Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:45AM

పాడేరులో ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మె

పాడేరు/పాడేరురూరల్‌, సెప్టెంబర్‌ 12:
పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ వి.ప్రవీణ తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు శుక్రవారం విధులను బహిష్కరించి, కాంప్లెక్స్‌ వద్ద ధర్నా చేశారు. దీంతో డిపో నుంచి ఒక్క బస్సు నడవలేదు. కార్మికులపట్ల నిరంకుశంగా వ్యవహస్తున్న డీఎంను బదిలీ చేయాలని, అంతవరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ విషయం తెలుస్తున్న రీజియన్‌ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ జీవనప్రసాద్‌, డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ సీహెచ్‌ అప్పలనారాయణ పాడేరు వచ్చారు. మూడు రోజుల్లో డీఎంను బదిలీ చేస్తామని వారు హామీ ఇవ్వడంతో సాయంత్రం మూడు గంటలకు ఆందోళన విరమించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
తమ సమస్యలను పరిష్కరించాల్సిన డిపో మేనేజరే తమపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని భావించిన కార్మికులు... గురువారం రాత్రి ఉద్యోగుల విశ్రాంతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న డీఎం ప్రవీణ రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లి, కార్మికులను బెదిరించడంతోపాటు ఇద్దరిని డిస్మిస్‌ చేస్తానని హెచ్చరించారు. ఆమె హెచ్చరికలను తీవ్రంగా పరిగణించిన కార్మికులు అర్ధరాత్రి 12 గంటల నుంచి విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం కార్మికులు విధులకు హాజరు కాకుండా, కాంప్లెక్స్‌ వద్ద ధర్నాకు దిగారు. దీంతో మొత్తం బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి.
ఎమ్మెల్యే ఈశ్వరి చర్చలు
ఆర్టీసీ కార్మికుల ఆందోళన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరి, కాంప్లెక్స్‌ వద్దకు వచ్చారు. వివరాలు తెలుసుకున్న అనంతరం ఆర్‌ఎం వై.జగదీష్‌బాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. డీఎం ప్రవీణ కార్మికులను వేధింపులకు గురిచేస్తున్న, ఆమెను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆమె కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, డీఎం బదిలీకి ఆర్‌ఎం అంగీకరించారని, ఆయన హామీ నెరవేర్చకపోతే కార్మికులతో కలిసి ఆందోళన చేస్తానని అన్నారు. డీఎంపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఎం చెప్పినందున ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆందోళన విరమించాలని ఆమె కోరారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ జీవనప్రసాద్‌ మాట్లాడుతూ, ఓటీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వి.ముత్యాలమ్మ, మాజీ సర్పంచ్‌ వి.పిన్నయ్యదొర, ఆర్టీసీ యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.