Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:28AM

కేడర్‌లో జోష్‌


(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)కార్యకర్తల సమావేశం అంటే నాయకుల ప్రసంగాలు కాదు.. కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం.. వారి సలహాలు, సూచనలు, విమర్శలు ఆహ్వానించడం.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి వారిచ్చే సలహాలు ఆచరణలో పెట్టడం. శ్రీకాకుళంలో గురువారం జరిగిన టీడీపీ జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో ఇదే జరిగింది. సమావేశం ప్రారంభంలోనే మంత్రి మాట్లాడుతూ ఈ సమావేశం కార్యకర్తలదే. మీసమస్యలు ఏమిటి. పార్టీ మెరుగుదలకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి సూచనలు, సలహాలు, గత పదేళ్లుగా ఎదుర్కొన్న ఇబ్బందులు కార్యకర్తలే చెప్పాలని మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు స్పష్టం చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకర్తలే తాము అనుభవించిన పరిస్థితులను వివరించారు. ఈవిధంగా జిల్లా స్థాయి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో అచ్చెన్నాయుడు నూతన పంఽథాకు తెరలేపారు. కార్యకర్తలు ఎదురొంటున్న సమస్యలు, పార్టీ పటిష్టానికి తీసుకోవలసిన చర్యలపై కార్యకర్తలంతా తమ అభిప్రాయాలను వెల్లడించారు. చివరిగా ప్రజా ప్రతినిధులు మాట్లాడారు. జిల్లాస్థాయిలో జరుగుతున్న సమావేశంలో కార్యకర్తలకు ప్రాధాన్యత నిచ్చి వారి అభిప్రాయాలను విని వారి ఆలోచనలకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పటం ద్వారా తెలుగుదేశం పార్టీ నూతన ఒరవడికి తెరలేపింది. కార్యకర్తల అభిప్రాయాలు, మండల స్థాయి నాయకుల ప్రసంగాలను మధ్యాహ్నం వరకు కొనసాగించారంటే అచ్చం కార్యకర్తల సమావేశంలా అనిపించింది. గతంలోని సమావేశాలకు భిన్నంగా గురువారం అంబేద్కర్‌ ఆడిటోరియంలో సమావేశం జరిగింది. దీంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. ఏ రాజకీయ పార్టీలోనూ లేని విధంగా కార్యకర్తల కోసం రూ.200 కోట్లతో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంపై అనందం వ్యక్తమైంది. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. పోలీస్‌స్టేషన్లకు వెళితే ఏతప్పూ చేయని తమపై కేసులు నమోదు చేసిన వైనాన్ని వివరించారు. ఎమ్మెల్యే స్థాయికి వచ్చేందుకు తాను మూడు దశాబ్దాలుగా స్వచ్ఛమైన టీడీపీ కార్యకర్తగా పనిచేసిన విషయాన్ని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గుర్తుచేసుకున్నారు. అంకితభా వంతో పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపుంటుందనడానికి తానే ఉదాహరణని వివరించారు.