Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:52AM

ఉర్సుగుట్టకు ఎసరు!


కాకతీయ ‘శిలా’ చరిత్రపై గునపం!
ప్రేమగాథలు వినిపించే గుట్ట
నిజాంల విహార విడిది
హంటింగ్‌ హౌస్‌ ముంగిట దసరా సందడి
ఆ ప్రాంతమంతా కబ్జాలోకి..
ఖాళీ అవుతున్న చెరువులు, భూములు
గుట్టను తవ్వేస్తున్న మైనింగ్‌ మాఫియా
పురావస్తు హెచ్చరికలూ బేఖాతరు

ప్రాంతాన్ని తవ్వితే చరిత్ర బయటపడటం కద్దు. కానీ, అక్కడి నేలని తవ్వడం కాదు, తాకితే చాలు.. చరిత్రని అంటిన సాహితీ సౌరభాలు గుబాళిస్తాయి. కాకతీయ కళా ప్రియత్వాన్ని ‘శిలా’బద్ధం చేస్తాయి. కాకతీయ చరిత్రని ఒక్కరోజులో రాయగల మహాకవుల భూమిలో.. గుట్టలూ కవిత్వం చెప్పాయంటే నమ్ముతారా? అయితే, క్వారీలు, కబ్జాల రాపిడిలో నలుగుతున్న వరంగల్‌ జిల్లాలోని ఉర్సుగుట్ట హృదయాన్ని తాకి చూడండి!

(ఆంధ్రజ్యోతి-వరంగల్‌) సొంతదార్లు మాయమయ్యారు. ఆ తరువాత భూములు కనిపించకుండాపోయాయి. ఆ వెంటనే గుంటలు, కొలనులూ ఖాళీ అయ్యాయి. ఇప్పుడిక ‘అసలు’ ప్రాణానికే ఎసరు వచ్చింది. భూములను కబ్జాదారులకు, ఉనికిని మైనింగ్‌ మాఫియాకు కోల్పోతూ..ఉర్సుగుట్ట ఉసూరుమంటున్న తీరిది! వరంగల్‌ జిల్లాలోని ఈ గుట్ట విస్తీర్ణం 23 ఎకరాల 15 గుంటలు. గుట్టని చూస్తే..రెండు హృదయాలు కలిసిన అనుభూతి కలుగుతుంది. నిజంగానే.. ఇది రెండు గుట్టల కలయికగా ఏర్పడింది. అంతేకాదు.. విరహం- ప్రణయాలను సమపాళ్లలో పంచగలదు. ఒకవైపు హంటింగ్‌ హౌస్‌ రూపంలో నిజాం నవాబుల విడిదిగా ఉంటూనే..దసరా వేడుకలకు ఆతిథ్యం ఇవ్వగలదు. రంగనాథస్వామిని తలుచుకొని..కావ్య గానం చేయగలదు. ఇలాంటి ఎన్నో చారిత్రక విశేషాలు ఉర్సుగుట్ట సొంతం! కానీ, ఇప్పుడు అది క్వారీ, కబ్జాల నీడలో విలవిలలాడుతోంది. గత ఏడాది మే నెలలో ఏకంగా ఉర్సు గుట్టను కొట్టేసేందుకు ప్రయత్నించారు.
2013 మే 1న ‘ఆంధ్రజ్యోతి’ ఈ విషయాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటికి గుట్టకు ఆపద తప్పింది. కానీ ఉర్సుగుట్ట ఉసురు తీసే ప్రయత్నాలు దొడ్డిదారిన సాగుతూనే ఉన్నాయి. ప్రదాన రహదారి కాకుండా గుట్ట వెనుక వైపు నుంచి క్వారీ పనులను ముమ్మరం చేశారు. ఇప్పటికే చాలావరకు గుట్ట క్వారీగా మారి పోయింది. ఇంత జరుగుతున్నా అధికారుల్లో చలనం లేదు. నిజానికి, గుట్టపై ఉన్న రంగనాథ స్వామి ఆలయం కాకతీయుల కాలానికి ముందుదిగా అంచనా వేస్తున్నారు. ఈ దృష్ట్యా.. దాని పరిరక్షణకు పురావస్తు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ.. బోర్డుని నాటారు. కానీ, తవ్వకం ఆగలేదు. హంటింగ్‌ హౌస్‌ అయితే.. అవశేషంగానే మిగిలిపోయింది. దాన్ని ఆనుకొని ఉన్న ప్రదేశంలో దశాబ్దాలుగా దసరా ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. గుట్టను ఆనుకొని ఉన్న చెరువును ఒక పర్యాటక (రంగసముద్రం) ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని పాలకులు ప్రతి ఏటా హామీలు ఇస్తూనే ఉన్నారు. అభివృద్ధి మాటేమో కాని ఉన్న చెరువు, దసరా ఉత్సవాలను జరిపే స్థలం సైతం కబ్జాకు గురయింది. నగరం విస్తరించడంతో వాటిలోకి భవనాలు చొచ్చుకొస్తున్నాయి.
‘వట్టి’పోతున్న గుట్ట!
ఉర్సు రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 355లో ఈ గుట్ట ఉంది. పట్టేదారుగా సయ్యద్‌ అహ్మదుల్లా ఖాద్రీ ఉన్నట్టు 1954-55 రికార్డులు చెబుతున్నాయి. ‘కబ్జా కాలం’లో (అనుభవం) ముంబాయికి చెందిన సేవక్‌ రాంటేక్‌ ఉన్నారు. కానీ, 1970-71 నాటికి వీరి పేర్లేవీ కబ్జాకాలంలో లేవు. ఇంకా ఆశ్చర్యంగా, 2005-06 నాటికి భూములు కూడా ‘మాయ’మయిపోయి గుట్ట మాత్రమే మిగిలింది. పోనీ, ఈ గుట్ట అయినా మిగిలింది అనుకుంటే.. అది ఎవరికి చెందుతుందో తెలియని పరిస్థితి! ప్రైవేటు వ్యక్తులదా, ప్రభుత్వానికి చెందుతుందా అనేది తేల్చాల్సి ఉంది. అయితే, ఈ ప్రక్రియ కోసం ఉర్సుగుట్ట పరిరక్షణను వాయిదా వేయాల్సిన పని లేదని సామాజిక వేత్తలు వాదిస్తున్నారు. 75 ఏళ్లు పైబడిన పురాతన, ప్రాచీన, చారిత్రక కట్టడాలు, స్థలాలు ఎవరివైనా..వాటి పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని నిబంధనలు చెబుతున్నాయి. ఈ దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు.
గుట్టపై సాహితీ గుబాళింపు!
రెండు గుట్టల కలయికతో జరిగినప్రకృతి ఆవిష్కరణ..ఉర్సు గుట్ట! గుట్టకు పైభాగంలో సొరంగాన్ని పోలిన ప్రాంతం..అనేక రహస్యాలకు కూడలి! ఒక మనిషి మాత్రమే పట్టే..బాటలో ఓరగా వెళితే తప్ప అక్కడకు చేరుకోలేడు. సొరంగం పైభాగంలో దేవనాగర లిపిలో కావ్య రచన కనిపిస్తుంది. ఓ ప్రేమికుడి విరహ వేదనగా..ఈ శిలా కావ్యాన్ని విమర్శకులు అభివర్ణిస్తారు. ఇంకొంత పైకి అడుగులు వేస్తే..అద్భుత ప్రేమ జంట సిద్ధ దంపతులు స్వాగతం పలుకుతారు. వారి ప్రణయ యాత్రని 62 శ్లోకాలుగా చెక్కారు. సాధారణంగా రాచరిక కోటల్లో మలిగే గొప్ప సాహిత్యమంతా, ఇలా ప్రజలపరం చేయడం ఉర్సుగుట్ట ప్రత్యేకత!
మహాకవుల మదిని తొలిచే భావాలను శిలలను చెక్కి నిక్షిప్తం చేసే ఈ పద్ధతిని ఎనిమిది వందల సంవత్సరాల క్రితం గుట్టలపై అనుసరించినట్టు భావిస్తున్నారు. కాకతీయుల వంశ కొలుపు శ్రీ రంగనాథ స్వామి ఆలయం నుంచి కాస్త అవతలకు చూస్తే.. హంటింగ్‌ హౌస్‌ కనిపిస్తుంది. నిజాం రాజుల విహార విడిది అది! సరదాగా వేటకు వచ్చిన సమయాల్లో నిజాం నవాబులు ఈ భవనంలో గడిపేవారు. మత సామరస్య సంస్కృతికి నిండైన అర్థం చెబుతూ.. ఈ భవనం ముందుభాగంలోని విశాలమైన ప్రాంతంలో దసరా ఉత్సవాలు జరుపుతున్నారు. ఇలా అన్నివిధాల తీర్చి ఉండటం వల్లనే..ఉర్సు గుట్ట పరిస్థితిపై కవులు, సాహిత్య, చరిత్రకారుల మనస్సులు ఉసూరుమంటున్నాయి.

చరిత్రనూ పట్టించుకోవాలి!
చారిత్రక సంపదను కాపాడాల్సిన ప్రభుత్వాలు, ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాయి. కాకతీయుల కాలం నాటి కట్టడాల ఆనవాళ్లు మనకు అన్నిచోట్ల కనిపిస్తాయి. కాకతీయుల పాలనా తీరులు.. శాసనాల రూపంలో కాకుండా సాహితీ రూపంలో ఉర్సు గుట్టపై లభ్యం అవుతున్నాయి. ఈ అరుదైన సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
- ప్రొఫెసర్‌ కోవెల సుప్రసన్నాచార్య
భావి తరాలకు కానుక!

ఉర్సుగుట్ట మీద కాకతీయుల కాలం నాటి రంగనాథస్వామి దేవాలయంతో పాటు అపురూప సాహితీ సంపద నిక్షిప్తం అయింది. అన్నిటికీ మించి గుట్టను ఆనుకొని ఎంతోకాలంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వివరాలన్నీ అధికారులకు ఇచ్చాం. గుట్టని పరిరక్షించాలని పలుసార్లు విజ్ఞప్తి చేశాం. భవిష్యత్తు తరాల కోసమైనా చరిత్రని కాపాడుకోవాలి.
- ప్రొఫెసర్‌ పాండురంగారావు