Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:54AM

మురికి మూసీగా కృష్ణానదిని చేయకండి

(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
నదీ తీరాన రాజధాని సరే, మరో మురికి మూసీగా పవిత్ర కృష్ణానదిని చేయకండని రాజధాని నిర్మాణ వ్యూహకర్తలకు రైతాంగ సమాఖ్య నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌ సూచించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్ర వారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నదీతీరాన ఎత్తైన బహుళ అంతస్తుల భవనాలను రాజధాని కోసం నిర్మించాలని అనుకోవడం మంచిదేనన్నారు. అయితే ఇప్పటికే విజయవాడలోని పంట కాలువలన్నీ మురికి వాసాలుగా మారాయని చెప్పారు. విజయవాడలోని కాలువల్లో కాలుష్యం కలవకుండా చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాజధాని కానున్న నేపథ్యంలో నదీ తీరాన భవనాలు నిర్మించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కాలుష్యం కృష్ణానదిలో కలవకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాలువల్లో, కృష్ణానదిలో మురికినీరు కలవకుండా తగు మురికినీటి శుద్ధి ప్లాంటలను ఏర్పాటు చేయాల్సి ఉం దన్నారు. నిఫుణులు ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
దివిసీమలో ఇప్పటి వరకు 40 శాతం మేర కు నాట్లు పడలేదని నాగేంద్రనాథ్‌ చెప్పారు. చల్లపల్లి ప్రాంతంలో, ఇంకా అవలి గ్రామాల్లో పూర్తిగా నాట్లు పడలేదని పేర్కొన్నారు. కృష్ణా తూర్పు శాఖ కాలువ సరిగా పనిచేయడం లేదని చెప్పారు. పంట కాలువల పరిస్థితి అధ్వానంగా ఉందని, వాటిని వెంటనే బాగు చేయాలని కోరారు.
ఇక విజయవాడలో గతంలోనే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఉండేందుకు ఎకరాలెకరాల భూములను కేటాయించేశారన్నారు. స్వరాజ్యమైదానాన్ని ముందుగా ఖాళీ చేయించాలని, ఆ తరువాత దాని చుట్టు పక్కల ఉన్న అన్ని ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయించి, అక్కడ రాజధానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవచ్చునని సూచించారు. అన్ని ప్రభుత్వ, నీటి పారుదల శాఖకు చెందిన భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు.