Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:19AM

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌కు దెబ్బ


లక్ష కోట్లు ఖర్చు చేసినా తిరిగి తీసుకు రాలేరు
మెడలు విరుస్తాననడం విడ్డూరం
చానెళ్లపై నిగ్రహం లేకుండా మాట్లాడడం సరికాదు
మీడియాపైఅటువంటి వ్యాఖ్యలు దురదృష్టకరం
కేసీఆర్‌పై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 12(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తన హోదాను మరిచిపోయి మెడలు విరిచేస్తా, పాతిపెడతా అంటూ మీడియాపై వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌ జైపాల్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఏబీఎన్‌ఆంధ్రజ్యోతి, టీవీవి-9 వంటి చానెల్స్‌పట్ల ముఖ్యమంత్రి వ్యవహార శైలిని మార్చుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్‌ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన తన వ్యవహారశైలితో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఆయన ఇలాంటి పొరపాట్లు చేయరని తానుభావిస్తున్నానని పేర్కొన్నారు. కాళోజీ శత జయంతి సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడిన తీరును జైపాల్‌రెడ్డి తప్పుపట్టారు. కాళోజీ ఆలోచనా విధానం, తన ఆలోచనా విధానం ఒకేలా ఉన్నాయని చెప్పిన కేసీఆర్‌.. అందుకు పూర్తిభిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళోజీ పత్రికా స్వేచ్ఛను కోరుకున్నారని చెప్పారు. ‘‘కాళోజీ స్వేచ్ఛా పిపాసి. ఆయనతో సన్నిహితంగా వ్యవహరించిన వారిలో నేను కూడా ఉన్నా. వామపక్ష వాది అయిన కాళోజీ ప్రజాస్వామ్యాన్నికోరుకున్నారు’ అని జైపాల్‌ రెడ్డి చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, నేతలు వేరే ప్రాంతాల వారి గురించి మాట్లాడేప్పుడు నిగ్రహంతో వ్యవహరించాలని జైపాల్‌ రెడ్డి సూచించారు. నిజాం కాలం నుంచే హైదరాబాద్‌కు ప్రత్యేక కల్చర్‌ ఉందని వివిధ వర్గాల సహజీవనంతో హైదరాబాద్‌ తనదైన బ్రాండ్‌ ఇమేజ్‌ సొంతం చేసుకుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ వంద రోజుల పాలనలో నగర ప్రతిష్ఠను దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం పట్ల ఇతర ప్రాంతాల వారికి సౌహార్ధం తగ్గిందని ఆయన పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చుచేసినా బ్రాండ్‌ ఇమేజ్‌ను తిరిగి రప్పించుకోలేమని అన్నారు. హైదరాబాద్‌ అంటేనే భిన్న సంస్కతులకు ప్రతిరూపమ.. టీఆర్‌ఎస్‌ రాకతో ఈ సంస్కృతి దెబ్బతిన్నదని అన్నారు. ఇలాంటి పరిణామం తెలంగాణకు ఎంతో నష్టం కలిగిస్తాయన్నారు. కేసీఆర్‌, ఆయన మంత్రులు వ్యవహరిస్తున్న తీరు వల్ల నగరనికి పెట్టుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఘనకీర్తిని బలహీన పర్చవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.