Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 18:48PM

మెదక్‌లో నియోజకవర్గంలో 67 శాతం పోలింగు, క్రిందటిసారి ఓటింగుతో పోలిస్తే పది శాతం తక్కువ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13: మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గానికి శనివారంనాడు జరిగిన ఉప ఎన్నిక శనివారంనాడు ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో నిల్చున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. సుమారు 67 శాతం ప్రజలు ఈ ఓటింగులో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తమ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఈ ఉపఎన్నికలో సాయంత్రం ఐదు గంటలవరకు సుమారు 64 శాతం పోలింగు జరిగినట్టు అంచనా. అప్పటివరకూ క్యూలో నిల్చున్నవారికి కూడా ఓటు వేసే అవకాశం ఇవ్వడంతో చివరికి మరో గంట వరకూ పోలింగు కొనసాగింది. ఫలితంగా ఓటింగు శాతం మరో మూడు శాతం వరకు పెరిగి ఉంటుందని అంచనా.

శనివారం ఉదయం పోలింగు ప్రశాంతంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఇవిఎంలు మొరాయించడంతో అక్కడక్కడా ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల స్వల్ప లాఠీచార్జి జరిగింది. నర్సాపూర్‌లో అత్యధికంగా అంటే దాదాపు 76 శాతం పోలింగు జరిగింది. పటాన్‌చెరువులో మాత్రం అత్యంత అల్పంగా పోలింగు జరిగినట్టు తెలుస్తున్నది. మొత్తం 9000 మంది పోలీసులు పకడ్బందీగా ఈ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఈ నియోజకవర్గంలో జరిగిన పోలింగుతో పోల్చితే ఇపడు సుమారు పది శాతం తగ్గవచ్చునని భావిస్తున్నారు. దూర ప్రాంతాలలో నివసిస్తున్నవారు ఇటీవల జరిగిన సమగ్ర సర్వేకు అధిక శ్రమకోర్చి రావడంతో ఇంతలోనే మళ్లీ ఓటు వేయడానికి రావడానికి ఇబ్బందులు పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. అలాగే బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు కూడా రాబోతున్నాయి. ఈ కారణాలవల్లే ఓటింగు శాతం తగ్గి ఉంటుందని భావిస్తున్నారు.