desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:27AM

కార్యకర్తలకే జై


( శ్రీకాకుళం) పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పటికీ.. మనోధైర్యం కోల్పోకుండా అండగా నిలబ డి ప్రస్తుతం అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేసిన కార్యకర్తలకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువా త మొదటిసారిగా పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని గురువారం అం బేద్కర్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు, దివంగత నేత ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ గత పదేళ్లుగా ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పాలించాయని, ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం జనరంజక పాలన అందించనుందని చెప్పారు. పార్టీ లో ఎవరు తప్పు చేసినా క్షమార్హం కాదన్నారు. కార్యకర్తలు
ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చినా వాటిని వెంటనే అమలుచేస్తామని ప్రకటించారు. విభజనానంతరం రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటులో కూరుకుపోయిందని, అయినప్పటికీ దేశంలో రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాత్రి, పగలు కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని జిల్లాలను అభివృద్ధి పథంలో పయనింపజేయడానికి చర్యలు తీసుకుంటున్నారని, ఈ సందర్భంగా జిల్లాకు 12 వరాలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్టోబర్‌ 2 నుంచి నిరంతర విద్యుత్‌ వెలుగులు అందుతాయని, ప్రతినెలా రూ.1000 చొప్పున పింఛన్‌ అందుతుందని తెలిపారు. మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయాలన్న ముఖ్యమంత్రి కృషికి పార్టీ కార్యకర్తలంతా తగిన మద్దతు ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులందరికీ ఆ ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అధికారులను ప్రక్షాళన చేద్దాం: జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు అధికారుల పాత్ర ఎంతో ఉంటుందని, అలా కష్టపడి పనిచేయని అధికారులు మనకొద్దని మంత్రి అన్నారు. ముందుగా అధికారులను ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో అన్నీ అక్రమాలేనని, ఇప్పుడు ఓ నరహంతకుడు ప్రతిపక్ష నాయకుడయ్యాడని విమర్శించారు. జగన్‌ హైదరాబాద్‌ నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే కోర్టు అనుమతి పొందాలని, అతనిపై 11 కేసుల్లో చార్జిషీటు ఫైల్‌ నమోదుచేశారని, ఇటువంటి వారు ప్రతిపక్షనాయకుడు కావడం దురదృష్టకరమన్నారు. ఈ విషయం తలచుకుంటేనే తనకు బాధగా ఉందన్నారు. జిల్లాలో ఇసుక, భూ మాఫియాతో పదేళ్లు గడిచిపోయిందని, ప్రస్తుతం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి విజన్‌తో ముందుకు వెళ్తున్నారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. స్కాముల్లో ఉన్నవారు, జైలు జీవితం గడిపిన వారూ ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఎలా ఊరుకోగలమని, టీడీపీ పగ రాజకీయాలకు పాల్పడదన్నారు. ప్రతీ కార్యకర్త ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రితో సమానమని, ఇకపై కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి అన్ని పనులూ చేపడతామన్నారు. ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి చట్టబద్దంగా రూ.26 వేల కోట్లు రావాల్సి ఉందని, త్వరలో రుణమాఫీ అమలవుతుందన్నారు. 2019నాటికి శ్రీకాకుళం జిల్లాలో 13 నియోజకవర్గాలు ఏర్పడనున్నాయని, అన్నింట్లోనూ తెలుగుదేశం విజయపతాక రెపరెపలాడాలన్నారు. అనంతరం అందరూ మూకుమ్మడిగా శ్రీకాకుళం జిల్లాకు ఎర్రన్నాయుడి పేరు పెట్టాలని తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ గ్రామస్థాయిలో వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారుల్ని, రేషన్‌ డీలర్లని, ఉపాధిహామీ ఫీల్డ్‌అసిస్టెంట్లనీ తొలగించాలని కోరారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్‌, మాజీ మంత్రి శత్రుచర్ల, మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పీవీ రమణ, జిల్లా ప్రధానకార్యదర్శి బోయిన గోవిందరాజులు, జిల్లా అధికార ప్రతినిధి కలిశెటి అప్పలనాయుడు , పార్టీనాయకులు, కార్యకర్తలు, మున్సిపల్‌చైర్‌పర్సన్లు, జడ్పీటీసీ సభ్యులు, పాల్గొన్నారు.