Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:34AM

హార్డ్‌గా ఉంటేనే స్మార్ట్‌ సిటీ!


నగరాల ఎంపికకు ఇదే గీటురాయి
100 సిటీలు కట్టడం..తేలికేం కాదు
పన్నులు వేయాలి.. పనులూ చేయాలి
అలాంటి ప్రజలు, నాయకత్వం ఉన్న దగ్గరే సిటీల నిర్మాణం
స్థానిక, రాష్ర్టాల సహకారమే ముఖ్యం
అప్పుడే జాబితాలా?: వెంకయ్య
రాష్ర్టాల మంత్రులతో భేటీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌ ప్రజలు, స్మార్ట్‌ నాయకత్వం ఉండి..సంస్కరణలకు సిద్ధమైతేనే స్మార్ట్‌ సిటీల రూపకల్పన సాధ్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సౌకర్యవంత జీవనం..మెరుగైన జీవన ప్రమాణాలు.. ఉత్తమ పరిపాలన, అందుబాటులో వైద్యం, విద్య, నిరంతరాయ విద్యుత్‌, తాగునీటి సరఫరా, సురక్షిత, సౌకర్యవంత రవాణా, నాణ్యమైన పారిశుధ్యం, యువతకు ఉపాధి, మంచి వినోద వసతులు, అన్ని వర్గాలు, వయస్సుల ప్రజలకు అనువైనదే..‘స్టార్ట్‌ సిటీ’ అంటూ మంత్రి నిర్వచించారు. నిజానికి, తాము కొత్తగా నగరాలను సృష్టించడం లేదని, ఉన్నవాటినే విస్తరించి సకల సదుపాయాలతో ‘స్మార్ట్‌’గా తయారుచేస్తామని వివరించారు. దేశవ్యాప్తంగా వంద స్మార్ట్‌ సిటీలను తయారుచేయాలని కేంద్రం నిర్ణయించిన దరిమిలా.. ఆ అంశంపై రాషా్ట్రల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆయా రాషా్ట్రల మంత్రులు, కార్యదర్శులతో శుక్రవారం స్థానిక విజ్ఞాన్‌ భవన్‌లో వెంకయ్య భేటీ అయ్యారు.
‘స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే మొత్తం నిధులు ఇస్తుంది అనుకోవటం కూడా సరికాదు. మేం ఇచ్చే నిధుల్ని మళ్లీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అందుకు ఉన్న వనరులను ముందుగానే చూపించాల్సి ఉంటుంది’’అని వారికి ఆయన స్పష్టం చేశారు. వంద స్మార్ట్‌ సిటీల నిర్మాణమనేది, చెప్పినంత సులువు కాదని వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో 4041 నగరాలు, 3894 పట్టణాలు ఉన్నాయి. పట్టణ జనాభాలో 70 శాతం మంది 468 నగరాలు, పట్టణాల్లోనే నివశిస్తున్నారు. జీడీపీలో 60 శాతం ఇక్కడ నుంచే లభిస్తున్నది. పట్టణ జనాభా 10 శాతం పెరిగితే జీడీపీ 30 శాతం పెరుగుతుంది. నగరాలే దేశ ఆర్థిక ప్రగతికి ఇంజన్లు. ఈ ఆలోచనతోనే స్మార్ట్‌ సిటీలకు ప్లాన్‌ చేస్తున్నాం’’ అని వివరించారు. అయితే, సరైన నాయకత్వ లేమిని పట్టణాలు, నగరాలు ఎదుర్కొంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వివిధ రాషా్ట్రలు, పురపాలికల్లో నాయకత్వం సమర్థవంతంగా పనిచేయటం లేదు. పదేళ్లకు పైగా పన్నులు విధించని, యూజర్‌ చార్జీలు వసూలు చేయని కార్పొరేషన్లనూ నేను చూశాను. పన్నులు విధించక..పనులు చేయక.. అభివృద్ధి చేయక సంబంధిత పట్టణాలు, నగరాలు దీనావస్థకు చేరుకున్నాయి.
ఇలాంటి కారణాలవల్లనే కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం విఫలమయ్యింద’’ని విశ్లేషించారు. ఈ దృష్ట్యానే, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాషా్ట్రలు, స్థానిక సంస్థలు టీమ్‌ ఇండియాగా పనిచేసి.. స్మార్ట్‌ సిటీల పథకాన్ని విజయవంతం చేయాలని ప్రధానమంత్రి సూచించారన్నారు. అందులోభాగంగా, ఉదాసీనమైన మైండ్‌సెట్‌ మార్చుకుని తెలివైన, కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధపడిన రాషా్ట్రలు, నగరాలనే తొలుత ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఈ సిటీల్లో నాయకులే కాదు.. ప్రజలూ స్మార్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పుకొచ్చారు. ‘‘వారు (ప్రజలు) ఇరుగుపొరుగువారు అక్రమాలు చేస్తుంటే గొంతెత్తి ఫిర్యాదు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా, పన్నులు చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని చెప్పారు. పని ఇప్పుడే మొదలుపెట్టామన్న మంత్రి.. విధివిధానాల రూపకల్పన దశలోనే ఇంకా ప్రక్రియ ఉన్నదని స్పష్టం చేశారు. ఏఏ నగరాలను స్మార్ట్‌ సిటీలుగా మార్చాలి.. వాటి ఖర్చులు.. వంటి విషయాల్లోకి ఇంకా వెళ్లలేదని చెప్పారు. ఒకవేళ దీనికి భిన్నంగా ఎవరైనా ప్రచారం చేస్తే.. దానితో కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘‘విధివిధానాల ముసాయిదా సిద్ధమయింది. అన్ని రాషా్ట్రల అభి ప్రాయాలను తీసుకుంటన్నాం. ఇక్కడ వచ్చే అంశాలను క్రోడీకరించి మరొక ముసాయిదాను తయారు చేస్తాం. దాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ముందుంచుతాం. ప్రధాన మంత్రి కార్యాలయం పరిశీలన అనంతరం ప్రతిపాదనలను కేబినెట్‌ ముందుకు తీసుకెళతాం’’ అని వివరించారు. వివిధ రాషా్ట్రలు తమ ప్రతిపాదనలు పంపిస్తున్నాయని, ఎంతోమంది ఎంపీలు కూడా వినతులు ఇస్తున్నారని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో వంద నగరాలను నిర్మించాలని తాము భావిస్తున్నామని, ఇందులో విజయవంతం అయితే మరో ఐదేళ్లకు దీనిని పొడిగించి మరిన్ని నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు.
2022 నాటికి అందరికీ ఇల్లు
2022 నాటికి ‘అందరికీ ఇల్లు’ లక్ష్యంగా జాతీయ గృహనిర్మాణ కార్యక్రమాన్ని (ఎన్‌హెచ్‌ఎం) త్వరలోనే ప్రారంభించనున్నట్టు వెంకయ్యనాయుడు వెల్లడించారు. యూపీఏ హయాంలో అమలు చేసిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, ఇందిరా ఆవాస్‌, రాజీవ్‌ ఆవాస్‌, రాజీవ్‌ రుణ్‌ యోజన.. వంటి పథకాలన్నీ ఎన్‌హెచ్‌ఎంలో భాగం అవుతాయని చెప్పారు.