Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 04:06AM

నేనేం తప్పుగా మాట్లాడలేదు

మీడియా వక్రీకరిస్తోంది.. చానళ్ల ఆపివేతతో సంబంధం లేదు
కావాలంటే ఎంఎస్‌వోలతో యాజమాన్యాలు మాట్లాడుకోవాలి
గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ వివరణ
జస్టిస్‌ కట్జుకు ఆ విషయం తెలిసి ఉండాల్సింది: కవిత

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): ‘‘పది కిలోమీటర్ల లోతున పాతరేస్తాం. మెడలు విరిచేస్తాం’’ అంటూ మీడియాకు హెచ్చరికలు జారీ చేసిన కేసీఆర్‌.. తన వ్యాఖ్యలను గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ వద్ద సమర్థించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాళ్లు, తెలంగాణ సమాజాన్ని గౌరవించాలనే కోణంలోనే తాను మాట్లాడానని ఆయనకు చెప్పారు. సీఎం కేసీఆర్‌ శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు 3 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్‌ తొలుత పరిపాలనాపరమైన అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత తనంత తానుగా ఇటీవల వరంగల్‌లో కాళోజీ శతజయంతి వేడుకల సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. ‘‘నేను నెగటివ్‌గా ఏమీ అనలేదు. తప్పుగా మాట్లాడింది కూడా ఏమీ లేదు. తెలంగాణ గడ్డపై ఉండాలని అనుకుంటున్నప్పుడు, ఇక్కడి ప్రజలను అవమానించకూడదనే దృక్పథంతోనే మాట్లాడాను. అయినా కావాలని మీడియా నా వ్యాఖ్యలను వక్రీకరిస్తోంది’’ అని చెప్పారు
. తెలంగాణలో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి‘, టీవీ 9 ప్రసారాల నిలిపివేత నిర్ణయం కేబుల్‌ ఆపరేటర్లు తీసుకున్నారని, ప్రభుత్వం తీసుకోలేదని తెలిపారు. ఏదైనా ఉంటే ఆ చానళ్ల యాజమాన్యాలు కేబుల్‌ ఆపరేటర్లతో మాట్లాడుకోవాలని, అసలు ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన చానళ్ల ప్రసారాలను నిలిపివేశారని, ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీవీ చానళ్ల ప్రసారాలు ఇక్కడ ఎందుకనే భావనలో కేబుల్‌ ఆపరేటర్లు ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల న్యూస్‌ కవరేజీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన కొన్ని టీవీ చానళ్లు, పత్రికల ప్రతినిధులను అనుమతించలేదని ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ చెప్పిన విషయాలన్నిటినీ గవర్నర్‌ మౌనంగా విని ఊరుకున్నారని సమాచారం.