Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 02:51AM

పంచాయతీల్లో ఆన్‌లైన్‌ పాలన

నేటి ఆధునిక యుగంలో సాంకేతిక విజ్ఞానం పరుగులు తీస్తోంది... నిన్నమొన్నటి వరకు సాంకేతిక పరిజ్ఞానం నగరాలు, పట్టణాలకే పరిమితమై అక్కడి ప్రజలు చాలా రకాల సేవలను సులభతరంగా పొందుతున్నారు. ఇంట్లో నెట్‌ సౌకర్యం ఉంటే కాలుకూడా కదపకుండా చాలారకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ సేవలను పొందుతూ సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో పల్లెవాసులకు కూడా ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పంచాయతీరాజ్‌ వ్యవస్ధను శక్తిమంతంగా తయారు చేసేందుకు ప్రభుత్వాలు పంచాయతీ సాంకేతిక సమాచార సంస్ధ (ఎన్‌ఐపీ) సౌజన్యంతో శ్రీకారం చుట్టాయి. ఈ కారణంగా గ్రామీణుల ముంగిటకే అన్ని రకాల మెరుగైన సేవలను అందించాలని ఈ పంచాయతీ విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో గ్రామ పంచాయతీలను ఈ పంచాయతీలుగా మార్చేందుకు కడప జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఇందుకు జిల్లాలో ఉన్న పంచాయతీల్లో కొన్నింటిని మొదటి విడత కింద ఎంపికచేసి ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో బాగంగానే జిల్లాలో 790 గ్రామ పంచాయతీలుండగా వీటిని 371 క్లస్టర్లుగా ఏర్పాటుచేశారు. వీటిలో 134 పంచాయతీలను ఈ పంచాయతీ సేవలు అందించడానికి ఎంపికచేశారు. జనాభా, ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌ లభ్యత, పంచాయతీ ఆదాయం తదితర అంశాల ఆధారంగా ఈ పంచాయతీలను ఎంపికచేశారు. ఈ పంచాయతీలకు సంబంధించి కంప్యూటర్లు సరఫరా, ఆపరేటర్ల నియామకం, శిక్షణ వంటి కార్యక్రమాల అమలు బాధ్యతను హైదరాబాద్‌లోని కార్వీ అనే ఓ ప్రైవేటు సంస్ధకు అప్పగించారు. అయితే ఎంపిక చేసిన ఈ పంచాయతీలకు కంప్యూటర్లు మంజూరుచేయగా, వాటిని ఆయా పంచాయతీలకు సరఫరా చేసి వాటి ద్వారా పనులు ప్రారంభించారు. కంప్యూటర్‌ ఆపరేటర్ల నియామకం కూడా కార్వీ సంస్ధ పూర్తిచేసి వారిచేత విధులు కొనసాగిస్తోంది. వీరికి రాష్ట్ర గ్రామీణాభివృఽధ్ధిశాఖ ద్వారా శిక్షణ ఇప్పించి అనంతరం ఈ పంచాయతోల్లో విధులు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు గాను తొలివిడతలో 77 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించారు. అయితే ఈ పంచాయతీ సేవలు 134 సంచాయతీలలో జరుగుతుండడంతో రెండేసి పంచాయతీలకు ఒక ఆపరేటర్‌ చొప్పున విధులు నిర్వర్తించనున్నారు.

ఆర్థిక సంఘం గ్రాంటుతో లింకు
13వ ఆర్థిక సంఘం పంచాయతీరాజ్‌ సంస్ధలకు విడుదల చేస్తున్న గ్రాంటులో 70 శాతం పంచాయతీలకే కేటాయించారు. మంచినీటి సరఫరా, పారిశుధ్యం, అంతర్గత రోడ్ల నిర్వహణ వంటి అంశాలతో పాటు పంచాయతీలను కంప్యూటరీకరించాలనే నిబంధన కూడా విధించారు. ఈ పంచాయతీ సేవలు అందదుబాటులోకి వస్తే జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, ఇంటిపన్నుతో సహా ఇతర పన్నుల చెల్లింపు, వ్యాపార లైసెన్సుల జారీ వంటి సేవలు సులభతరం అవుతాయి. దీంతో గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాల ఖాతా నిర్వహణ పారదర్శకంగా జరగనుంది. భవిష్యత్తులో మీసేవ తరహాలో ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు, అదనపు ఆదాయం సమకూర్చే రీతిలో ఈ పంచాయతీల నిర్వహణ ఉం డాలని పలువురు సర్పంచ్‌లు కోరుతున్నారు.

మూడంచెలుగా
కొనసాగింపు
ఈ కార్యక్రమాన్ని అభివృద్ధిపరిచి మూడు అంచెలుగా ముందుకు తీసుకెళ్ళనున్నారు. ప్రాధమికంగా గ్రామాల్లో జనన మరణాల నమోదు, ఇంటిపన్నులు, లైసెన్స్‌ ఫీజు వసూళ్లను చేపట్టనున్నారు. పనుల పర్యవేక్షణ, పంచాయతీ సమావేశాలు, ప్రజాప్రతినిధుల సమాచారం, ఉద్యోగుల వివరాలు, వేలంపాటలు, కోర్టుకేసులు, తనిఖీలు, సమాచార హక్కుచట్టం, ఆడిట్‌, ఫిర్యాదులకు సంబంధించిన ఎంఐఎస్‌ రిపోర్టులు, పంచాయతీరాజ్‌ నిధులకు సంబంధించి ఈ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వీటిని పూర్తిస్ధాయిలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మూడంచెలుగా ఈ పంచాయతీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
ముఖ్యమైన
అప్లికేషన్లు ఇలా.....
ప్లాన్‌ప్లస్‌ ద్వారా జిల్లా ప్రణాళిక కమిటీ నుంచి తుది ఆమోదం పొందేవరకు కార్యక్రమంతా వెబ్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్లు గ్రహించి రిపోర్టులను అందిస్తాయి. ఇవి కేంద్రస్ధాయిలో జాతీయ ప్రణాళికలను రూపొందించేందుకు ఉపయోగపడుతాయి. యాక్షన్‌ స్టాఫ్‌ ద్వారా స్ధానిక రికార్డులు ఆర్ధిక ప్రగతిని చూపెడతాయి. ప్రియాసాఫ్ట్‌ ద్వారా ఉగ్యోగులకు శిక్షణ గురించి ఇందులో అప్లికేషన్లు ఉంటాయి. లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరీ ద్వారా అప్‌డేట్‌ సమాచారం ఉంటుంది. నేషనల్‌ పంచాయత్‌ పోర్టల్‌ ద్వారా పంచాయతీలకు సంబంధించిన సమాచారం లభ్యమవుతుంది. ఏరియా ప్రొఫైలర్‌, నేషనల్‌ అసెట్‌ డైరెక్టరీ, సర్వీసెస్‌, సోషల్‌ ఆడిట్‌ తదితర అంశాలు గ్రామీణుల చెంతకు రానున్నాయి. వీటిపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే సర్పంచులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఈ పంచాయత్‌తో అన్ని రకాల సేవలు సామాన్యునికి అందుబాటులోకి వచ్చాయి.