Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:54AM

ఆలయాల పాలక మండళ్ళ ఏర్పాటుకు బ్రేక్‌


(ఆంధ్రజ్యోతి/గుడివాడ)
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు నామినేషన్‌ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈక్రమంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల కమిటీల పాలకవర్గాలకు సంబంధించి అనేక మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పాత పాలకవర్గాలను రద్దు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ 3/2014తో జిల్లాలోని పాత కమిటీలు రద్దయ్యాయి. ఈక్రమంలో నూతన కమిటీల ఏర్పాటుకు న్యాయ పరమైన చిక్కులు ఆటంకంగా మారాయి. గత పాలకవర్గంలోని కొందరు పాలకవర్గాల రద్దుకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రభుత్వం కొత్త పాలకవర్గాల ఏర్పాటు చేసేందుకు అడ్డంకి ఏర్పడింది. ఇందుకు సంబంధించి గురువారం న్యాయస్థానం పాలకవర్గాల వ్యవహారానికి సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలని పేర్కొనడంతో ప్రభు త్వం కొత్త పాలక మండలి ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేయడంలో జాప్యం అనివార్యంగా కన్పిస్తోంది. న్యాయపరమైన చిక్కులు వీడాక నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశాలున్నాయి.
సభ్యుల సంఖ్య పెంపు
జిల్లాలోని 1,416 ఆలయాల్లో 16 ఏగ్రేడ్‌ ఆదాయాలు, 80 బిగ్రేడ్‌ ఆదాయాలు, 650 సిగ్రేడ్‌ ఆలయాలు ఉండగా రూ.50వేల కన్నా తక్కువ ఆదాయం వచ్చే ఎన్‌ఎన్‌డి ఆలయాలు మరో 500లు ఉన్నాయి. ఆదాయాలు లేకుండా ప్రభుత్వమే దూప దీప నైవేద్యాల కోసం రూ.2,500లు చెల్లించే ఆలయాలు మరో 170 ఉన్నాయి. ఇప్పటి దాకా ఏగ్రేడ్‌ ఆలయ కమిటీల్లో 9మంది సభ్యులు ఉండగా ప్రభుత్వం 11కు పెంచింది. బిగ్రేడ్‌ ఆదాయాల్లో ఐదుగురు సభ్యులకు గాను ఏడుగురు సభ్యులకు పెంచింది. సి గ్రేడ్‌ ఆదాయాల్లో సభ్యులు ముగ్గురు ఉండగా ఐదుగురికి పెంచింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలకవర్గాలను నియమించి వినాయక,దసర ఉత్సవాలను నిర్వహించేందుకు ఆసక్తి కనబర్చినప్పటికీ న్యాయపరమైన చిక్కుల వలన బ్రేక్‌ పడింది. జిల్లాలోని ఆలయాలకు సంబంధించి దాదాపు 3,986మందికి పాలకవర్గాల్లో స్థానం దక్కే అవకాశాలున్నప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వం వాటిని నియమించేందుకు కోర్టు ఆదేశాలతో జాప్యం అనివార్యమైంది. దీంతో టీడీపీ వర్గాలు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణలోనే ఆలయాలు
జిల్లాలో ప్రాధాన్యత గల మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంతో పాటు సింగరాయపాలెం, కైకలూరు, గుడ్లవల్లేరు, గుడివాడ, తదితర ప్రాంతాల్లోని పలు ప్రాభవం కలిగిన ఆలయాలకు సైతం అధికారుల పర్యవేక్షణలోనే మనుగడ సాగిస్తున్నాయి. గత పదేళ్ళల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలకవర్గాల నియామకాలకు సంబంధించి స్థానికత, దైవ చింతనలను పట్టించుకోకుండా ఎడాపెడా ఎవరిని పడితే వారిని కమిటీల్లో చొప్పించింది. ఫలితంగా పలు ఆలయాల్లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం, కుంభకోణాలు పెచ్చుమీరాయి. జరిగిన పనుల్లో నాణ్యత లోపించి నిధులు పక్కదారి పట్టడం లాంటి వ్యవహారాలకు వెలుగు చూశాయి. టీడీపీ ప్రభుత్వం కొత్త పాలక మండళ్ళను ఏర్పాటు చేసి దేవాలయాల ప్రాశస్త్యం కాపాడే దిశగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే న్యాయ పరమైన అడ్డంకులు రావడంతో ప్రస్తుతానికి పాలకమండళ్ళ నియామకం వాయిదా పడుతూ వస్తోంది.