
8770 గ్రామాల రెవెన్యూ రికార్డుల నవీకరణ
70వేల చ .కి.మీ. పరిధిలోని 7 జిల్లాల్లో సర్వే
అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది రికార్డు
ఏళ్ల తరబడి సాగుతున్న వివాదాలకూ ఫుల్స్టాప్
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): ఏకకాలంలో కోటికి పైగా కుటుంబాల వివరాలు సేకరించడానికి సమగ్ర ఆర్థిక, సామాజిక సర్వే చేసి.., చరిత్ర సృష్టించిన తెలంగాణ ప్రభుత్వం, మరో చారిత్రక సర్వే దిశగా అడుగులేస్తోంది. తొమ్మిది దశాబ్దాల కిందట హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేయగా... మళ్లీ అదే స్థాయిలో తెలంగాణలోని 7 జిల్లాల్లోని 8770 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఈ సర్వేకు చేయూతనందించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సుముఖత వ్యక్తం చేసింది. సర్వే కోసం రూ. 266 కోట్ల నిధులు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా, అంచనా వ్యయంలో 60 శాతానికిపైగా కేంద్రం తన వాటాగా రూ.145 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది.
వారంలోగా ఈ నిధులు తెలంగాణ ఖజానాకు జమ కానున్నాయి. మిగిలిన నిధులను సేకరించుకునేందుకు ఆర్థిక శాఖ సుముఖత వ్యక్తం చేయడంతో వారం లోగా టెండర్ల ప్రకటన జారీ కానుంది. భూభాగాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ విమానంతో తొలుత డిజిటల్ టెక్నాలజీతో ఫొటోలు తీయనున్నారు. ఈ ఫొటోల ఆధారంగా గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా భూములను కొలిచి, రెవెన్యూ రికార్డులను నవీకరిస్తారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో భూ భారతి కింద సమగ్ర సర్వే పూర్తయింది. మరోవైపు కరీంనగర్ జిల్లాలో జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ పథకం కింద సర్వేకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇక మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాలో సమగ్ర భూ సర్వే జరుగనుంది.
తెలంగాణలోని 7 జిల్లాలు 70 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. 2008 రేట్ల ప్రకారం ఒక చదరపు కిలో మీటర్‌ను సమగ్ర సర్వే చేసి, రికార్డులను నవీకరించడానికి రూ.16,500లను వసూలు చేసేవారు. 2014 నాటికి ఈ ధర కాస్తా రూ.35 - 45 వేలకు చేరింది. ఆధునిక పరికరాలతో సర్వే చేయడం తేలిక. దీంతో ప్రస్తుతం సమగ్ర భూసర్వేకు 2008 నాటి ఽధరలనే చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా సర్వే నెంబర్లలో ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని గుర్తించి, ప్రైవేట్ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయన్న వివరాలను రెవెన్యూ రికార్డులో చేర్చుతారు. ఆ తర్వాత ఈ రికార్డులపై అభ్యంతరాలను స్వీకరించి, వాటి పరిష్కారం తర్వాత సదరు వివరాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చి తుది రికార్డును ప్రభుత్వం రూపొందించనుంది.
ఏళ్లుగా సమగ్ర భూ సర్వే జరుగకపోవడంతో ఒక్కో భూమికి ఐదారు మంది యాజమానులు పుట్టుకొస్తున్నారు. కొందరు దొంగ పాస్బుక్కులతో వేల కోట్ల రూపాయల రుణాన్ని పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం సందిల్ల గ్రామంలో రుణ మాఫీ లబ్ధిదారుల జాబితాలోని 559 మంది రైతుల పేరిట రుణాలుండగా, 232 మంది దొంగ డాక్యుమెంట్లతో రుణాలు పొందారని తేలింది. దీనికంతటికీ సరైన పత్రాలు లేకపోవడమే కారణమని ప్రభుత్వం గుర్తించింది. రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.17 వేల కోట్లు వెచ్చిస్తుండగా, అందులో రూ.7 వేల కోట్ల దాకా బోగస్ పట్టాలతో పొందిన రుణాలకు జమ కానుంది. సరైన రికార్డులతో ఈ మోసాలకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక గ్రామాల్లో భూ వివాదాలు కూడా ఇట్టే పరిష్కారమయ్యే వీలుంది. సమగ్ర భూ సర్వే పూర్తి కాగానే ప్రతి రికార్డులను మ్యానువల్‌గానూ, ఆన్‌లైన్‌లోనూ భద్రపరచనున్నారు. జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ పథకం(ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) కింద వీటిని ఆన్‌లైన్‌కు ఎక్కించనున్నారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం సర్వే లేనట్టే!హైదరాబాద్‌లో సర్వే జరగాలంటే కేంద్ర పట్టణాభివృది ్ధశాఖ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి జేఎన్ఎన్యూఆర్ఎం నిధులే దారి. అయితే హైదరాబాద్‌లో 1960-75 మధ్యకాలంలో సర్వే జరిగింది. దీని ద్వారా టౌన్‌సర్వే ల్యాండ్ రికార్డు(టీఎస్ఎల్ఆర్)ను తయారు చేశారు. రెవెన్యూ మూల రికార్డులైన కాస్ర పహాణీ, పహాణీలకు చెల్లుచిటీ ఇచ్చి, టీఎస్ఎల్ఆర్ను వాడుకలోకి తెచ్చారు. దీని వల్ల రికార్డు కాస్తా తాజాగానే ఉంది.