Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 02:03AM

శ్రీనగర్‌ నుంచి బయలుదేరిన మారుతి


నర్మెట: జమ్ముకాశ్మీరులోని శ్రీనగర్‌లో ముంచెత్తన వరదల్లో చిక్కుకున్న మండలకేంద్రానికి చెందిన బీటెక్‌ విద్యార్థి గురువారం క్షేమంగా ఇంటికి బయలుదేరాడు. ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థి ఈమేరకు తల్లిదండ్రులకు తాను క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. మండలకేంద్రానికిచెందిన ప్రజ్ఞాపురం రజితకుమారి-అంజయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కూతు రు ఉండగా పెద్దకుమారుడు ఉదయ్‌, కుమార్తె శైలజ బీటెక్‌ పూర్తిచేశారు. గత యేడాది చిన్నకుమారుడు మారుతి ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ పరీక్షరాసి జమ్ముకాశ్మీరులోని శ్రీనగర్‌లో హజరత్‌బల్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో సీటురావడంతో అక్కడికి వెళ్లి చదువుకుంటున్నాడు. వారం రోజులుగా శ్రీనగర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు హజరత్‌బల్‌ నిట్‌ కళాశాల వరదల్లో చిక్కుకుంది. దీంతో మారుతితోపాటు పలువురు విద్యార్థులు వరదల్లో చిక్కుకున్నారు. అక్కడున్న సైనికులు, కళాశాల యాజమాన్యం సహాయంతో లడఖ్‌లోని లెహ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ మారుతికి చెందిన మొబైల్‌ ఫోన్‌ పనిచేయకపోవడంతో మిత్రుడి సెల్‌నుంచి బుధవారం రాత్రి నర్మెటలోని తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తాను క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం తమ ప్రయాణానికి ఎలాంటి ఖర్చులు ఇవ్వలేదని సమాచారం ఇవ్వడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే రూ.20వేలు ఫ్లయిట్‌ చార్జీలకోసం మారుతి అకౌంట్‌లో జమచేసినట్లు తెలిపారు. ఈమేరకు గురువారం మధ్యాహ్నం లడఖ్‌నుంచి ఢిల్లీకి చేరుకుని రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు తల్లిదండ్రులకు సమాచారాన్ని ఇచ్చాడు.
జలప్రళయాన్ని ప్రత్యక్షంగా చూశా..
ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో వచ్చిన వరదబీభత్సాన్ని టీవీలోనే చూశాను తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదని, కానీ శ్రీనగర్‌లో జలప్రళయాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు విద్యార్థి మారుతి గురువారం ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పాడు. జమ్ములో వారం రోజులు గా కురుస్తున్న వర్షాలకు తాను చదువుతున్న కళాశాల పూర్తిగా నీటమునిగిందని, తమ హాస్టల్‌ చివరి అంతస్తులో లగేజీని భద్రపర్చుకుని మిత్రులతో కలిసి అతికష్టంమీద లడఖ్‌లోని లెహ్‌ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలిపాడు.
శ్రీనగర్‌లో వరదలను చూసి ఉత్తరాఖండ్‌ వరదలు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని బియాస్‌నదిలో విద్యార్థులు గల్లంతైన దృశ్యాలు గుర్తుకు వచ్చాయని, నర్మెటకు వస్తాననో రానోనని భయాందోళన చెందానని చెప్పాడు. హైదరాబాద్‌ కు రావడానికి తనవద్ద డబ్బులేదని, కనీసం టిఫిన్‌ చేయడానికి కూడా డబ్బులేక పస్తులు ఉన్నట్లు తెలిపాడు. విషయాన్ని అమ్మా, నాన్నలకు తెలుపడంతో తన అకౌంట్‌లో రూ.20వేలు వేశారని చెప్పాడు. కాగా, వరదల్లో చిక్కుకుని బయటపడిన తమ కుమారుడు మారుతి రాకకోసం నర్మెటలో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.