Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:44AM

సినీ ఫక్కీలో హత్య


గాజువాక : తాను గురువుగా భావించే వ్యక్తి చావుకు కారకురాలైందనే భావనతో ఆమెపై పగ పెంచుకున్నాడు...చేస్తున్న ఉద్యోగం వదిలి స్వస్థలానికి వచ్చాడు...ఆటో డ్రైవర్‌ అవతారం ఎత్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అదను చూసి ఆమెను అంతమొందించాడు...నేరం బయటపడడంతో ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గాజువాక పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ రామ్‌గోపాల్‌ నాయక్‌ వెల్లడించారు.
నాతయ్యపాలెం ప్రాంతానికి చెందిన పక్కి అనూషను శివ అప్పారావు అనే వ్యక్తి ప్రేమించాడు. ఆమె తిరస్కరించడంతో నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పారావును ఆటోడ్రైవర్‌ యర్ని కృష్ణ గురువుగా భావించేవాడు. అప్పారావు ఆత్మహత్య చేసుకున్న సమయంలో కృష్ణ దుబాయ్‌లో వున్నాడు. అక్కడో ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అప్పారావు మరణించినట్టు తెలుసుకుని దుబాయ్‌ నుంచి తిరిగొచ్చాడు. అతని మరణానికి దారితీసిన కారణాలను తెలుసుకున్నాడు. అనూషపై కక్ష పెంచుకుని అతడు ఆమెను హతమార్చి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఏడాది క్రితమే గాజువాక ప్రాంతంలో ఆటో డ్రైవర్‌ అవతారం ఎత్తి అనూషతో పరిచయం ఏర్పరచుకున్నాడు. అనూషకు ఇంట్లో సమస్యలు ఉన్నాయని తెలుసుకుని, వశీకరణ మందు వాడితే ఉపయోగం వుంటుందని అది విజయనగరం జిల్లా జామి ప్రాంతంలో దొరుకుతుందని నమ్మబలికాడు. జూలై 30న అనూషను ఆటోలో జామి సమీపంలోని అగ్రహారం ప్రాంతానికి తీసుకువెళ్లాడు. సమయం చూసి ఆమెపై దాడికి దిగాడు. తన గురువు చావుకు నీవే కారణమంటూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ తరువాత కేబుల్‌ వైర్‌తో గొంతునులిపి చంపాడు. ఆమె చనిపోయిన తరువాత తనతో పాటు తీసుకువెళ్లిన బైక్‌ కవర్‌లో మృతదేహాన్ని కుక్కి సమీపంలో వున్న బావిలో పడేశాడు. ఆమె ఒంటిపై వున్న బంగారు ఆభరణాలు, పదిహేను వందల నగదు, సెల్‌ఫోన్‌ తీసుకుని హైదరాబాద్‌ పరారయ్యాడు. కొద్దిరోజులపాటు అక్కడే వుండి తిరిగి వైజాగ్‌ బయలుదేరాడు. మార్గంమధ్యంలో సెల్‌ఫోన్లను గోదావరి నదిలో పడేశాడు.
సెల్‌ఫోన్‌ సిగ్నలింగ్‌ ఆధారంగా
నిందితుడు గుర్తింపు
నిందితుడు కృష్ణ హైదరాబాద్‌ వెళ్లిన తరువాత ఆమెకు చెందిన ఫోన్‌ను వినియోగంలోకి తెచ్చాడు. దీంతో పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నలింగ్‌ ఆధారంగా నిందితుడు హైదరాబాద్‌లో వున్నట్టు గుర్తించారు. ఆ తరువాత విశాఖ వస్తున్నప్పుడు సెల్‌ఫోన్లు గోదావరి నదిలో పడేయడంతో సెల్‌ఫోన్లు పనిచేయకపోవడంతో అనూషకు సంబంధించిన సెల్‌ఫోన్‌కు గత రెండు నెలలుగా వచ్చిన నంబర్లను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో కృష్ణ నిందితుడుగా ధ్రువీకరించుకున్నారు. చినముషిడివాడలో వుంటున్న కృష్ణ ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. రెండు రోజుల క్రితం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అనూషను హత్యమార్చినట్టు అంగీకరించాడు.
నిందితుడిని పట్టుకున్న
పోలీసులకు రివార్డులు
నాతయ్యపాలెం ప్రాంతానికి చెందిన అనూష అదృశ్యమైనట్టు భర్త ఈశ్వర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 30న గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. అనూష అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ కేవీ రమణ పర్యవేక్షణలో సీఐ వివేకానంద, కొంతమంది సిబ్బందితో ప్రత్యేక టీమ్‌గా ఏర్పడి ప్రత్యేకంగా కృషి చేసినట్టు డీసీపీ నాయక్‌ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రత్యేకంగా కృషిచేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని డీసీపీ అభినందించారు. సంబంధిత సిబ్బందికి రివార్డులు అందజేయనున్నట్టు డీసీపీ తెలిపారు.


కలగీేో