Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:20AM

కేసీఆర్‌కు గవర్నర్‌ చెబుతానన్నారు


చానళ్ల పునరుద్ధరణకు సూచిస్తానన్నారు: టీడీపీ

హైదరాబాద్‌, సెస్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సూచన చేస్తానని గవర్నర్‌ తమకు హామీ ఇచ్చారని తెలంగాణ టీడీపీ ప్రతినిధులు చెప్పారు. చానళ్లపై నిషేధానికి సంబంధించి శుక్రవారం సాయంత్రం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ నేతృత్వంలో ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లో కలిసి వినతి పత్రం సమర్పించగా గవర్నర్‌ నర్సింహన్‌ స్పందించారు. చానళ్ల ప్రసారాలను పునరుద్దరించేందుకు సీఎం తో మాట్లాడతానని పేర్కొన్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.
మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి సంఘటనలు టీవీలో చూశానని, మీడియాపై సీఎం కేసీఆర్‌ చేసిన వాఖ్యలను పరిశీలించానని గవర్నర్‌ చెప్పారన్నారు. తన పరిధిలో ఉన్నంత వరకు టీవీ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు సూచిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌..జర్నలిస్టులపై దురుసుగా, అహంకారంగా, అప్రజాస్వామికంగా మాట్లాడిన తీరుపై విచారణ జరిపించాలని, చానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. టీవీ-9చానల్‌ పొరపాటునకు యాజమాన్యం క్షమాపణలు చెప్పిందన్నారు. ఎలాంటి పొరపాటుచేయని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ ప్రసారాలను నిలిపివేశారని విమర్శించారు. మీడియాపై అక్కసుతో దురుసుగా మాట్లాడిన కేసీఆర్‌ జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలయ్యారని, నియంత,నిరంకుశ నేత అనే పేరు రావడం మంచిది కాదన్నారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఏంచేశాయో చిన్న ఉదాహరణ చెప్పడంలో టీఆర్‌ఎస్‌ నేతలు విఫలమయ్యారని విమర్శించారు.
వరంగల్‌ లో సీఎం కేసీఆర్‌ మాట్లాడిన తీరు రాజ్యాంగ వ్యతిరేకమని ఆయనపై పోలీసులు 506 కింద కేసు నమోదు చేసి విచారణ జరుపాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యం పై గౌరవం ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పి కేసీఆర్‌ టీవీ చానళ్ల ప్రసారాలను పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. రానున్న శాసనసభ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ నిరంకుశ విధానాలను ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్‌కు వినతిపత్రం అందించినవారిలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, జీ.సాయన్న, మాగంటి గోపీనాఽథ్‌ ప్రకాష్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.