Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:19AM

ఓసీ బొందల్లో విద్యుత్‌ సంస్థల బూడిద

(ఆంధ్రజ్యోతి, గోదావరిఖని)
తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి సింగరేణిని ప్రయోగశాలగా మారుస్తున్న ప్రభుత్వం దానిలో అనేక విధానాల్లో మార్పును ఆకాంక్షిస్తున్నది... అందులో ప్రధానంగా సింగరేణి సంస్థను అంతర్జాతీయంగా విస్తరించడంతో పాటు ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడంపై దృష్టి పెట్టింది. అంతేకాకుండా ఇప్పుడు సింగరేణి ఆర్థిక విధానాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులకు ప్రతిపాదనలు, సూచనలు చేస్తున్నది. అందులో ప్రధానంగా బ్యాక్‌ఫిల్లింగ్‌పై దృష్టి పెట్టింది. సింగరేణి సంస్థ 14ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో తోడుతున్న మట్టి, బొగ్గు బొందల్లో తిరిగి మట్టిని నింపాల్సి ఉంటుంది. దీని కోసం గత నాలుగేళ్లుగా సంవత్సరానికి రూ.800 నుంచి రూ.1000 కోట్లు బ్యాక్‌ ఫిల్లింగ్‌ కోసం దాచిపెడుతున్నది. ఇప్పటికీ ఆ మొత్తం సింగరేణి వద్ద రూ.3800కోట్ల వరకు జమ అయ్యింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యామ్నాయ మార్గాలను సింగరేణికి సూచిస్తున్నది. ఇన్ని వేల కోట్లు సింగరేణి అభివృద్ధికి, కార్మికుల ప్రయోజనాలకు కాకుండా బ్యాక్‌ఫిల్లింగ్‌ కోసం దాచిపెట్టడం అవసరమైన చర్య కాదని భావిస్తున్నది. అసలు బ్యాక్‌ఫిల్లింగ్‌కు డబ్బు వెచ్చించాల్సిన అవసరమే లేదని భావిస్తున్నది. సింగరేణి ప్రాంతంలో అనేక విద్యుత్‌ సంస్థలు ఉన్నాయని, విద్యుత్‌ సంస్థల నుంచి వెలువడే బూడిదను బ్యాక్‌ఫిల్లింగ్‌కు వాడితే వేల కోట్లు వెచ్చించాల్సిన పని లేదని యోచిస్తున్నది. దీంతో విద్యుత్‌ సంస్థలు బూడిదను పోసేందుకు వేల ఎకరాల స్థలాన్ని తీసుకోవాల్సిన పని లేదని, బూడిద వల్ల కలిగే పర్యావరణ ఇబ్బంది కూడా తప్పుతుందని ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ముందు తన వాదనను పెట్టింది. ఈ విషయంలో సింగరేణిని, విద్యుత్‌ సంస్థలను సమన్వయపరిచి నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచిస్తున్నట్టు సమాచారం. గత పది రోజుల క్రితం సింగరేణి అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ విధాన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారితో ఈ అంశంపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయంలో ఒక నిర్ణయంతో సింగరేణి, జెన్‌కో అధికారులతో మాట్లాడినట్టు తెలిసింది. బ్యాక్‌ ఫిల్లింగ్‌కు విద్యుత్‌ సంస్థల బూడిదను వినియోగిస్తే సింగరేణి భవిష్యత్‌ బ్యాక్‌ఫిల్లింగ్‌పై వేల కోట్ల రూపాయలు జమ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు గత ఆర్థిక సంవత్సరం బ్యాక్‌ ఫిల్లింగ్‌కు జమ చేసే డబ్బులు తగ్గించి సింగరేణి లాభాలను కొంత ఎక్కువగా చూపిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ పరిణామం సింగరేణి కార్మికుల ప్రయోజనాలను కూడా పెంచే అవకాశం ఉంది. సింగరేణి సంస్థ లాభాల్లో గత 12యేళ్లుగా కార్మికులకు వాటా ఇస్తున్నారు. సింగరేణి లాభాలు పెరగడంతో కార్మికుల లాభాల శాతం పెరిగే అవకాశం ఉంది.