Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 02:53AM

పదవుల పంపకం

  • 8 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
  • ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జూపూడి
  • నన్నపనేని, కె.లక్ష్మీనారాయణకు అవకాశం!
హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): టీడీపీ వర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవుల నియామకానికి సీఎం చంద్రబాబు తెరతీశారు. ఒకేసారి 8కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను నియమించారు. దీనిపై ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన కాపు ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మనగా కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గ టీడీపీ నేత చలమలశెట్టి రామానుజయ్య నియమితులయ్యారు. ఇక... ఎస్సీ కార్పొరేషన చైర్మనగా జూపూడి ప్రభాకరరావు నియమితులయ్యారు. జూపూడి మాల సామాజిక వర్గానికి చెందిన వారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యను గృహ నిర్మాణ సంస్థ చైర్మనగా నియమించారు. పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధను మహిళా ఫైనాన్స కార్పొరేషన చైర్‌పర్సన్‌గా నియమించారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎమ్మెల్యే పి.రంగనాయకులును ఎంపిక చేశారు. మరోవైపు... టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక బాధ్యతలో ఉన్న ప్రొఫెసర్‌ జయరామిరెడ్డిని స్టేట్‌ ఫైనాన్స కార్పొరేషన చైర్మనగా నియమించారు. కడపకు చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పౌర సరఫరాల శాఖ కార్పొరేషన చైర్మనగా నియమితులయ్యారు. స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన చైర్మనగా ఎల్వీఎసార్కే ప్రసాద్‌ను నియమించారు. ప్రసాద్‌ ప్రస్తుతం టీడీపీ కేంద్ర మీడియా కమిటీ విభాగపు కన్వీనర్‌గా ఉన్నారు.
 
ప్రాంతాలు, వర్గాల మధ్య సమతుల్యత
ప్రాంతాలు, సామాజిక వర్గాలు, వివిధ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ‘నామినేటెడ్‌’ నియామకాలు జరిపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తాజాగా భర్తీ చేసిన 8 కార్పొరేషన్లలో 3 రాయలసీమకు, 5 కోస్తా ప్రాంతానికి దక్కాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ వస్తున్న ఫ్రొఫెసర్‌ జయరామిరెడ్డి కీలకమైన ఎస్‌ఎ్‌ఫసీ చైర్మన పదవిని ఇచ్చారు. ఆయన గతంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలికి చైర్మనగా కూడా చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చినప్పటికీ క్రియాశీలకంగా ఉంటూ గళం వినిపిస్తున్నారన్న అభిప్రాయంతో జూపూడికి పదవి ఇచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ ప్రకటించినప్పటికీ ఏపీలో ఓటు హక్కు లేకపోవడంతో... అప్పుడు అవకాశం కోల్పోయారు. ఆయనకు ఏదైనా పదవి ఉంటే తన వాణిని మరింత బలంగా వినిపించగలరన్న అభిప్రాయంతోనే ఇప్పుడు ప్రాధాన్యం కల్పించినట్లు చెబుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చురుకుగా పనిచేసిన కృష్ణాజిల్లా నేతలు వర్ల రామయ్య, పంచుమర్తి అనూరాధలకు గుర్తింపు లభించింది. వారి సామాజిక నేపథ్యం కూడా వారి ఎంపికకు ఉపయోగపడింది. అనూరాధ చేనేత వర్గానికి సంబంధించిన వారు కాగా, రామయ్య ఎస్సీల్లో మాదిగ ఉపకులానికి చెందిన వారు. ఇద్దరూ మంచి వక్తలుగా పేరు తెచ్చుకున్నారు. అనూరాధ కూడా ఎమ్మెల్సీ పదవిని చేజార్చుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన చైర్మన పదవి అనూహ్యంగా చలమలశెట్టి రామానుజయ్యను వరించింది. ఆ సామాజికి వర్గానికి సంబంధించిన అనేక మంది నేతలు అటూ ఇటూ వెళ్లినప్పటికీ... రామానుజయ్య పార్టీని అంటిపెట్టుకుని ఉండటం ఆయనకు కలిసి వచ్చింది. ఆయన గత ఎన్నికల్లో కైకలూరు స్థానం ఆశించారు. కానీ, పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి ఇవ్వడంతో రామాంజనేయులుకు అవకాశం దక్కలేదు. అయినా ఆయన నిరాశ పడకుండా తర్వాత రాష్ట్ర కార్యాలయంలో పనిచేసి అధిష్ఠానం గుర్తింపును పొందటం ఆయనకు కలిసి వచ్చిన అంశం. టీడీపీ మీడియా కమిటీ చైర్మన ఎల్వీఎసార్కే ప్రసాద్‌ తెలంగాణలో చాలాకాలంగా ఉంటున్నా ఆయన సుదీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఆయన కృష్ణా జిల్లాలో పుట్టడం ఇప్పుడు రాషా్ట్రల పరంగా సాంకేతిక ఇబ్బందులు లేకుండా ఉపయోగపడింది. కడపకు చెందిన లింగారెడ్డి పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి ఆశించినప్పటికీ.. దక్కకపోవడంతో.. ప్రత్యామ్నాయంగా ఏదైనా ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు కొద్దిరోజుల్లోనే దాన్ని నిలుపుకొన్నారు. హిందూ పురం మాజీ ఎమ్మెల్యే రంగనాయకులకు... ఎమ్మెల్యే బాలకృష్ణ సిఫారసుతో కార్పొరేషన చైర్మన పదవి లభించింది. తాను హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నిక కావటానికి సహకరించినందుకు ప్రతిగా రంగనాయకుల పేరును బాలకృష్ణ ప్రతిపాదించారు. తదుపరి దశలో... మహిళా కమిషన చైర్మనగా నన్నపనేని రాజకుమారి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మనగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ కె. లక్ష్మీనారాయణకు పదవులు దక్కనున్నాయి.