Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:33AM

ఔను.. నేనూ చెప్పా

2జీ కేటాయింపులపై ప్రధానిని అప్రమత్తం చేశా
కమల్‌నాథ్‌ వెల్లడి... కాంగ్రెస్‌కు మరిన్ని తిప్పలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 12 : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను పాపాల భైరవునిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. 2జీ స్పెక్ట్రమ్‌, బొగ్గు గనుల కేటాయింపు ఉదంతంలో మాజీ కాగ్‌ వినోద్‌ రాయ్‌ వెల్లడిస్తున్న వాస్తవాలు యూపీఏ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే పరిస్థితులు కల్పిస్తున్న సమయంలో... కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాకు ముఖ్య అనుచరుడు, పార్లమెంటరీ వ్యవహారాల మాజీ మంత్రి కమల్‌నాథ్‌... 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల విషయంలో మన్మోహన్‌సింగ్‌ పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వ్యవహారంలో ప్రధాని మన్మోహన్‌ను ముందే అప్రమత్తం చేశాను. ఈ మేరకు ఆయనకు ఒక లేఖ కూడా రాశాను. దీని ప్రాధాన్యతను మన్మోహన్‌ సింగ్‌ గుర్తించలేదు. ఆయన సరిగ్గా స్పందించకపోవడం నన్ను నిరాశకు గురి చేసింది. మన్మోహన్‌ ‘పొరపాటు’ చేసి ఉండొచ్చు.’’ అని అన్నారు. స్పెక్ట్రమ్‌ కేటాయింపుల విషయంలో పలువురు మంత్రుల వ్యవహార శైలిని, అక్రమాలను చాలా మంది కేబినెట్‌ సహచరులు ప్రధాని దృష్టికి తీసుకెళ్లినా... ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరక్కుండా ప్రధాని పటిష్ట చర్యలు తీసుకోలేదని వినోద్‌ రాయ్‌ ఒక ఇంటర్య్వూలో వెల్లడించారు. కాంగ్రెస్‌పై విమర్శలను బీజేపీ మరింత తీవ్రం చేసింది. ‘అవినీతి నివారణకు ప్రధాని ఎందుకు జోక్యం చేసుకోలేదు. ఆయన్ను ఎవరడ్డుకున్నారు? ఆ ‘2జీ’లే (సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ) అడ్డుకున్నారా? దేశ ప్రజలు ప్రశ్నించాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పార్థ పిలుపునిచ్చారు. మరో నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ... వినోద్‌ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, వాస్తవ పరిస్థితి ఏంటో ఇప్పుడు బహిర్గతమవుతోందని అన్నారు. యూపీఏ హయాంలో అధికారం ప్రధాని మన్మోహన్‌ చేతిలో లేదని, 10 జనపథ్‌(సోనియా నివాసం)లో ఉందని విమర్శించారు.