Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 02:59AM

కేసీఆర్‌ మూల్యం చెల్లించక తప్పదు

నందిగామ: అరవై ఏళ్ల చరిత్ర గల ఆంధ్రజ్యోతిని నియంత్రించాలని ప్రయత్నం చేస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తగిన మూల్యం చెల్లించుకుంటాడని ఏపీ శాసన మండలి విప్‌ నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. గురువారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, నిబద్దత, నిజాయితీ గల వార్తలు ప్రసారం చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న ఏబీఎన్‌, టీవీ9 చానళ్ల ప్రసారాలు నిలిపివేయడం శోచనీయమన్నారు. ప్రసారాల పునరుద్దరణ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళా జర్నలిస్టులపై తెలంగాణా ప్రభుత్వం అనుసరించిన తీరుకు ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుందన్నారు.మెడలు విరుస్తామంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. నీతి, నిజాయితీలు గల తంగిరాల ప్రభాకరరావు మరణంతో ఏర్పడిన నందిగామ ఉప ఎన్నికలలో సంప్రదాయాలను పక్కన పెట్టి పోటీకి దిగిన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, పరిపాలనా సౌలభ్యం కోసం ముందుకు చూపుతో చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారన్నారు. మాజీ మంత్రి జేఆర్‌ పుస్ఫరాజ్‌ మాట్లాడుతూ, తెలుగుదేశం హయాంలోనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం జరిగిందన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రజల సంపదను దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం కోసం పాటుపడలేదన్నారు. టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు ఆచంట సునీత, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, బూరగడ్డ రమేష్‌ నాయుడు, లంక దాసరి, శాఖమూరి స్వర్ణలత, కొత్తా రంగనాయకమ్మ పాల్గొన్నారు.