కనిపిస్తారు. ఈ విషయంలో రామానాయుడి పేరుని ప్రత్యేకంగా పేర్కొనాలి. శోభన్‌బాబు హీరోగా తను నిర్మించిన ‘సోగ్గాడు’ చిత్రం టైటిల్‌నే దాదాపు 30 ఏళ్ల తరువాత తరుణ్‌ హీరోగా నిర్మించిన చిత్రానికీ పెట్టి కొత్త సంప్రదాయానికి తెరతీశారు.
మూవీమొఘల్‌
రచయిత: యు. వినాయకరావు
వెల: 300 రూపాయలు
ప్రతులకు: జయా పబ్లికేషన్స్‌, ఫోన్‌: 98851 79428