Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:44AM

మణుల పేరుతో మస్కా?

నక్కపల్లి:
నాగుపాముల్లో మణులుంటాయని, వాటిని దక్కించుకుంటే అన్నింటా విజయం సిద్ధిస్తుందని, విషపురుగుల బెడద నుంచి కాపాడుకోవచ్చునని, ఇంట సిరుల పంట పడుతుందన్న కొందరి విశ్వాసాన్ని స్నేక్‌ ఛార్మర్స్‌ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. దీంతో నాగుపాముల మణులంటూ గ్రామీణులను నమ్మించే ప్రయత్నం చేసి వేల రూపాయలను నొక్కేస్తుంటారు. రహదారి మలుపులు, తుప్పలు వున్న ప్రాంతాల్లో తమ వెంట తెచ్చిన పాములను ఎవరి కంటా పడకుండా వదిలేస్తారు. ఆ వెంటనే పాముల కదలికను చూసిన స్థానికుల హడావిడిని గమనించిన (స్నేక్‌ ఛార్మర్స్‌) స్నేక్‌ క్యాచర్స్‌ పామును పడతామని, ఎంతో కొంత ముట్టజెప్పాలని బేరం కుదుర్చుకుంటారు. ఆ తరువాత ఇది అసలు సిసలైన పాముగా నమ్మిస్తూ, ఇందులో వున్న నాగ మణులను ఇంట్లో ఉంచుకుంటే ఇక తిరిగే వుండదని నమ్మిస్తారు. ముందుగానే పాము శిరస్సులో మణిగా చెప్పే రాళ్లను అమర్చి, సన్నని దారంతో కుట్టిన ప్రాంతం నుంచి తమ వద్ద ఉన్న చాకుతో నిజంగానే అందులో మణిని తీసినట్టు నటిస్తారు. అందరూ చూస్తుండగా పాము శిరస్సులో నుంచి నల్లని రాయి వంటి పదార్థాన్ని తీసి ఇది నిజమైన మణిగా నమ్మిస్తారు. దీనిని ఇంట్లోకి తీసుకెళ్లి పూజాగదిలో వుంచుకున్నా, బీరువాల్లో భద్రపర్చుకున్నా తిరుగుండదని, ఎంతో మంచిదని నమ్మించే ప్రయత్నం చేస్తారు. దీంతో చాలామంది నిరక్షరాస్యులు, గ్రామీణులు మణులు వుంటాయని నమ్మి వాటిని కొనుగోలు చేసేందుకు మక్కువ కనబరుస్తుంటారు. ఒక్కో రాయిని నాగమణిగా చెప్పి రూ. 600 నుంచి రూ.2000 వేలు వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ రకమైన వ్యాపారం పలువురు చేస్తుండగా, వారి మాటల బుట్టలో పడిన గ్రామీణులు మూఢనమ్మకంతో వాటిని కొనుగోలు చేస్తూ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు.
అవన్నీ అపోహలే..
వైద్యాధికారి పూర్ణచంద్రరరావు
పాముల్లో ఏ రకమైన రాళ్లు, మణులు వుండవు. అవి కేవలం అపోహలే. గ్రామీణులు, అమాయకులైన నిరక్షరాస్యుల్లో వున్న మూఢనమ్మకం, అపోహలను సొమ్ము చేసుకుంటారు.
ముందుగానే పాములను పట్టేవారు అందులో చిన్నసైజు నల్లటి రాళ్లను పెట్టి వుంచుతారు. పాములను పట్టినట్టు నటించి అందులో నుంచి ఈ రాళ్లను తీసి గ్రామీణులను మోసం చేస్తుంటారు. ఎవరూ ఇటువంటి వాటిని నమ్మి మోసపోకూడదు.