Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:05AM

పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో విశ్వసనీయతకు సమాధి


గజ్వేల్‌: పదేళ్ల కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో విశ్వసనీయత సమాధి అయ్యిందని కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, సదానందగౌడ అన్నారు. గురువారం గజ్వేల్‌ పట్టణంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగసభలో వారు పాల్గొన్నారు. సమాచార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డిని గెలి పిస్తే టీడీపీ రుణం తీర్చుకునేందుకు తాము ఆ పార్టీ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డికి కేంద్రంలో మంచి పదవి ఇప్పిస్తామన్నారు. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ వైఫల్యం కారణంగానే తెలంగాణలోని ఏడు రెవెన్యూ మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయన్నారు. వందరోజుల కేసీఆర్‌ పాలనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నద న్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే టీడీపీ, బీజేపీలకే అధికారం దక్కుతుందన్నారు. ఆంధ్రా, తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి రెండు కళ్లు అన్నారు. అభివృద్ధి తప్ప ప్రధాని నరేంద్రమోదీకి రెండో ఎజెండా లేదన్నారు. మీడియాను నిర్బంధించండం కేసీఆర్‌కు మంచిది కాదన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామిక భాషలో మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతిపక్షపాత్రకే పరిమితమై అభివృద్ధి దెబ్బతింటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థిని గెలిపించి, ఓటర్లు విజ్ఞత ప్రదర్శించాలని కోరారు. దేశంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే తమ(మోదీ) ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదన్నారు. జన్‌ధన్‌ యోజన పథకంలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది పేదలు ఆయా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారన్నారు. కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ మాట్లాడుతూ జగ్గారెడ్డిని గెలిపిస్తే మెదక్‌, గజ్వేల్‌(అల్వాల్‌, గజ్వేల్‌, సిద్దిపేట, కరీంనగర్‌)లకు రైల్వే సౌకర్యం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు మరిచిపోవాలన్నారు. దేశ విశ్వసనీయతను దెబ్బతీసిన కాంగ్రెస్‌ను పాతరవేయాలన్నారు. 2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీకీ అధికారం ఖాయమన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ పాలనను ప్రపంచం వేయినోళ్లతో కీర్తిస్తుందన్నారు. అమెరికా, జపాన్‌ వంటి దేశాలు సైతం మోదీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి మెదక్‌ అభ్యర్థి గెలుపు కీలకం కావాలన్నారు. ఇటీవల మాసాయిపేట దుర్ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా కేంద్రమంత్రి జవదేకర్‌ హిందీ ప్రసంగాన్ని బీజేపీ నేత డాక్టర్‌ లక్ష్మణ్‌, మరో కేంద్రమంత్రి సదానందగౌడ ఆంగ్ల ప్రసంగాన్ని రఘునందన్‌రావు తెలుగులోకి అనువదించారు.
సంగారెడ్డిలో...
సంగారెడ్డి టౌన్‌: అభివృద్ధి అంటే నరేంద్రమోదీ... నరేంద్రమోదీ అంటేనే అభివృద్ధి అని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ్‌ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని జంగిమైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ముఖ్య అతిథులుగా సదానందగౌడ్‌తో పాటు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సదానందగౌడ్‌ మాట్లాడుతూ ఉప ఎన్నికలో అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. అనంతరం సమాచార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరి పితే రాష్ట్రంలో టీడీపీ, బీజేపీలు ఉమ్మడిగా అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. మీడియాను పాతరేస్తానంటున్న కేసీఆర్‌ ముందుగా అవినీతిని పాతరేయాలని హితవు పలికారు. ప్రధాని మోదీకి తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని, ఈ రాష్ట్రాల్లో అన్ని రకాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధనబలం, అధికార దుర్వినియోగంతో ప్రజల్లోకి వెళ్తే, బీజేపీ-టీడీపీ ప్రేమతో, అభివృద్ధిపై హామీతో వెళ్తోందన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యతిరేక వార్తలు రాస్తే మింగుడు పడని సీఎం కేసీఆర్‌ మీడియాపై ఆంక్షలు విధిస్తూ రాజ్యాంగ హక్కును కాలరాసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మీడియాను 10 కిలో మీటర్ల ఆవల పాతరేస్తామంటున్న కేసీఆర్‌నే ప్రజలు పాతర వేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. బంగారు తెలంగాణ అంటే మహిళా జర్నలిస్టులను జైళ్లకు పంపడమా?.. లేక కరెంట్‌ అడి గిన రైతులపై లాఠీచార్జి చేయించడమో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అహంకారం, గర్వాన్ని తగ్గించాలంటే జగ్గారెడ్డి గెలుపుతో టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కేసీఆర్‌కు ఆత్మగౌరవం, చిత్తశుద్ధి ఉంటే 17న తెలంగాణ విమోచన దినోత్సవంలో గొల్కొండ కోటాపై జాతీయ జెండాను ఎగురవేయాలని డిమాండ్‌ చేశారు. అనం తరం నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలో కేసీఆర్‌ను హైలెట్‌ చేసిన చానళ్లను మూసివేయించడం దుర్మార్గమన్నారు. రజ్వీ పాలనను మరిపిస్తున్న కేసీఆర్‌ కాశీం చంద్రశేఖర్‌ రజ్వీగా మారారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌కు కారు గుర్తుకంటే కత్తెర వచ్చి ఉంటే బాగుండేదని ఛలోక్తి విసిరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, అధికారి ప్రతినిధి నర్సిరెడ్డి, బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచార్య, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, తీగల కృష్ణారెడ్డి, గాంధీ, ఎంపి.మల్లారెడ్డి, ఎమ్మెల్సీ దిలీప్‌రెడ్డి పాల్గొన్నారు.ూఃళీరీ