Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:45AM

గున్నెంపూడిలో కొండ కబ్జా

బుచ్చెయ్యపేట, సెప్టెంబర్‌ 12:
భూముల విలువ ఇటీవల కాలంలో విపరీతంగా పెరగడంతో కొంతమంది బడాబాబుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. ‘కాదేదీ కబ్జాకు అనర్హం’ అన్న చందంగా వీరు కొండలను సైతం దర్జాగా ఆక్రమించేస్తున్నారు. భారీ యంత్రాలతో చెట్లను తొలగించి, రాళ్లను పిండి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పండ్ల మొక్కలు వేసి, నీటి సదుపాయం కోసం బోరు వేశారు. దీనికి విద్యుత్‌ సదుపాయం కోసం జనరేటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. లక్షలాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుంటే అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి వివరాలిలా వున్నాయి.
మండలంలోని గున్నెంపూడి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌-1లో కొక్కిరాల కొండ ఉంది. దీని విస్తీర్ణం సుమారు 400 ఎకరాలు వుంటుందని అంచనా. ఈ కొండపై గున్నెంపూడికి చెందిన ముచ్చకర్ల రాజేష్‌ దృష్టి పడింది. ఇతను హాంగ్‌కాంగ్‌లో డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. తన కుటుంబీకుల పేరు మీద డి ఫారమ్‌ పట్టాలు మంజూరు చేయించాలంటూ సుమారు రెండు నెలల క్రితం అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులను ఆశ్రయించాడు. ఇందుకువారు భరోసా ఇచ్చారు. తరువాత రెవెన్యూ సిబ్బందితో కలిసి కబ్జాకు పథకాన్ని రూపొందించారు. సర్పంచ్‌ వద్దకు వెళ్లి, రాజేష్‌ కుటుంబ సభ్యులకు డి. పట్టాలు పంపిణీ చేయడానికి అభ్యంతరం లేదని పంచాయతీ తీర్మానం చేసి, కాపీ ఇవ్వాలని కోరారు. ఇందుకు సర్పంచ్‌ సమ్మతించారు. రాజేష్‌ సూచన మేరకు ఆయన తండ్రి ముచ్చకర్ల వెంకునాయుడు, తల్లి దేముడమ్మ, భార్య శివాలమ్మ, సోదరిలు కర్రి జానకి, కొల్లిమళ్ల హిమబిందు, కుటుంబ సభ్యులు గొంపా తాతారావు, ముచ్చకర్ల రాజు, గొంపా లక్ష్మి పేర్లమీద డి పట్టాల మంజూరుకు అభ్యతరం లేదని పంచాయతీ పాలకవర్గ సమావేశంలో ఆమోదించారు. ఈ మేరకు నిరభ్యంతర పత్రాన్ని సర్పంచ్‌తోపాటు మరో ఎనిమిది మంది వార్డు సభ్యులు సంతకాలు చేసి ఇచ్చారు.
అనంతరం రాజేష్‌ కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులను సంప్రదించారు. పంచాయతీ తీర్మానం చేసిన కాపీని అందజేసినట్టు తెలిసింది. వారి సలహాతో కొండను చదును చేయించే పనులు చేపట్టారు. పెద్ద సంఖ్యలో కూలీలను ఏర్పాటు చేసుకుని సుమారు 15 ఎకరాల్లో పాదులు తీయించి కొబ్బరి, మామిడి, జీడిమామిడి, సపోటా, తదితర మొక్కలను నాటించారు. అంతేకాక బోరు వేసి, దానికి విద్యుత్‌ కోసం భారీ జనరేటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. కొండ దిగువ భాగంలో ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్న వారికి కొంత సొమ్మును ముట్టజెప్పి ఆ భూములను కూడా కలిపేసుకున్నారని తెలిసింది. దాదాపు మూడు వారాలపాటు కొండ చదును పనులు చేసినప్పటికీ గ్రామ, మండల స్థాయి రెవెన్యూ సిబ్బంది తెలియలేదంటే ఆశ్చర్యంగా వుంది. ఈ కబ్జాకు తెరవెనుక రెవెన్యూ అండదండలు వున్నాయని, లేకపోతే అంత బహిరంగంగా కొండను కబ్జా చేసి, చదును చేసే సాహసం చేయరని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండను చదును చేయడానికి, మొక్కలకు, బోరుకు, జనరేటర్‌ కోసం దాదాపు పది లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి వుంటారని వారు చెబుతున్నారు.
రెవెన్యూ సిబ్బంది చెబితే తీర్మానం చేశాం
కె.గణేష్‌, సర్పంచ్‌, గున్నెంపూడి
ముచ్చకర్ల రాజేష్‌ కుటుంబీకులకు కొండ పోరంబోకు భూమికి డి. పట్టాలు ఇస్తామని, అంతకు ముందు పంచాయతీ తీర్మానం చేసి ఇవ్వాలని రెవెన్యూ సిబ్బంది కోరారు. ఇందుకు ప్రతిఫలంగా దేవాలయం అభివృద్ధికి నిధులు ఇస్తానని ముచ్చకర్ల రాజేష్‌ చెప్పారు. దీంతో తీర్మానం చేసి, నిరభ్యంతర పత్రం ఇచ్చాం.
నోటీసులు జారీ చేసి,
కేసులు నమోదు చేస్తాం
ఎస్‌.సిద్ధయ్య, తహసీల్దార్‌
గున్నెంపూడిలో కొండ కబ్జాకు గురైనట్టు బుధవారం తెలిసింది. వెంటనే రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశాం. నిబంధనలకు విరుద్ధంగా కొండను చదును చేసి, మొక్కలు వేసినట్టు గుర్తించాం. అంతేకాక బోరు కూడా వేశారు. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి, కేసులు నమోదు చేస్తాం.