desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 12:52PM

వృథా కాలేదు..నీ త్యాగం

శ్రీకాంతాచారి ఆరో వర్థంతి రేపు

మోత్కూరు: నాడు నైజాం నిరంకుశ పాలనను అంతమొందించ డంలో రైతాంగ సాయుధ పోరాటం ప్రధాన భూమిక పోషించగా... నేడు ప్రత్యేక తెలంగాణ సాధనలో యువ కులు, విద్యార్థుల ఆత్మాహుతి, ప్రాణత్యాగాలు ప్రధాన ఘట్టాలుగా నిలిచాయి. 2001 నుంచి ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం సాగుతున్నా 2009 నవంబర్‌ చివరి వారంలో కేసీఆర్‌ ఆమరణ దీక్షకు పూనుకోవడం, శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకోవడంతో ఉద్యమం ఉధృతమైంది. 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టగా పోలీసులు ఆ దీక్షను భగ్నం చేయడంతో కలత చెందిన శ్రీకాంతాచారి హైదరాబాదు ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో పట్టపగలు అంతా చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు చల్లార్చి ఆస్పత్రికి తరలించగా మృత్యువు కోరల్లో ఉన్నా కూడా ప్రాణం గురించి మాట్లాడకుండా తాను బతికినా తెలంగాణ కోసం మళ్లీ చస్తానన్న అతని మాటలు అతన్ని పరామర్శించడానికి వెళ్లిన నాయకుల, ప్రజల మనస్సులను కలిచివేశాయి. అతన్ని బతికించడానికి వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఐదు రోజులు మృత్యువుతో పోరాడి 2009 డిసెంబర్‌ 3న కన్నుమూసి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడయ్యాడు.
 
మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు శంకరమ్మ, వెంక టాచారి పెద్దకుమారుడు శ్రీకాంతాచారి. అతనికి ఒక సోదరుడు రవి ఉన్నారు. వారిది నిరు పేద కుటుంబం. తల్లి శంకరమ్మ కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షకురాలిగా పనిచేస్తుండగా తండ్రి వెంకటాచారి వడ్రంగి పని చేసేవారు. శ్రీకాంతాచారి ఫిజియోథెరపీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఓ వైపు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. ఎప్పుడూ టీఆర్‌ఎస్‌ నాయకుల వెంటే ఉండేవాడు. కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమని నమ్ముతూ ఆయన పిలుపులను సమర్థంగా నిర్వహించేవాడు. శ్రీకాంతాచారి మృతితో అతడి స్వగ్రామమైన పొడిచేడుతో పాటు రాష్ట్రం యావత్తు విషాదంలో మునిగిపోయింది. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, పోరాడి తెలంగాణ సాధించుకోవాలని నాయకులు, మేథావులు చెప్పినా సుమారు 1200 మంది ఆత్మహత్యలకు పాల్పడి తెలం గాణ ఉద్యమంలో అమరులయ్యారు. అమర వీరుల ఆశలు పండి ఎట్టకేలకు జూన్‌ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించడంతో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్‌ 3న శ్రీకాంతాచారి ఆరో వర్ధంతి కాగా తెలం గాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండో వర్థంతి ఇది. తెలంగాణ సాధనతో శ్రీకాంతాచారికి నిజమైన నివాళి అర్పించినట్టయినప్పటికీ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వచ్చి పేదల బతుకులు బాగుపడతాయన్న ఆయన ఆశ నెరవేరాల్సి ఉంది.
 
కొత్త జిల్లాల్లో ఒకదానికి శ్రీకాంతాచారి పేరు పెట్టాలి
తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకున్న నా కుమారుడు శ్రీకాం తాచారి త్యాగం ఫలించి తెలంగాణ సిద్ధించింది. కేసీఆర్‌ నా కుమారుడిని తెచ్చి ఇవ్వలేకపోయినా తెలంగాణ సాధించడం మాకు గర్వంగా ఉంది. నూతనంగా ఏర్పాటు చేసే జిల్లాల్లో ఒక దానికి తెలంగాణ మలి ఉద్యమంలో తొలి అమరుడైన నా కుమారుడు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి. శ్రీకాంతాచారి జయంతి, వర్థంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. ఆత్మత్యాగానికి పాల్పడి ప్రజల గుండెల్లో నా కుమారుడు నిలిచిపోయినప్పటికీ మోత్కూరు మండల కేంద్రంలో మాత్రం శ్రీకాంతాచారి విగ్రహం పెట్టడం లేదు. ఈ విషయాన్ని మరోసారి మంత్రి జగదీష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తా. అప్పటికీ పెట్టకపోతే నేనే మోత్కూరులో నా కుమారుడి విగ్రహం ఏర్పాటు చేస్తా.
శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ