Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 2 2015 @ 01:31AM

ఏడాదిలో పూర్తి చేయాలి

  • ‘కమాండ్‌ కంట్రోల్‌’ భవన నిర్మాణంపై తుమ్మల
  • ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించాలి
  • హైదరాబాద్‌కు మణిహారంగా నిలవాలి
  • కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు కేంద్ర సంస్థ ఓకే
  • అధ్యయన నివేదికను అందజేసిన ‘రైట్స్‌’
  • విమానయాన శాఖ సంసిద్ధతే తరువాయి
  • ఎయిర్‌పోర్టుతో కోల్‌బెల్ట్‌కు మేలన్న తుమ్మల
హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ హెడ్‌ క్వార్టర్స్‌, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నూతన భవన నిర్మాణ పనులను 12 నెలల్లోగా పూర్తి చేయాలి’’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ గణపతిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. హెడ్‌ క్వార్టర్స్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి సంబంధించిన ఎస్టిమేషన్లు, డిజైన్లను వారంలోగా పూర్తి చేయాలని తుమ్మల ఆదేశించారు. అన్ని సాంకేతిక అనుమతులు, నిధుల మంజూరు వంటివాటిని 15 రోజుల్లోగా పూర్తి చేయాలని, అనంతరం టెండర్‌ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులన్నింటినీ పూర్తి చేసి, నెలాఖరులోగా నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం ఉండకూడదని, 12 నెలల్లో పూర్తి చేసి, పోలీసు శాఖకు భవనాన్ని అందించాలని చెప్పారు. అనుభవం గల కాంట్రాక్టు సంస్థకు నిర్మాణ పనులను అప్పగించాలని.. పనుల్లో నాణ్యత ఉండాలని, అన్ని ప్రక్రియల్లో పారదర్శకతను పాటించాలని ఆదేశించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రూ.700 కోట్లతో అద్భుతంగా నిర్మించాలన్న సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా భవన నిర్మాణం ఉండాలని చెప్పారు. హైదరాబాద్‌ మెగా సీటికి ఇది మణిహారంగా మారాలన్నారు. ‘ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం హబ్‌’గా ఈ భవనం పని చేయాలని, ఆ రకంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక్కడ ఎయిర్‌పోర్టును నిర్మించవచ్చం టూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘రైట్స్‌’ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖకు ‘ఫీజిబిలిటీ స్టడీ’ నివేదికను అందజేసింది. ఇక కేంద్ర పౌర విమాన యాన శాఖ తన సంసిద్ధతను తెలియజేయడమే మిగిలి ఉంది. ‘కోల్‌ హబ్‌’గా అభివృద్ధి చెందుతున్న కొత్తగూడెంలో విమానాశ్రయాన్ని నిర్మిం చాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. మండలంలోని పునుకుడు చెల్కలో 1,600 ఎకరాలను గుర్తించింది. ఈ ప్రాంతం హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి 220 ఏరియల్‌ కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సహకరించాలంటూ కేంద్ర పౌర విమాన యాన శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై ‘ఫీజిబిలిటీ స్టడీ’ని చేపట్టాలంటూ ఆ శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు ఆదేశించారు. ఈ ఫీజిబిలిటీ స్టడీ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌ (రైట్స్‌)’కు అప్పగించారు. పునుకుడు చెల్క ప్రాంతంలో ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఆ ప్రాంతం అనువైందా కాదా అన్నది పరిశీలించింది. ప్రస్తుతం కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాలు కోల్‌ హబ్‌గా పరిణమిస్తున్నాయి. ప్రముఖ సింగరేణి సంస్థ కూడా ఎయిర్‌పోర్టు సౌకర్యాన్ని కోరుతోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ‘రైట్స్‌’ సంస్థ ప్రతినిధులు అక్కడ ఎయిర్‌పోర్టును నిర్మించవచ్చంటూ వారం కిందట రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌కు ఈ నివేదికను అందజేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం నివేదికను కేంద్ర పౌరవిమానయాన శాఖకు పంపనున్నది. ఈ నివేదికను ఆధారంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ నిధులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంవల్ల కొత్తగూడెం, మణుగూరు వంటి కోల్‌బెల్ట్‌ ఏరియాకుఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు.