desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:39AM

‘వైట్‌ కాలర్‌’పై ఫైట్‌

నెల్లూరు - క్రైం: జిల్లాలో తెల్లచొక్కాల(వైట్‌ కాలర్‌) నేరగాళ్లపై దృష్టి సారించాలని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నేరాలపై సమీక్షించారు. ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టడం, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం, ఫైనాన్స్‌ కంపెనీలు, స్కీముల పేరుతో ప్రజలను మోసం చేయడం వంటి కేసులపై చర్యలు తీసుకోవాలన్నారు. తెల్లచొక్కాల నేరగాళ్లపై ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలని ఆయన సూచించారు. రాజకీయ అండదండలు ఉన్నవారే ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, అటువంటి వారిని ఉపేక్షించవద్దన్నారు. ఇటీవల ఎస్‌ఐలుగా బాధ్యతలు చేపట్టిన వారికి చట్టాలపై శిక్షణ ఇస్తామన్నారు. అలాగే కేసుల దర్యాప్తుపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తవారు విధినిర్వహణలో నేర్పరితనంగా వ్యవహరించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై తనిఖీలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ఓ ప్రొఫెసర్‌తో పరిశీలన జరిపించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
సెక్షన్‌ 41 సీఆర్‌పీసీపై అవగాహన
ఇటీవల సుప్రీంకోర్టు 41వ సీఆర్‌పీసీ నిబంధనను అమలు చేయాలని జీవో జారీ చేసిందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌డీ రోజ్‌దార్‌ తెలిపారు. దానిపై పోలీసులకు అవగాహన కల్పించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల గురించి, ఏ కేసుల్లో నిందితులను అరెస్ట్‌ చేయాలి, ఏ కేసుల్లో అరెస్ట్‌ చేయకూడదు అని వివరించారు. అరెస్ట్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కోర్టుకు ఎలాంటి వివరాలు సమర్పించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్‌ గంగాధర్‌, నెల్లూరురూరల్‌ డీఎస్పీ రాంబాబు, గూడూరు డీఎస్పీ చౌడేశ్వరి పాల్గొన్నారు.