Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Dec 1 2015 @ 23:35PM

రుణదాతల చేతికి ఐవిఆర్‌సిఎల్‌

  • రుణాలను ఈక్విటీగా మార్చడంపై కసరత్తు 
  • ఈ వారమే రుణదాతల సమావేశం 
హైదరాబాద్‌ : ఐవిఆర్‌సిఎల్‌ కంపెనీ నిర్వహణను తమ పట్టులో ఉంచుకునేందుకు ప్రమోటర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుత మేనేజ్‌మెంట్‌ను తప్పించి ఇక తామే కంపెనీ నిర్వహణ చేపట్టాలని రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్ణయానికి వచ్చేశాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ వారమే సమావేశం అవుతున్నాయి. ఈ సమావేశంలోనే వ్యూహాత్మక రుణ పునర్‌ వ్యవస్థీకరణ (ఎస్‌డిఆర్‌) కింద తమ రుణాలను ఈక్విటీగా మార్చడంపై నిర్ణయం తీసుకోబోతున్నాయి. సోమవారమే రుణ దాతలు దీనిపై కంపెనీ ప్రస్తుత మేనేజ్‌మెంట్‌కు తెలియజేశారు. అందరూ ఆమోదిస్తే ఈ సమావేశంలో ఎస్‌డిఆర్‌ కింద రుణదాతలు తమ రుణాలను ఈక్విటీగా మార్చుకుని ఏకంగా కంపెనీ నిర్వహణ చేపట్టే అవకాశం ఉంది. తర్వాత అప్పులు తీర్చేలా ఎవరైనా మంచి ఆఫర్‌తో ముందుకొస్తే, రుణ దాతలు కంపెనీ మేనేజ్‌మెంట్‌ను వారికి కట్టబెట్టే అవకాశం ఉంది. ఎస్‌డిఆర్‌ సమావేశంలోనే ఐవిఆర్‌సిఎల్‌కు చెందిన నిర్మాణ రంగం, ఇపిసి వ్యాపారాలను రెండుగా విభజించే అవకాశం కూడా ఉంది.
 
తీరని ఆర్థిక కష్టాలు
మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగంలో ఒకప్పుడు ఐవిఆర్‌సిఎల్‌ కంపెనీకి మంచి పట్టు ఉండేది. వెనకా ముందు చూడకుండా నిర్మించు, నిర్వహించు, బదిలీ చెయ్యి (బిఒటి) పద్దతిలో వచ్చిన రోడ్‌ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి కంపెనీ చేతులు కాల్చుకుంది. దీంతో అప్పులు కుప్పల్లా పెరిగి పోయాయి. ఆర్థిక వ్యవస్థ నీరసించడం సైతం కంపెనీని దెబ్బతీసింది. జూన్‌, 2014 నాటికి అప్పుల భారం రూ.7,350 కోట్లకు చేరింది. అదే సమయంలో కంపెనీకి వచ్చే ఆర్డర్లు బాగా పడిపోయాయి. దీంతో గత ఏడాది జూన్‌లో రుణ దాతలతో కార్పొరేట్‌ రుణ పునర్‌ వ్యవస్థీకరణ (సిడిఆర్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కూడా కంపెనీకి కలిసి రాలేదు. అప్పుల భారం మాత్రం రూ.7,350 కోట్ల నుంచి రూ.5,746 కోట్లకు దిగొచ్చింది. అదే సమయంలో ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమీకరించాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దాదాపు రూ.4,000 కోట్లు విలువైన ప్రాజెక్టులను గత ఏడాది సెప్టెంబర్‌లోనే అమ్మకానికి పెట్టింది. అయితే వాటిని కొనేందుకు కంపెనీలేవీ పెద్దగా ఆసక్తి చూపలేదు. సెప్టెంబర్‌, 2015తో ముగిసిన త్రైమాసికం సైతం ఐవిఆర్‌సిఎల్‌ కంపెనీకి చేదు అనుభవం మిగిల్చింది. ఈ కాలానికి కంపెనీ రూ.641 కోట్ల ఆదాయంపై రూ.305 కోట్ల నష్టం ప్రకటించింది.
 
పేరుకు పోయిన నష్టాలతో కంపెనీకి ఉన్న రూ.941 కోట్ల నికర ఆస్తుల విలువ సైతం తుడిచి పెట్టుకు పోయింది. దీనికి తోడు వడ్డీ చెల్లింపులపై రుణదాతలు ఇచ్చిన విరామం సెప్టెంబర్‌తో ముగిసింది. వచ్చే ఏడాది మార్చి నుంచి కంపెనీపై మళ్లీ ఈ భారం పడబోతోంది. అప్పుల భారం తీరాలంటే కంపెనీ నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల ఆర్డర్లు పూర్తి చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశమే కనిపించడం లేదు. దీంతో ప్రస్తుత మేనే జ్‌మెంట్‌ను తప్పించి, ఇక తామే కంపెనీ నిర్వహణ చేపట్టి వచ్చిన కాడికి రుణాలు వసూలు చేసుకోవాలని రుణదాతలు భావిస్తున్నట్టు సమాచారం.