Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:37AM

పదవిలో ఉన్నా పార్టీకీ ప్రాధాన్యం

కడప సెవెన్‌రోడ్స్‌

రాజ్యాంగ పదవిలో ఉన్నా... తాము పార్టీ ప్రాధాన్యం ఇస్తాం.. కుల మతాలకు అతీతంగా జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తాం. రాష్ట్రంలోనే అభివృద్ధిలో కడపను అగ్రగామిగా చేసి చూపిస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌వి సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సీట్లు రాలేదని, అందుకే ప్రభుత్వం వివక్షత చూపుతున్నదని కొందరు కట్టుకథలు చెపుతూ అపోహలు సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహకారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే అభివృద్ధిలో కడప జిల్లాను ముందువరుసలో పెట్టి అపోహలు సృష్టించే వారికి కనువిప్పు కలిగిస్తామని చెప్పారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టాక శుక్రవారం తొలిసారి కడపలో పర్యటించారు. ఆయనకు పార్టీ నాయకులు, శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. జిల్లా మేధావుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జరిగిన సన్మాన కార్యక్రమం, మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేలు, లక్షల కోట్లు కుమ్మరించినంత మాత్రాన అభివృద్ధి సాధ్యపడదని, అందుకు కడప రిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తినా హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో నీరు తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించిన నిధులు దారిమళ్లడమే కారణమన్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో ఇలాంటి కార్యక్రమాలే కొనసాగాయని ఆరోపించారు. జిల్లాను అభివృద్ధి పరిచేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, ఉక్కు పరిశ్రమ, ఖనిజ ఆధారిత పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా మానవవనరులు, విద్యుత్‌, నీరు అవసరమన్నారు. కడప జిల్లాలో మానవవనరులకు కొదవ లేదని అన్నింటా ముందు నిలిచే యువత ఉందన్నారు. అక్టోబర్‌ రెండో తేదీ నుంచి 24 గంటల కరెంట్‌ ఇస్తామని చెప్పిన చంద్రబాబు నెల ముందు నుంచే ఆచరణలో పెట్టి చూపించారన్నారు. దీంతో విద్యుత్‌ సమస్య లేకుండా పోయిందన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు 45 టీఎంసీల నీరు వస్తుందని అందులో సాధ్యమైనంత ఎక్కువగా కడపకు వాటాగా తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మూడు వనరులతో జిల్లాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలకు తోడు రక్షణ శాఖ ఆయుధ ప్రయోగ శాలను కడప నగర శివారులలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయన్నారు. ఇలా అన్ని రంగాలలో జిల్లాను అభివృద్ధి పరుస్తామని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి జిల్లా ప్రజలు, యువకులు సహకరించాలని సూచించారు.