Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:47AM

మేనేజ్‌మెంట్‌ కోటాకు మంగళం

కశింకోట: ఆర్‌ఈసీఎస్‌ (అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం) వినియోగదారుల పిల్లలకు సాంకేతిక విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో నెలకొల్పిన రాజీవ్‌ గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ ఏడాది వినియోగదారుల పిల్లలు చదువుకునే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. కళాశాల యాజమాన్యం భర్తీ చేయాల్సిన 50 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను అధికారులు వెబ్‌ కౌన్సెలింగ్‌లోనే భర్తీ చేసేశారు. దీంతో ఎలాగైనా కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్న వినియోగదారుల పిల్లలు భంగపడ్డారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే, తమ ప్రమేయం లేకుండానే వెబ్‌ కౌన్సెలింగ్‌లో అన్ని సీట్లను భర్తీ చేసేశారని కళాశాల ప్రిన్సిపాల్‌ ఉమాశంకర్‌ వాపోయారు. సీటు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న వినియోగదారుల పిల్లలకు సమాచారం అందిస్తున్నట్లు చెప్పారు.
మంచి లక్ష్యంతో కళాశాల ఏర్పాటు..
ఆర్‌ఈసీఎస్‌ వినియోగదారుల పిల్లలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే మంచి లక్ష్యంతో కశింకోట ఆర్‌ఈసీఎస్‌ ప్రధాన కార్యాలయం ఆవరణలో పాలిటెక్నిక్‌ కళాశాలను నిర్వహిస్తున్నారు. జీవో నంబరు 160,729ల ప్రకారం కళాశాల మేనేజ్‌మెంట్‌కు 50 శాతం సీట్లను భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతిఏటా ఈఈఈ, ఈసీఈ, సివిల్‌కు సంబంధించిన 180 సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇందులో 50 శాతం సీట్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి కేటాయిస్తుండగా, మిగిలిన 50 శాతం సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఆర్‌ఈసీఎస్‌ పరిధిలో ఉన్న అనకాపల్లి రూరల్‌, కశింకోట, మునగపాక, పరవాడ, సబ్బవరం ప్రాంతాలకు చెందిన విద్యుత్‌ వినియోగదారుల పిల్లలతో పాటు, ఉద్యోగుల పిల్లలతో భర్తీ చేస్తున్నారు. ఈ విధానం వల్ల పాలీసెట్‌లో ర్యాంకు తక్కువ వచ్చిన వారికి కూడా పాలిటెక్నిక్‌లో చేరే అవకాశం దక్కుతోంది.
అసలేం జరిగింది..
ఈ ఏడాది కూడా ఈఈఈ, ఈసీఈ, సివిల్‌ కోర్సులకు సంబంధించి 180 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. దీనికి గాను ఇప్పటికే వినియోగదారుల పిల్లలు కళాశాలలో ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన జరిగిన మొదటి వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఈఈఈలో 60 సీట్లు, సివిల్‌లో 60 సీట్లు, ఈసీఈలో 32 సీట్లను అధికారులు భర్తీ చేసేశారు. ఈసీఈలో మిగిలిపోయిన 28 సీట్లను కూడా ఈ నెల 15న జరిగే సెకెండ్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. దీంతో మేనేజ్‌మెంట్‌ కోటా రద్దు అయిన విషయం తేటతెల్లమయ్యింది. మేనేజ్‌మెంట్‌ కోటాలో సీటు దక్కుతుందని ఆశించిన విద్యుత్‌ వినియోగదారుల పిల్లలు కంగుతిన్నారు.
సమాచారం లేకుండానే కోటాను
రద్దు చేశారు.
-ప్రిన్సిపాల్‌ ఉమాశంకర్‌
ప్రతీఏటా 50 శాతం సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంది. ఈ సీట్ల భర్తీకి ఆర్జేడీ లేదా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ని నియమిస్తారు. ఈ విధానం 2009 నుంచి కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది 180 సీట్లకు గాను వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఇప్పటికే 152 సీట్లను భర్తీ చేసేశారు. దీంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లను భర్తీ చేసుకోవడానికి ఆర్జేడీ లేదా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ని నియమించాలని కోరుతూ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌కు ఈఏడాది జూన్‌లో లేఖ రాశాం. అయితే అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. రాష్ట్ర పాలీసెట్‌ కన్వీనర్‌ రఘునాథ్‌కు ఈ విషయాన్ని వివరించాం. మేనేజ్‌మెంట్‌ కోటా లేదని రఘునాథ్‌ స్పష్టం చేశారు. అయితే సమాచారం లేకుండా మేనేజ్‌మెంట్‌ కోటాను ఎందుకు రద్దు చేశారని కన్వీనర్‌ రఘునాథ్‌ను ప్రశ్నిస్తే రెండో కౌన్సెలింగ్‌ అయిన తర్వాత సీట్లు మిగిలిపోతే ఎలా భర్తీ చేయాలో సూచిస్తామని చెప్పారు. ఇప్పటికే సీట్ల కోసం 230 దరఖాస్తులు వచ్చాయి. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా 60 మందికి సీట్లు దక్కాయి. రెండో కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత కూడా సీట్లు మిగిలిపోతే భర్తీ చేస్తాం. అయితే వారికి ఫీజు రీయింబర్సుమెంట్‌ వర్తించదు.