Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:20AM

మలుపులతో ముష్కిల్‌..!


ప్రమాదాలకు నిలయాలుగా మారిన రహదారులు
పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు

కీసర : శామీర్‌పేట నుండి ఘట్‌కేసర్‌ వెళ్లే రహదారిలో శామీర్‌పేట-కీసర రోడ్డు మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుర్తించలేని విధంగా మలుపులు ఉండటం.. దీనికితోడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల వల్ల ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఘట్‌కేసర్‌ నుంచి గజ్వేల్‌, తూప్రాన్‌ వైపు మేడ్చల్‌ నుండి భూవనగిరి, అబ్ధుల్లాపూర్‌మెట్టు వైపు వెళ్లాలంటే ఈదారే దగ్గరగా ఉండటం వల్ల నిత్యం వందలాది వాహనాలు ఈ రోడ్డుగుండా 24 గంటలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్‌ అండ్‌ బీ పరిధిలో ఉన్న ఈ రోడ్డు వెంట ప్రమాద సూచికలు, సూచనలు ఏవీ లేకపోవడం వల్ల ఎదురెదురు ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి వేళల్లో వాహనాలు మితిమీరిన వేగంతో ఉండి మలుపుల వద్ద బోర్లా పడుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. 2011 నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డు వెంట జరిగిన ప్రమాదాల్లో 20 మంది వరకు మృత్యువాత పడగా 115 మంది క్షతగాత్రులయ్యారు. తమ భద్రత కోసం ఈ రహదారి వెంట ఉన్న గ్రామాల ప్రజలు చెట్లను తొలగించే కార్యక్రమం చేపడితే ఆర్‌ అండ్‌ బీ, హెచ్‌ఎండీఏ అధికారులు ఇబ్బందులు పెట్టారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.