desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 03:01AM

వైసీపీని వీడే ప్రసక్తే లేదు!

వైసీపీని వీడే ప్రసక్తే లేదని నెల్లూరు ఎంపీ, వైసీపీ పీఏసీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వంద రోజుల పాలన భేషుగ్గా ఉందని కితాబిచ్చారు. జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నియామకంలో ఎలాంటి విబేధాలు లేవని, జిల్లాలో ఉన్న అందరు నేతలు కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడంతో మేకపాటి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు.
? ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించడం వెనుక
! మంచి చేసే వారిని ఎవరినైనా ప్రజలు గుర్తించుకుంటారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మోదీ తీసుకువస్తున్న సంస్కరణలతో జీడీపీ శాతం పెరిగింది. విదేశీ పర్యటనలు జరిపి ఆయా దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం తీసుకువచ్చారు. ఇవన్నీ చూసిన తరువాత సమర్ధుడైన ప్రధాని దేశానికి దక్కాడని పార్లమెంట్‌లో బడ్జెట్‌ సందర్భంగా ప్రస్తావించాను. ఇదే విషయాన్ని నియోజకవర్గ పర్యటనలలో ప్రస్తావించానే తప్ప ఇందులో ఎలాంటి ఉద్దేశాలు లేవు.
? మోదీ వంద రోజుల పాలనపై మీ అభిప్రాయం
! నిజంగా మోదీ వంద రోజుల పాలన భేషుగ్గా ఉంది. పేదలందరికీ బ్యాంకు ఖాతాల కోసం జన్‌-ధన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అంతేకాదు విద్యార్థులకు మరుగుదొడ్ల నిర్మాణమేగాక, పేదలకు కూడా ఆ సౌకర్యం కల్పిస్తూ పరిశుద్ధ భారత్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ప్రతి ఎంపీపై ఎంతో బాధ్య త పెట్టి ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు.
? మీరు దత్తత తీసుకునే గ్రామమేది
! నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నేను పుట్టి పెరిగిన బ్రాహ్మణపల్లే. కన్నతల్లి, జన్మభూమి మరవకుండా అక్కడి ప్రజలతో మమేకమై నడుస్తుంటాను. అందుకే ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా బ్రాహ్మణపల్లిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా.
? బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై
! వైసీపీ పుట్టుక నుంచి పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తు న్నా. సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్‌ పేరు చేర్చినందుకు కలత చెంది ఎంపీ పదవిని త్రుణప్రాయంగా వదులుకున్నాను. అలాంటి వ్యక్తి ని పార్టీని వీడుతున్నానని కొందరు చేస్తున్న ప్రచారం ఒట్టిదే. అస లు నేనెందుకు పార్టీని వీడాలని ఆ ప్రచారం చేసే వారిని అడుగుతున్నా. బీజేపీలో చేరే ప్రశ్నే లేదు. అదంతా ఒట్టి ప్రచారమే.
? అధినేత జగన్‌తో విబేధాలు ఉన్నాయా
! జగన్‌తో విబేధాలన్నవి ఏమీ లేవు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పార్టీ అధినేత సూచనలు పరిగణలోకి తీసుకుని ఎవరైనా నడవాల్సిందే. సార్వత్రిక ఎన్నికల తరువాత జగన్‌తో కలిసి ప్రధాని మోదీని కలిశాం. ఎన్డీఏ పొత్తులు కాకుండా కొన్ని అంశాలలో మద్దతు ఇస్తామని వెల్లడించాం. అధినేతగా ఆయన తీసుకునే నిర్ణయాలకు పార్టీలో ఉన్నప్పుడు పని చేయాల్సిందే.
? జిల్లా అధ్యక్షుడుగా ప్రసన్న నియామకంపై
! జిల్లా కన్వీనర్‌గా వ్యవహరించిన మేరిగ మురళి ఎంతో సమర్ధవంతంగా అందరిని సమన్వయంతో నడిపారు. అందుకే జిల్లాలో ఫలితాలు కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ఎన్నికల తరువాత పార్టీని మరింత పటిష్టత పరచాల్సిన అవసరం రావడంతో జిల్లాలో బలంగా ఉన్న సామాజిక వర్గానికి పార్టీ బాధ్యతలు అప్ప చెప్పాలని జగన్‌ నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గౌతంతోపాటు జిల్లా నేతలతో చర్చించే నిర్ణయం తీసుకున్నారు.
? నేతల మధ్య ఉన్న విబేధాలు ఎలా పరిష్కరిస్తారు
! పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసన్న సీనియర్‌ నేత. అందరిని కలుపుకుని గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా నడుస్తారని భావిస్తున్నా. రాజకీయ పార్టీలంటే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. అన్నింటిని పరిష్కరించుకుని అందరం సమన్వయంతోనే నడుస్తాం.