Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:57AM

‘ఆరోగ్య’ తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహర్దశ
24 గంటల విద్యుత్‌.. ముగ్గురు వైద్యులు.. పూర్తి స్థాయి అనుబంధ సిబ్బంది
రాష్ట్రమంతటా కేజీ టూ పీజీ క్లస్టర్లు
పన్ను వసూళ్ల విధానంలో సమూల మార్పులు
ఎగవేతదారులకు చెక్‌.. ఆదాయ పెంపే లక్ష్యం
మధ్యంతర నివేదికలు ఇచ్చిన టాస్క్‌ఫోర్సులు
పూర్తి స్థాయి విధాన నివేదికల సమర్పణకు 30 వరకు గడువు ఇచ్చిన సీఎస్‌
బడ్జెట్‌ ప్రతిపాదనల అందజేతకు 15 వరకు వ్యవధి

(హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి) ఆదాయ పెంపు విధానంలో, వైద్య-విద్యా రంగాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. పల్లెల్లో 24 గంటల పాటు వైద్య సేవలు, ‘కేజీ టూ పీజీ’ ఉచిత విద్యను ఒకే చోట అందించడానికి వీలుగా క్లస్టర్ల ఏర్పాటు, సర్కారు తలపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణకు వ్యాట్‌ చట్టంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పన్ను ఎగవేతదారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా కార్యాచరణ అమలుకు రంగం సిద్ధం చేస్తున్నది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కలల ‘తెలంగాణ పునరావిష్కరణ’ కోసం ఏర్పాటైన 14 టాస్క్‌ఫోర్స్‌లు తమ కసరత్తును వేగవంతం చేశాయి. వీటిలో ఆరు టాస్క్‌ఫోర్స్‌లు మధ్యంతర నివేదికలు రూపొందించాయి. టాస్క్‌ఫోర్స్‌ల పనితీరుపై సమీక్ష సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) రాజీవ్‌ శర్మకు శుక్రవారం వీటిని అందజేశాయి. ఆధునిక, నవ తెలంగాణ ఆవిష్కరణకు జాతీయ, అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేసి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక నివేదికలను అందజేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ విధానాల తయారీకి అవసరమైతే ప్రస్తుత చట్టాలను, విధానాలను సవరించడంతో పాటు కొత్త చట్టాలను తయారు చేసే అధికారాన్ని టాస్క్‌ఫోర్స్‌లకు ముఖ్యమంత్రి ఇచ్చారు. వాస్తవానికి టాస్క్‌ఫోర్స్‌లన్నీ తమ బడ్జెట్‌ ప్రతిపాదనలను ఈ నెల 5నాటికి, మధ్యంతర విధాన నివేదికలను 15వ తేదీకి అందించాల్సి ఉంది.
అయితే వ్యవసాయం, వైద్య, విద్య, ఆదాయ వనరులు, న్యాయ సేవలు, మానవ వనరుల అభివృద్ధి, సంక్షేమం తదితర రంగాలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌లు తమ నివేదికలిచ్చాయి. పరిపాలనా సంస్కరణలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ నివేదిక ఇచ్చేందుకు కొంత ఆలస్యమవుతుందని కన్వీనర్‌ అజయ్‌ మిశ్రా సీఎస్‌కు వివరించారు. నీటిపారుదల, విద్యుత్‌, మునిసిపాలిటీల టాస్క్‌ఫోర్స్‌ల కన్వీనర్‌ ఎస్‌.కె.జోషి ఢిల్లీ వెళ్లడంతో సమావేశానికి హాజరు కాలేదు. 15 కల్లా నివేదికలు ఇవ్వడం సాధ్యం కాదని, పొరుగు రాష్ర్టాలకు వెళ్లి అధ్యయనం చేయాల్సి ఉంటుందని, నిపుణులతో మాట్లాడాల్సి ఉంటుందని ఇతర టాస్క్‌ఫోర్స్‌ల కన్వీనర్లు సీఎస్‌కు వివరించారు. విధానాల్లో సంస్కరణలు, మార్పులు తేవాలన్నా, కొత్త విధానాలను, చట్టాలను ప్రతిపాదించాలన్నా లోతుగా అధ్యయనం చేసి.. ఐదేళ్ల కాలానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించాల్సి ఉంటుందని చెప్పారు. దానితో.. 2014-15 బడ్జెట్‌ కసరత్తుకు ఇబ్బంది లేకుండా బడ్జెట్‌ ప్రతిపాదనలను 15కి, విధాన నివేదికలను 30వ తేదీకల్లా ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్‌ల కన్వీనర్లకు సీఎస్‌ సూచించారు.
పల్లెల్లో 247 వైద్య సేవలు..
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందజేయాలని వైద్య టాస్క్‌ఫోర్స్‌ తన మధ్యంతర నివేదికలో సిఫారసు చేసింది. అలాగే మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించి 24 గంటల వైద్య సేవలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేయాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పీహెచ్‌సీని ఆధునీకరించి ప్రయోగాత్మకంగా 24 గంటల వైద్య సేవలను అమలు చేయాలి. ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలతో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలతో పీహెచ్‌సీలను అనుసంధానించాలి. పీహెచ్‌సీల్లో ప్రస్తుతం ఒక డాక్టర్‌, ఒక నర్సు, కొన్ని మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ల సంఖ్యను 3కి పెంచి.. అందుకనుగుణంగా నర్సులు, ఇతర సిబ్బందిని కేటాయించాలని, పేషంట్లకు భద్రత, అంబులెన్స్‌ సౌకర్యం, అవసరమైన మందులు, వైద్య పరీక్షలకు ఆధునిక వైద్య పరికరాలు, సోలార్‌ విద్యుత్‌తో సహా 24 గంటల విద్యుత్‌ సరఫరా.. తదితర వసతులను కల్పించి పీహెచ్‌సీలను అభివృద్ధి చేయాలని టాస్క్‌ఫోర్స్‌ సూచించింది. తమిళనాడులో పీహెచ్‌సీల వ్యవస్థ అద్భుతంగా ఉందని, ఫలితంగా మాతా శిశు మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది.
కేజీ టూ పీజీ ఉచిత విద్య క్లస్టర్లు..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టుగా.. కేజీ టూ పీజీ ఉచిత విద్యకు బడ్జెట్‌ నిధులు కేటాయించాలని విద్య టాస్క్‌ఫోర్స్‌ సిఫారసు చేసింది. ఇందులో భాగంగా కేజీ టూ పీజీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని మధ్యంతర నివేదికలో సిఫారసు చేసింది. ఈ క్లస్టర్లలో ఒకే చోట.. 80 శాతం విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం, ఉపాధ్యాయులు ఎల్లవేళలా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా నివాసంతో పాటు ఇతర ఆధునిక వసతులతో వీటిని ఏర్పాటు చేయాలి. ప్రతీ క్లస్టర్‌కు కనీసం 750-1000 మంది విద్యార్థులు ఉండేలా.. 2-4 మండలాలకు కలిపి ఓ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కేజీ నుంచి పదవ తరగతి వరకు ఉచిత విద్య క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించింది. ఈ క్లస్టర్లలో స్థానిక విద్యార్థులకు 20 శాతం సీట్లను కేటాయించాలని పేర్కొంది.
వ్యాట్‌ చట్టంలో సంస్కరణలు..
ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యాట్‌ చట్టంలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ఆదాయ వనరులపై ఏర్పడిన టాస్క్‌ఫోర్స్‌ సిఫారసు చేసింది. పన్ను ఎగవేతదారులకు చెక్‌ పెట్టే విధంగా వ్యాట్‌ చట్టాన్ని సవరించాలని, వ్యాట్‌ అమలు విధానంలో విప్లవాత్మక మార్పులు తేవాల్సిన అవసరం ఉందని నివేదికలో స్పష్టం చేసింది. వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే సమయంలో వ్యాపారులు, డీలర్లు పెద్ద ఎత్తున రాష్ట్ర అమ్మకపు పన్నును ఎగవేస్తున్నారని, తప్పుడు డిక్లరేషన్లు ఇస్తున్నారని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వాణిజ్య పన్నుల విభాగాల పరిధిని తగ్గించి, విభాగాల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచాలని సూచించింది.
ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలకు అవసరమైన నిధుల సమీకరణ ఆశించిన స్థాయిలో జరగాలంటే వ్యాట్‌ వసూళ్ల విధానంలో భారీ సవరణలు జరగాలని, పన్నుల వసూళ్లలో మార్పుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా అధ్యయనం జరగాలని, ఇతర రాష్ర్టాల్లో పన్నుల అమలు విధానాన్ని పరిశీలించాలని టాస్క్‌ఫోర్స్‌ సూచించింది. తెలంగాణ రాష్ట్ర స్థూలోత్పత్తి ప్రస్తుతం రూ.5 లక్షల కోట్లుగా ఉందని, ఇది ఒక శాతం పెరిగినా.. దాయం కనీసం రూ.500 కోట్లకు పెరుగుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యాట్‌ విధానంలో మార్పులు తేవాలని సూచించింది.
సంక్షేమానికి ఏటా రూ.10 వేల కోట్లు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమానికి ఏటా రూ.10 వేల కోట్ల దాకా బడ్జెట్‌ కేటాయించాలని సంక్షేమ టాస్క్‌ఫోర్స్‌ తన నివేదికలో పేర్కొంది. భూమిలేని ఎస్సీలకు మూడెకరాల భూమితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల్లో ఏటా లక్ష మందికి నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగాలు కల్పించాలని ఎస్సీల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ సమర్పించిన ఈ నివేదిక ప్రతిపాదించింది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అమ్మాయిల వివాహాలకు రూ.51 వేల ఆర్థిక సహాయం అందించాలి.
హాస్టళ్లను గురుకులాల స్థాయికి తీర్చిదిద్ది.. మెనూను మెరుగుపరచాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలు అత్యాచారాలకు గురైతే వెనువెంటనే సహాయం, ఉపాధి కల్పించాలని ప్రతిపాదించింది. ఉపాధి పథకాలకు 50-60 శాతం సబ్సిడీ ఉండగా... దీన్ని 80-90 శాతం వరకు పెంచాలని, 40 ఏళ్ల వయోపరిమితిని 45 ఏళ్లకు పొడిగించాలని, బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు ఫాస్ట్‌ పథకం కింద సహాయం అందించడం వంటి అంశాలను ఇందులో చేర్చారు.