Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:36AM

కేసీఆర్‌ తీరుపై అంతర్జాతీయ నిరసన

పాత్రికేయుల అరెస్టులను తీవ్రంగా ఖండించిన అమెరికా సంస్థ ‘కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌’
చానళ్ల పునరుద్ధరణకు గట్టిచర్యలు తీసుకోవాలి
సీపీజే డిప్యూటీ డైరెక్టర్‌ రాబర్ట్‌ మాహోనీ హితవు

న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 12: మీడియా పట్ల తెలంగాణ సర్కారు వైఖరిపై అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. ‘‘మెడలు విరుస్తం.. 10 కిలోమీటర్ల లోతున పాతరేస్తం’’ అంటూ మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించిన వైనాన్ని.. టి-సర్కారు తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టిన పాత్రికేయులను అరెస్టు చేయడాన్ని న్యూయార్క్‌(అమెరికా)లోని ‘కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌(సీపీజే)’ తీవ్రంగా ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు పాటుపడే ఈ సంస్థ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాపై విద్వేషపూరిత భాషను వినియోగించడాన్ని ఆపాలని విజ్ఞప్తి చేసింది.
ఈమేరకు.. ‘‘భారతదేశంలోని తెలంగాణలో 70 మంది పత్రికా సిబ్బంది అరెస్టు, రెండు చానళ్ల నిలిపివేత, మీడియాకు బెదిరింపులు’ అనే శీర్షికతో తన వెబ్‌సైట్‌లో ఒక కథనాన్ని ప్రచురించింది. భారతదేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో (సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో) దాదాపు 70 మంది జర్నలిస్టులను, మీడియా సిబ్బందిని అరెస్టు చేసినట్టు ఆ కథనంలో వివరించింది. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్లను పేరు పెట్టి ప్రస్తావించి.. ఈ రెండు చానళ్ల ప్రసారాలనూ కేబుల్‌ ఆపరేటర్లు గత మూడునెలలుగా నిలిపివేశారని పేర్కొంది. ‘మెడలు విరుస్తం.. పాతరేస్తాం’’ అంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను, అలాగే ఈ రెండు చానళ్లనూ నిలిపివేసిన ఎంఎస్‌వోలను ఆయన కీర్తించిన వైనాన్నీ ప్రచురించింది.
కాగా.. ‘‘జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని.. మీడియాను బెదిరించడాన్ని మేం ఖండిస్తున్నాం’’ అని సీపీజే డిప్యూటీ డైరెక్టర్‌ రాబర్ట్‌ మాహోనీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్వేచ్ఛా తెలంగాణ, అభివృద్ధి చెందే తెలంగాణ కావాలని కోరుకుంటే.. విమర్శనాత్మక మీడియా పాత్రను ఆయన గౌరవించాలి’’ అని హితవు పలికారు. ‘ఏఈబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్లను పునరుద్ధరించేలా కేసీఆర్‌ సర్కారు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీపీజే వెబ్‌సైట్‌లో ఈ కథనాన్ని చూడవచ్చు. ఇదీ లింకు.. http://www.cpj.org/2014/09/in-telangana-india-70-members-of-press-detained-tw.php (షార్ట్‌ లింక్‌: http://cpj.org/x/5ce7 ).