Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:32AM

కుదుటపడుతున్న కశ్మీరం

రూ.200 కోట్ల తక్షణ ప్యాకేజి ప్రకటించిన సీఎం
1.25 లక్షల మందిని రక్షించిన సైన్యం
వేర్పాటువాదుల విషయంలో కళ్లు మూసుకున్నాం
సహాయక చర్యలపైనే మా దృష్టి : రాజ్‌నాథ్‌
అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడుంది?: సీఎం ఒమర్‌
కేంద్రం నివేదిక కోరిన సుప్రీం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 12: వరద విలయం మిగిల్చిన విషాదం నుంచి జమ్మూకశ్మీర్‌ కొద్దికొద్దిగా కోలుకుంటోంది. వరద తాకిడికి ఇప్పటి వరకు 250 మందికిపైగా మృత్యువాతపడ్డారు. గల్లంతైన వారి సంఖ్య అంతకు రెట్టింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో ఎటుచూసినా ఆప్తుల కోసం వెతుకులాడే బాధితులే కనిపిస్తున్నారు. మరోవైపు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి కశ్మీర్‌లోయకు చేరుకున్నవారు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్థావరం వద్ద వేల సంఖ్యలో ప్రజలు పడిగాపులు పడుతున్నారు. మరోవైపు సహాయక చర్యలను సైన్యం కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 1.25 లక్షలకుపైగా బాధితులను సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కశ్మీర్‌లోయకు బాహ్యప్రపంచంతో సంబంధాలను పునరుద్ధరించే పనులు ఊపందుకున్నాయి. మరోవైపు వరదతో అతలాకుతలమైన కశ్మీర్‌లోయకు రూ.200 కోట్ల తక్షణ సహాయ ప్యాకేజీని సీఎం ఒమర్‌ అబ్దుల్లా ప్రకటించారు. వరదల్లో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.3.5 లక్షలు, నిరాశ్రయులైన వారికి తక్షణ సాయం కింద రూ.75వేలు ప్రకటించారు. వరదలతో రాష్ట్రం మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కడుంది? ఎలా పని చేస్తుంది? అని సీఎం ఒమర్‌ ప్రశ్నించారు.
తన సెల్‌ఫోన్‌ కూడా చార్జింగ్‌ చేసుకునే పరిస్థితిలో లేనని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీనగర్‌లో వేర్పాటువాదులు సహాయకచర్యలను అడ్డుకుంటున్నా, తమ దృష్టినంతా వరదబాధితులకు పునరావాసం కల్పించడంపైనే కేంద్రీకరించామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. బాధితులు అసహనంతో దాడులకు పాల్పడినా సహనంతో వ్యవహరించాలని లెఫ్టినెంట్‌ జనరల్‌ సుబ్రతషా సైన్యానికి పిలుపునిచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో వరద పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
కశ్మీర్‌పై ఒక్కటై కదిలిన భారతం
కశ్మీర్‌ను ఆదుకునేందుకు దేశప్రజలు ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల నుంచి ఒక్కొక్కరు రూ.20 లక్షలు ఇవ్వాలని ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలూ తమ నెలవేతనాన్ని పీఎం ఆర్‌ఎఫ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. చండీగఢ్‌ ప్రభుత్వం రూ.10కోట్ల సాయం ప్రకటించింది. వరద బాధితులు ఉచి తంగా ఫోన్‌ చేసుకునే సౌకర్యాన్ని టెలికం సంస్థలు కల్పిస్తున్నాయి. కాగా, వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను, తెలుగువారిని రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. శుక్రవారం శ్రీనగర్‌ నిట్‌కు చెందిన 39 మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించింది.