desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:40AM

తోలు బొమ్మలాటకు విశ్రాంతి

రాష్ట్రంలో 12 నుంచి 19వ శతాబ్దం వరకు తోలుబొమ్మలాటకు మంచి గుర్తింపు, ఆదరణ ఉండేది. ఈ ఆటలను ప్రదర్శించే స్థలాలను తెలుగు జానపద ప్రదర్శనశాలలని పిలిచేవారు. రెండు గుంజలకు తెల్లటి వస్త్రాన్ని తెరలా కట్టి దాని వెనుక దీపం కాంతిలో బొమ్మలను ఆడిస్తూ సమయానుకూలంగా సంభాషణలు చెబుతుండేవారు. ఇది తోలుబొమ్మల ప్రదర్శన తీరు. ఇందులో ప్రదర్శించే బొమ్మలను గొర్రె, లేడి, దుప్పి తదితర జంతువుల చర్మాలతో తయారుచేస్తారు. ఎండబెట్టిన చర్మాన్ని పాత్రలకు తగ్గట్లు వివిధ ఆకృతుల్లో కత్తిరించి రంగులు అద్ది దారంతో భాగాలన్నింటినీ కలిపి బొమ్మగా తయారు చేస్తారు. దీనినే తోలుబొమ్మ అంటారు. ఇలా తయారు చేసిన బొమ్మలను పట్టుకోవడానికి వీలుగా కర్రలను ఏర్పాటు చేసుకుంటారు. తోలుబొమ్మలాట తెరను 8 అడుగుల వెడల్పు, 6 అడుగుల వెడల్పుతో తయారు చేస్తారు. సందర్భాన్ని బట్టి పాత్రలను తెర వెనుక ఆడిస్తూ సంభాషిస్తుంటారు. తోలుబొమ్మలాట, నీడ తోలుబొమ్మ నాటకంగా పిలుచుకునే ఈ కళ రాష్ట్రంలో ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఉత్తర శైలిగా, అనంతపురం, కర్నూలు తదితర రాయలసీమ ప్రాంతాల్లో దక్షిణశైలిగా పిలుచుకునేవారు. అప్పట్లో ఈ తోలుబొమ్మలాట ద్వారా వేలాది మంది ఉపాధి పొందేవారు. ఈ ప్రదర్శనలు చేసే వారిని బొమ్మలాట వాళ్లుగా పిలుచుకునేవారు. ఈ తోలుబొమ్మలకు పలువురు కళాకారులు ఎంతో శ్రద్ధగా పాత్రలకు అనుగుణంగా దుస్తులు, ఆభరణాలు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకునేవారు. తమ కళానైపుణ్యాన్ని చాటి ప్రశంసలు పొందేవారు. శ్రీశైలం దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా తిరునాళ్లలో 13వ శతాబ్దం నుంచి క్రమం తప్పకుండా పలు ప్రాంతాల నుంచి కళాకారులు ప్రదర్శనకు వచ్చేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ తోలుబొమ్మలాట ప్రదర్శనలో పురాణ, సామాజిక, హాస్య అంశాలను కథా వస్తువులుగా ఎంచుకునేవారు. చదువు రాని వారికి సైతం సూటిగా అర్థమయ్యే విధంగా ఉంటూ వారికి చరిత్ర, పురాణాలపై అవగాహన కలిగించేవారు. ఈ ప్రక్రియను మొదట రాజులు, పండితులను రంజింపజేసేందుకు చిన్నచిన్న బొమ్మలు చేసి ఇతివృత్తం తీసుకుని ప్రదర్శించేవారు. క్రమేపీ ఇది కళగా రూపాంతరం చెంది విదేశాలకు సైతం విస్తరించింది. ప్రస్తుత ఛాయచిత్ర ప్రదర్శనకు మన తోలుబొమ్మలాట మూలం అని చెప్పుకోవచ్చు. స్వాతంత్య్ర పోరాటం సమయంలో ప్రజలను చైతన్యపచడంలో తోలుబొమ్మలాట ప్రత్యేక పాత్ర పోషించింది. రామాయణం ఇతివృత్తంగా సుందరాకాండ, యుద్ధకాండ, ఇంద్రజిత్తు వధ, లక్ష్మణమూర్చ, భారతంలో కీచకవథ, విరాటపర్వం, శశిరేఖాపరిణయం తదితర నాటికలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. సామాజిక అసమానతలు తొలగించేందుకు వివిధ నాటికల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశాయి. ప్రజలకు వినోదం కలిగించేందుకు ప్రదర్శనలో కథకు సంబంధించిన పాత్రలే కాక హాస్యం కోసం కొన్ని పాత్రలు సృష్టించారు. వాటిలో కేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్క ప్రధానమైనవి. ఈ పాత్రలు చాలా ఉత్కంఠగా సాగుతున్న కథల నేపథ్యంలో మధ్యలో ప్రవేశించి ప్రజలను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ పాత్రలు ప్రదర్శన సమయంలో సందర్భాన్ని బట్టి నటిస్తూ సమాజంలోని దురాగతాలను ఎత్తి చూపుతూ కనువిప్పు కలిగించేవి. ప్రస్తుతం తోలుబొమ్మలాటకు ప్రత్యామ్నాయంగా వివిధ రకాల సాంకేతిక, వినోద సాధనాలు రావడంతో ప్రజల్లో ఆదరణ కొరవడి క్రమంగా కనుమరుగయ్యే క్రమంలో చేరిపోయింది. ప్రాచీన కళగా తోలుబొమ్మలాటను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని కళాకారులు భావిస్తున్నారు.