Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 02:55AM

మలేరియా విభాగానికి సిబ్బంది కొరత

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: ఇది మలేరియా వ్యాధి పెరిగే కాలం. కొద్దిగా వర్షాలు పడితే చాలు దోమలు స్వైరవిహారం చేస్తాయి. వర్షాకాలంలో మలేరియా కేసులు బాగానే ఉంటాయి. కానీ ఈ మలేరియా వ్యాధిని గుర్తించే సిబ్బందే ప్రస్తుతం లేరు. మలేరియాపై అప్రమత్తం చేయడానికి ఉండాల్సిన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. మలేరియా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ముందే తెలిసి కూడా వైద్యాధికారులు సిబ్బందిని నియమించడంలో చొరవ తీసుకోవడం లేదు. ప్రస్తుతం జిల్లా వైద్యాశాఖాధికారి పరిధిలో కేవలం ల్యాబ్‌ టెక్నీషియన్‌, హెల్త్‌ అసిస్టెంట్స్‌ కొరత తీవ్రంగా ఉంది.
17 మందికి ఒకే ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌
మలేరియా వ్యాధిని గుర్తించడానికి ల్యాబ్‌ టెక్నీషియన్‌ చాలా అవసరం. రక్త నమునాలు సేకరించిన తరువాత ఆ వ్యాధిని టెక్నీషియన్‌ పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. కానీ ప్రస్తుతం ల్యాబ్‌ టెక్నీషియన్లు లేరు. డీఎం అండ్‌ హెచ్‌ఓ పరిధిలో 17 మంది ల్యాబ్‌ టెక్నీషియన్ల అవసరం ఉండగా కేవలం ఒకరితో పనులు నిర్వహించేస్తున్నారు. ఇప్పటివరకు వేసవి సీజన్‌ కావడంతో ఎలాగో అలా గడిచిపోయింది. ఇప్పుడు సీజన్‌ రావడంతో టెక్నీషియన్ల డిమాండ్‌ పెరిగింది. రోజుకు వందల సంఖ్యలో రక్త నమునాలు వివిధ మలేరియా సబ్‌ యూనిట్లకు వస్తాయి. అక్కడ ల్యాబ్‌ టెక్నీషియన్లు లేకపోతే మలేరియా నిరారణ పరీక్షలు నిర్వహించడం కష్టమే.
107 మంది హెల్త్‌ అసిస్టెంట్లకు ఉన్నది 19 మంది మాత్రమే
డీఎం అండ్‌ హెచ్‌ఓ పరిధిలో హెల్త్‌ అసిస్టెంట్ల కొరత తీవ్రగా ఉంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 107 మంది హెల్త్‌ అసిస్టెంట్లు ఉండాలి. కానీ ప్రస్తుతం రెగ్యులర్‌ సిబ్బంది మాత్రం 19 మందే ఉన్నారు. ఇంకా 88 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరముంది. అయితే ప్రస్తుతం 35 మందిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించారు.
ఏర్పాటు కాని ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం
మలేరియాను నియంత్రించడానికి ర్యాపిడ్‌ యాక్షన్‌ టీంలను ఏర్పాటు చేయడం చాలా అవసరం. టీంలో మెడికల్‌ ఆఫీసర్‌, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌, ల్యాట్‌ టెక్నీషియన్‌, ఎంటామాలజిస్టులు ఉంటారు. వీరి పర్యవేక్షణలో బస్తీల్లో విస్తృతంగా మలేరియా వ్యాధి తీవ్రతపై పరిశీలన నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇంత వరకు సిబ్బంది కొరత కారణంగా ఈ బృందాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు. అదే విధంగా ఈ కాలంలో మలేరియా వ్యాధి బాధితులను గుర్తించడానికి బస్తీలు, మురికివాడల్లో ర్యాపిడ్‌ డయగ్నోస్టిక్‌ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది.