Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:45AM

సగమే జలం

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి):
గత నెలాఖరులో భారీ వర్షాలు కురిసినప్పటికీ జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ప్రస్తుతం నీటిమట్టాలు గరిష్ఠ స్థాయికి సమీపంలోనే వున్నప్పటికీ, నిలువ వున్న నీటి సామర్థ్యం మాత్రం సగం కన్నా తక్కువే వుంది. ఈ ఏడాది పెద్దేరు మినహా మిగిలిన రిజర్వాయర్లలో ఒక్కటి కూడా నిండలేదు. రైవాడ, తాండవ, కోనాం, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్లలో నీటి నిలువ సగంలోపే వుంది. ఐదు ప్రధాన రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం 10.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.12 టీఎంసీలు మాత్రమే ఉంది. అయినప్పటికీ ఖరీఫ్‌కు ఢోకా లేదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో పెద్దగా వర్షాలు కురవకపోయినప్పటికీ గత ఏడాది చివర్లో కురిసిన భారీ వర్షాలతో రిజర్వాయర్లలో నీటి మట్టాలు ఆశాజనకంగానే వున్నాయి. జూలైలో 171.8 మి.మీ., ఆగస్టులో 252.5 మి.మీ., సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు 62.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అయితే ఈ వర్షాలు రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల్లో లేకపోవడంతో ఇన్‌ఫ్లో పెద్దగా లేదు. తాండవ రిజర్వాయర్‌ పూర్తిగా నిండితే 4.90 టీఎంసీల నీరు వుంటుంది. కానీ ప్రస్తుతం 2.70 టీఎంసీలు మాత్రమే వుంది. రైవాడ పూర్తి నీటి సామర్థ్యం 3.27 టీఎంసీలుకాగా ప్రస్తుతం 1.57 టీఎంసీలు, కోనాం రిజర్వాయర్‌ 0.85 టీఎంసీలకుగాను 0.36 టీఎంసీలు, మేహాద్రిగెడ్డ 1.17 టీఎంసీలకుగాను కేవలం 0.17 టీఎంసీలు వుంది. కాగా పెద్దేరు రిజర్వాయర్‌ పూర్తి నీటిసామర్థ్యం 0.35 టీఎంసీలుకాగా ప్రస్తుతం 0.32 టీఎంసీలతో మెరుగ్గా ఉంది. మేహాద్రిగెడ్డ మినహా మిగిలిన నాలుగు రిజర్వాయర్ల కింద ఆయకట్టు వుంది. తాండవ పరిధిలో 51 వేల ఎకరాలు, రైవాడ కింద 15 వేల ఎకరాలు, పెద్దేరు కింద 19,900 ఎకరాలు, కోనాం పరిధిలో 12,500 ఎకరాల ఆయకట్టు వుంది. ప్రస్తుతం వ్యవసాయ అవసరాల నిమిత్తం తాండవ నుంచి 500 కూసెక్కులు, రైవాడ నుంచి 150 క్యూసెక్కులు, కోనాం నుంచి వంద క్యూసెక్కులు, పెద్దేరు నుంచి 60 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అడపాదడపా వర్షాలు కురుస్తున్నందున కాలువలకు నీటి విడుదలను తగ్గించాలని ఆయకట్టు రైతులు సూచిస్తుండడంతో అధికారులు నీటి విడదలను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో సగం నీరే వున్నప్పటికీ ఖరీఫ్‌ సాగుకు ఎటువంటి ఢోకా లేదని నీటిసరిపడా నీటిని మాత్రం విడిచి పెడుతున్నారంటున్నారు. రెండుమూడు భారీవర్షాలు కురిస్తేగాని రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటీ సామర్ధ్యానికి చేరుకోలేవని అధికారులు పేర్కొంటున్నాయి. కాగా, ప్రస్తుతం ఉన్న నీరు ఖరీఫ్‌ వ్యవసాయ అవసరాలు తీర్చుతుందన్నది కూడా అనుమానమేనని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.